శేఖర్ రెడ్డిని పదవి నుంచి తొలగింపు..
టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఐటీ శాఖ సోదాలు జరుపుతుండగా.. తవ్వే కొద్ది నల్లధనం బయటపడుతూనే ఉంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, 120 కిలోల బంగారం బయటపడగా.. ఇప్పుడు మరింత కరెన్సీ బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను పదవినుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత కరెన్సీని కొత్త నోట్లలోకి మార్చినట్టు, ఆపై మిగిలిన పాత కరెన్సీతో బంగారం కొన్నట్టు శేఖర్ రెడ్డి అంగీకరించగా, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. టీటీడీలో ఓ తమిళ వ్యక్తికి భాగం కల్పించాలన్న ఉద్దేశంతో జయలలిత సిఫార్సుతో శేఖర్ రెడ్డికి బోర్డు సభ్యుడి హోదా దక్కిన సంగతి తెలిసిందే. ఇక జయలలితకు సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న శేఖర్ రెడ్డి ఇంటిపై ఆమె చనిపోయిన తరువాత ఐటీ దాడులు జరగడం విశేషం.
ఇదిలా ఉండగా శేఖర్ రెడ్డి ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శేఖర్ రెడ్డి అనుచరులు ప్రేమ్, శ్రీనివాస్ రెడ్డి ఇళ్లల్లో కూడా దాడులు చేస్తున్నారు. అంతేకాక శేఖర్ రెడ్డి బంగారం కొనడం, కరెన్సీ నోట్లు మార్పుపై బంగారం వ్యాపారులు, బ్యాంకు అధికారుల పాత్రపై త్వరలో విచారణ చేపట్టనున్నట్టు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు ఈ కేసును ఈడీ కి అప్పగించాలని ఐటీ శాఖ భావిస్తోంది.