వృద్దుని వద్ద కోటిన్నర కొత్త నోట్లు...
పెద్ద నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద నిల్చొని అష్టకష్టాలు పడుతుంటే.. మరోపక్క పెద్ద పెద్ద వ్యాపార వేత్తల నుండి మాత్రం పెద్ద మొత్తంలో నగదు బయటపడుతుంది. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అవి కూడా కొత్త నోట్లు కావడమే.. ఇప్పటికే పలువురి దగ్గర భారీగా కొత్త నోట్లు బయటపడగా.. ఇప్పుడు తాజాగా వ్యాపారవేత్త వద్ద కోటికిపైగా కొత్త నోట్లు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. అసోంలోని 85 ఏళ్ల వృద్ధుడైన ఓ వ్యాపారవేత్త ఇంట్లో పోలీసులు కోటిన్నర రూపాయల విలువ చేసే కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ...గువాహటి నగరానికి చెందిన బెల్టోడా ప్రాంతంలోని హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో సోదాలు చేయగా, కొత్త 500, 2000 రూపాయల నోట్లలో మొత్తం రూ. 1,54,81,000 నగదు లభ్యమైందన్నారు. అందులో 75వేల రూపాయలకు కొత్త 500 నోట్లు ఉండగా, మిగిలినవి 2వేల రూపాయల నోట్లని..కేవలం అద్దెల మీద మాత్రమే ఆధారపడి బతికే ఈయన వద్ద ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందో అర్థంకావట్లేదని అన్నారు. దీనిపై అతనిని విచారిస్తున్నామని తెలిపారు.