భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్... ఇంగ్లండ్ బ్యాటింగ్

  భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ముంబైలోని  వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా కుక్ మాట్లాడుతూ, ముంబైలో ఆడుతుండటం ఆనందంగా ఉందని... ఇక్కడ తమకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపాడు. ఇండియన్ కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, టాస్ ఓడిపోవడం పెద్ద సమస్య కాదని.. గత మ్యాచ్ లలో ఆడిన విధంగానే ఈ మ్యాచ్ లో కూడా ఆడి, గెలుస్తామని చెప్పాడు.   ఇంగ్లండ్ జట్టు: ఏ.కూక్, జే.జెన్నింగ్స్, జే.రూట్స్, ఎం.అలీ, జే.బెయిర్‌స్టో, బి.స్టోక్స్, జే.బట్లర్, సి.ఓక్స్, ఏ.రషీద్, జే. బాల్, జే.అండర్‌సన్   భారత జట్టు: మురళి విజయ్, కేఎల్.రాహుల్, ఛతేశ్వర పూజారా, విరాట్ కోహ్లీ, కరణ్ నాయర్, పార్థీవ్ పటేల్, అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్

ఢిల్లీని కప్పేసిన పొగమంచు...

  దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దుప్పటిలా కప్పేసింది. మొన్నటి వరకూ వాయు కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఢిల్లీ వాసులకు ఇప్పుడు పొగమంచు.. 'పగమంచు'లా పట్టుకుంది. దీంతో ఢిల్లీలో రవాణా, రోడ్డు వ్యవస్థ ఒక్కసారిగా స్థంభించిపోయింది. ఈ పొగమంచు కారణంగా దాదాపు 100కు పైగా రైళ్లు ఆలస్యంగా వస్తున్నాయి..మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఇక విమానాశ్రయం వద్ద అయితే పొగమంచు కారణంగా రన్ వే కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.  6 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో రెండు దేశీయ విమానాలు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

బీసీసీఐ కు సుప్రీం ఊరట.. 1.33 కోట్లు విడుదల..

  బీసీసీఐ, లోథా కమిటీ మధ్య గత కొద్ది రోజులుగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. లోథా కమిటీ చేసిన సిఫార్సులను కొన్ని అమలు పరచడానికి కుదిరినా.. కొన్ని మాత్రం అమలు పరచలేమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో డబ్బులు లేకుండా మ్యాచ్ ల నిర్వహణ అసాధ్యమని బీసీసీఐ సుప్రీంకోర్టునుఆశ్రయించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ కు ఊరట కలిగే ఓ నిర్ణయాన్ని తీసుకుంది సుప్రీంకోర్టు. అదేంటంటే.. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలోభాగంగానే.. ఇంగ్లండ్ తో సిరీస్ లో మిగిలి ఉన్న రెండు టెస్టు మ్యాచ్ ల నిర్వహణకు 1.33 కోట్ల రూపాయలు, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లకు ఒక్కో మ్యాచ్ నిర్వహణకు 25 లక్షల రూపాయలు చొప్పున నిధులు విడుదల చేయాలని సుప్రీంకోర్టు బ్యాంకులను ఆదేశించింది.

రాత్రి పూట పెరుగు తింటే మటాషే..?

భారతీయుల భోజనంలో ఖచ్చితంగా ఉండే పదార్థాల్లో పెరుగు ఒకటి..అత్యధికులకు ఇది లేనిదే భోజనం చేసిన సంతృప్తి కలగదంటే అతిశయోక్తి కాదు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలోనూ, ఆహారాన్నీ సులువుగా జీర్ణం చేయడంలో, దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు పెరుగు వల్ల లభిస్తాయి. అందుకే మన పూర్వీకులు పెరుగును భోజనంలో తప్పనిసరి చేశారు. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు పెరుగు వల్ల లాభంతో పాటు నష్టం కూడా కలుగుతుందట. పగలు ఎంత తిన్నా కానీ రాత్రిపూట మాత్రం పెరుగును అస్సలు తినకూడదట. శరీరంలో కఫ శాతాన్ని పెంచే గుణం పెరుగులో ఉంటుందట. కఫం వల్ల అనేక అనారోగ్యాలు కలిగే అవకాశం ఉండటం వల్లే రాత్రిపూట పెరుగును నిషేధించారు పెద్దలు. రాత్రిపూట ఖచ్చితంగా పెరుగు తినాలనుకుంటే అందులో కాస్త చక్కెర లేదా మిరియాల పొడిని వేసుకోవాలి. అంతేకానీ గట్టి పెరుగు మాత్రం తినకూడదు. పెరుగులో కొంత నీరు పోసి మజ్జిగలా చేసుకుని తినడం అన్ని విధాలా ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

శశిథరూర్ ఇంట్లో చోరీ..పెన్‌డ్రైవ్‌లే ఎందుకు ఎత్తుకెళ్లారు

  మాజీ కేంద్రమంత్రి, దివంగత సునంద పుష్కర్ భర్త శశిధరూర్ ఇంట్లో చోరీ జరిగింది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో దుండగులు చొరబడి విలువైన విగ్రహాలు, వస్తువులను దోచుకెళ్లినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన వాటిలో 12 గణేశుడి విగ్రహాలతో పాటు..పది హనుమాన్ విగ్రహాలు, గాంధీ వాడిన రాగి గ్లాసులు కూడా ఉన్నాయి. అయితే చోరీ చేసిన వారు విగ్రహాలతో పాటు 12 పెన్‌డ్రైవ్‌లు కూడా ఎత్తుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుండగులు పెన్‌డ్రైవ్‌లు చోరీ చేయడానికి వచ్చి అనుమానం రాకుండా ఉండటానికి మిగిలిన సంపద కూడా దోచుకెళ్లినట్లు భావిస్తున్నారు. కాగా, థరూర్ భార్య సునంద పుష్కర్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 2014 జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు..ఆ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది..ఈ కేసులో శశిథరూర్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెన్‌డ్రైవ్‌ల చోరీ కలకలం రేపుతోంది.

ప్రతిపక్షాలపై వెంకయ్య మండిపాటు... అపచారం చేస్తున్నాయి..

  పార్లమెంట్లో ప్రారంభం అవ్వడం మొదలు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగే పనిలోనే పడ్డాయి. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇదే తంతు. ఈనేపథ్యంలో ప్రతిపక్షాల తీరుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌ వ్యవస్థకే అపచారం చేస్తున్నాయని.. గతంలో భారీ కుంభకోణాల వల్లే పార్లమెంట్‌లో ప్రతిష్టంభనలు వచ్చాయి.. మోదీ ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలు, ఆరోపణలు, కాగ్‌ అక్షింతలు ఏమీ లేవన్నారు. చర్చకు సిద్ధమని చెప్పినా ఎందుకు అడ్డుకుంటున్నారో వారికే తెలియదన్నారు. లోపాలు ఉంటే నిలదీయాలిగానీ.. సభను అడ్డుకోవడం సంస్కృతి కాదన్నారు. 44మంది సభ్యులున్న పార్టీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనీయట్లేదన్నారు. తాము చెప్పినట్లు వినమనడం ఏ ప్రజాస్వామ్యమో వారే చెప్పాలన్నారు.

మరో వివాదంలో గాలి జనార్ధన్ రెడ్డి.. డ్రైవర్ ఆత్మహత్య..

  ఇప్పటికే కూతురు పెళ్లికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది అని గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు రాగా.. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు.  కర్నాటకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. అక్కడ దొరికిన సూసైడ్ నోట్ లో గాలి జనార్ధన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివరాల ప్రకారం.. మ‌ద్దూర్‌లో ర‌మేశ్ గౌడ అనే వ్య‌క్తి విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అతను భీమానాయ‌క్ అనే ల్యాండ్ రిజిష్ట్రేష‌న్ అధికారి ద‌గ్గ‌ర అత‌ను డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు. గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి త‌న కూతురు వివాహం కోసం దాదాపు 100 కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని వైట్‌గా మార్చేశాడట. భీమానాయ‌క్ సాయంతో గాలి జనార్ధన్ రెడ్డి నల్లధనాన్ని మార్చాడట. దీనికి గాను భీమానాయక్ 20 శాతం కమీషన్ కూడా తీసుకున్నాడట. అంతేకాదు  2018వ సంవత్సరంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌నకు సీటు ఇప్పించాల‌ని కూడా భీమా నాయక్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే కూతురి వివాహానంతరం.. గాలి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు చేశారు. దీంతో రమేశ్‌కు బెదిరింపులు ఎక్కువ‌య్యాయట. అందుకే బెదిరింపులు తట్టుకోలేక తాను ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డుతున్న‌ట్లు రమేశ్ తన సూసైడ్ నోట్ లో తెలిపాడు. మొత్తానికి గాలికి ఒకదాని తరువాత మరొక సమస్య వస్తూనే ఉంది. మరి దీనిపై గాలి ఎలా స్పందిస్తాడో.. ఈ సమస్య నుండి ఎలా బయటపడతారో చూద్దాం...

మమతాని నేను అలా అనలేదు..!

  పెద్ద నోట్ల రద్దుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై, మోడీ పై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలసిందే. అయితే మమతా విమర్శలపై స్పందించిన ప్రముఖ యోగా గురువు దీదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా విదితమే. అక్కడి వరకే బాగానే ఉన్నా తాజాగా ఇప్పుడు మరో విషయంలో రాందేవ్ బాబా ఇరుకున పడ్డారు. అదేంటంటే.. మమతా బెనర్జీ ప్రధామమంత్రి ఇష్యూ.. ‘ దీదీ ప్రధాని కావచ్చు కదా అని కొందరు నన్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నారు. అయితే ఇది కాస్త  మమతా బెనర్జీకి ప్రధానమంత్రి కాగల అన్ని అర్హతలు ఉన్నాయని వార్తలు రాసేశారు. దీంతో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందన్నానే తప్ప...ఆమె ప్రధానమంత్రి అవుతారని అనలేదు అని వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ముస్లిం బుర్ఖా ధరించడానికి వీల్లేదు...బుర్ఖా పై నిషేదం

  ముస్లిం మహిళలు ఇకపై బుర్ఖా ధరించడానికి వీల్లేదని.. దానిని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించబోమని.. అలా ధరించడం చట్టబద్ధం కూడా కాదని తెలిపారు. అయితే అది ఇక్కడ కాదులెండి  జర్మనీలో. క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌(సీడీయూ) పార్టీ అధ్యక్షురాలిగా జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె బుర్ఖా అంశంపై మాట్లాడుతూ... జర్మనీలో ఇకపై ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించనున్నట్టు తెలిపారు. ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించాలనే డిమాండ్‌కు ఆగస్టులోనే ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి థామస్‌ డి మైజెర్‌ మద్దతివ్వగా ఇప్పుడు ఏంజెలా మెర్కల్‌ దానిని నిషేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయంపై ముస్లింలు ఎలా స్పందిస్తారో చూడాలి.

జయలలితకు శవపేటిక తయారుచేసింది ఎవరో తెలుసా..?

  చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి జయలలిత  తుదిశ్వాసను విడిచిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం.. మెరీనా బీచ్ లో ఎంజీఆర్ ఘాట్ పక్కనే జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెను దహనం కాకుండా ఖననం చేశారు. అయితే ఆమె ఖననానికి శవపేటికను ఎవరు తయారుచేశారో తెలుసా..? ఇంకెవరు.. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు, నటుడు శివాజీ గణేషన్, నటి మనోరమ వంటి చాలా మంది వీవీఐపీలకు శవపేటికలు అందించే పీఆర్‌ఎంఎం శాంతాకుమార్. ఆయనే జయలలితకు కూడా శవపేటికను తయారు చేయించి ఇచ్చారు. శాంతాకుమార్ ఫ్లెయింగ్ స్కాడ్ అండ్ హోమేజ్ కంపెనీ పేరుతో కంపెనీ నడుపుతున్నారు. దీనిలో భాగంగానే ఆయన పలువురు ప్రముఖులకు శవపేటికలు తయారు చేసి పెట్టాడు. ఈ బాక్సును ప్రత్యేకంగా భౌతికకాయాన్ని ఎక్కువ కాలం సేఫ్‌గా ఉంచేందుకు ఒక ఫ్రీజ్ బాక్సుతో హెవీ కంప్రెసర్ ఉండేలా నిర్మిస్తారు. ఆయన తయారు చేసే శవపేటికలో శవాలు అటూ ఇటూ తిరగకుండా, దొర్లకుండా ఉంటాయి. ఇవే వాటి ప్రత్యేకత.

పవన్ విగ్రహానికి విముక్తి ఎప్పుడో..?

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విగ్రహాం పాపం దీనావస్థలో పడింది. ఎప్పుడో ప్రతిష్టించిన పవన్ విగ్రహం ఇప్పటివరకూ ఆవిష్కరణకు నోచుకోలేదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రముఖ సెంటర్ లో పవన్ అభిమానులు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే తనకు విగ్రహాలు ఇష్టం లేదని పవన్ చెప్పడంతో అభిమానులు విగ్రహ ఆవిష్కరణను ఆపేశారు. అప్పటినుండి పవన్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విగ్రహానికి  ముసుగు వేసి అలా ఉంచేసారు. కానీ ఇప్పుడు ఆ ముసుగు కూడా చిరిగిపోయి సగం విగ్రహం బయటకు కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. దీంతో, ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. విగ్రహం ప్రతిష్టకు నోచుకోకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. మరి ఇప్పుడైనా పవన్ ఒప్పుకుంటారో లేదో చూద్దాం...

తుఫాను కారణంగా చిక్కుకుపోయిన 800 మంది టూరిస్టులు..

  బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను కారణంగా అండ‌మాన్‌లోని హావ్‌లాక్ దీవుల్లో 800 మంది టూరిస్టులు  చిక్కుకుపోయారు. వారిని కాపాడ‌టానికి నేవీ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పటికే అండ్ నికోబార్ దీవుల్లో చిక్కుకున్న పర్యాటకులను రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. 4 ప్ర‌త్యేక నౌక‌ల‌ను పంపించింది. అయితే భారీ ఎత్తున అలలు తీరాన్ని తాకుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పడి నిదానంగా సాగుతోందని అధికారులు తెలిపారు. టూరిస్టుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, అవసరమైతే వాయుసేన సహాయం తీసుకుంటామని నేవీ అధికారులు తెలిపారు. కాగా, చిక్కుకుపోయిన వారిలో అత్యధికులు 'హావ్ లాక్' ఐలాండ్ లో ఉన్నారని తెలుస్తోంది.

ఉభయసభలు ప్రారంభం... సేమ్ సీన్

  పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలు అనారోగ్యంతో కన్నుమూసిన చో రామస్వామికి నివాళులర్పించాయి. అనంతరం రోజూలాగే ఈరోజు కూడా పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభ ప్రారంభం కాగానే లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు పెద్దయెత్తున నినాదాలు చేపట్టాయి.   ఈ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు గులాంనబీ ఆజాద్‌ మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు వల్ల బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిల్చుని 80 మంది మృతిచెందారని.. పని ఒత్తిడితో ఐదుగురు బ్యాంకు సిబ్బంది కన్నుమూశారని.. అనేక పెళ్లిళ్లు ఆగిపోయాయని.. ఉపాధి లేక కూలీలు, అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు.దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.   మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లోక్‌సభకు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే పెద్దనోట్ల రద్దుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.

స్వామి సంచలన వ్యాఖ్యలు... శశికళ హస్తగతం చేసుకుంటుంది..

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఈసారి అన్నాడీఎంకేపై విమర్శలు గుప్పించారు. జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు పన్నీరు సెల్వం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు కనుక  జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్‌ చేతిలో పెడితే పన్నీర్‌ సెల్వం స్వతంత్రంగా పనిచేయలేరని..అన్నాడీఎంకే ఒకే సంస్థగా మనుగడ సాగించలేదన్నారు. పన్నీర్‌ సెల్వంకు పార్టీలో పునాదిలేకపోవడంతో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీని హస్తగతం చేసుకుంటుందని.. ఆమె తన కుటుంబం నుంచి ఎవరినైనా ఆ పోస్టుకోసం వత్తిడి తీసుకువస్తారని అభిప్రాయపడ్డారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

పీఎస్‌ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతం..

పీఎస్‌ఎల్వీ సీ-36 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శాస్త్రవేత్తలు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రిసోర్స్‌శాట్-2ఏ ను నింగిలోకి ప్రయోగించారు. సుమారు 1235 కిలోల రిసోర్స్‌శాట్-2ఏ ను నింగిలోకి మోసుకెళ్తుంది. ఉపగ్రహాన్ని 817 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వనరుల పరిశోధన కోసం 2003లో రిసోర్స్‌శాట్-1, 2011లో రిసోర్స్‌శాట్-2ను ప్రయోగించగా వాటికి అనుబంధంగా రిసోర్స్‌శాట్-2ఏ ను నేడు ప్రయోగించారు. ఈ రిసోర్స్‌శాట్-2ఏ  వ్యవసాయరంగానికి బాగా ఉపయోగపడుతుంది. రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహం ఐదేళ్ల పాటు సేవలను అందిచనుంది.