ఎన్డీఏలో చేరడం జీవితంలో జరగదు..

  బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని మోడీతో పొత్తు పెట్టుకుంటారా అంటే మాత్రం అది జరిగే ప్రసక్తి లేదు అంటున్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన "నోట్ల రద్దుకు నేను మద్దతిచ్చాను. ఎందుకంటే, అది మంచి నిర్ణయమని మాత్రమే. అంతమాత్రాన నేను తిరిగి బీజేపీ కూటమిలో చేరతానని కాదు.. ఎన్డీఏలో చేరడమన్నది జీవితంలో జరగని విషయమని.. రాజకీయ అంశంగా నోట్ల రద్దుకు మద్దతును పరిగణించరాదు" అని అన్నారు.  ఇంకా నోట్ల రద్దుపై మాట్లాడుతూ.. బీజేపీ చెప్పినట్టు నోట్ల రద్దు, నల్లధనంపై సర్జికల్ దాడే అయితే, దీన్ని కేవలం ప్రారంభంగా మాత్రమే గుర్తించాలని, ఇంకా చేయాల్సింది చాలా వుందని అన్నారు.

వెరైటీగా ముద్రగడ పాదయాత్ర...

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. మొత్తం నాలుగు దశల్లో ఆయన తన పోరాటం చేయనున్నట్టు చెప్పారు. కానీ ఈ పోరాటానికి ముందు ముద్రగడ పాదయాత్ర చేద్దామని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయన పాదయాత్రను అడ్డుకోవడంతో అది కుదరలేదు. ఇప్పుడు మాత్రం ఆయన తన పాదయాత్రను చేసి తీరుతానని తేల్చి చెప్పారు. అయితే అది కూడా కాస్త వెరైటీగా. తన చేతులకు బేడీలు కట్టి, కళ్లకు గంతలు కట్టి తన పాదయాత్రకు అనుమతించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాపు నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వం అంటున్నందున తన యాత్రకు అలా అనుమతించాలని ఆయన అన్నారు. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25 నుంచి చేపడతామని..రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర చేస్తామని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ గురించి ఢిల్లీలో చంద్రబాబు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఢీల్లీలోని హిందుస్థాన్‌ టైమ్స్‌ నిర్వహించిన నాయకత్వ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ‘ప్రపంచ నీటి సంక్షోభం- పరిణామాలు’ అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీటి రంగాలపై దృష్టిసారించామని...వర్షపు నీటిని నదులకు అనుసంధానం చేసే దిశగా కృషిచేస్తున్నట్లు చెప్పారు. తొలి అర్ధసంవత్సరంలో 25.6 శాతం వ్యవసాయం వృద్ధి సాధించినట్లు వివరించారు. మత్స్య పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. ఇంకా తెలంగాణ గురించి మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణ సీఎం తనకు సహచరుడని, బాగా తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసిమెలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. విభజన తర్వాత రాష్ట్రంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. అయితే ఇప్పుడు అవన్నీ సమసిపోయాయని అన్నారు.

అటల్ బిహీరి వాజ్ పేయితో మోడీ డ్యాన్స్..

  ప్రధాని నరేంద్ర మోడీ డ్యాన్స్ చేశారు. అది కూడా మాజీ ప్రధాని అటల్ బిహీరి వాజ్ పేయి. ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు సంగతేంటంటే.. అది ఇప్పటి సంగతి కాదులెండి. దాదాపు 15 ఏళ్ల కిందటిది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అప్పట్లో హోలీ పండగ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు రంగులు చ‌ల్లుకొని ఆనందంగా గ‌డిపారు. హిందీ పాట రంగ్‌ బర్సేకు వాజ్‌పేయి చేతులూ కాళ్లూ క‌దిలిస్తూ నృత్యం చేస్తుండ‌గా ఆయ‌నతో పాటు మోదీ, ఇత‌ర బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా ఎంతో హుషారుగా డ్యాన్సులు వేశారు. ఈ వీడియోలో ఇప్ప‌టి కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ కూడా వాజ్‌పేయితో ఉన్నారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఈ సంబ‌రాల్లో వాజ్‌పేయితో మోదీ క‌లిసి పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.

అందుకే ఎన్నికల్లో గెలవలేదు..

  ప్రధాని నరేంద్ర మోడీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మురాదాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... యూపీలోని బ‌నార‌స్ ప్ర‌జ‌ల‌ను న‌న్ను గెలిపించారని ఆయన అన్నారు. కేవ‌లం ఎంపీ అయ్యేందుకే ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేద‌ని, యూపీలో ఉన్న పేద‌రికాన్ని రూపుమాపాల‌న్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన‌ట్లు చెప్పారు. యూపీ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. అభివృద్ధి జ‌రిగితే పిల్ల‌ల‌కు మంచి విద్య ల‌భిస్తుంద‌ని.. అభివృద్ధి వ‌ల్లే మంచి వైద్యం కూడా దొరుకుతుంద‌న్నారు. మురాదాబాద్ ప్ర‌జ‌లు న‌న్ను ఎంతో ఆద‌రించార‌న్నారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే, యూపీ, బీహార్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలను అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలే తనకు హైకమాండ్ అని అన్నారు. తనకు అధికారులంటూ ఎవరూ లేరని, ప్రజలే తనకు ముఖ్యమన్నారు.

అమెరికా, తైవాన్ మధ్యలో చైనా..

  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వాల్సిందే. ఇప్పుడు తాజాగా అలాంటి వివాదానికే తెర లేపారు డొనాల్డ్ ట్రంప్. అదేంటంటే తైవాన్ దేశ అధ్యక్షురాలితో ఫోన్లో మాట్లాడటం. ఫోన్లో మాట్లాడటంలో అంత వివాదం ఎందుకు అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. అసలు సంగతేంటంటే.. 1979లో తైవాన్‌తో దౌత్య సంబంధాలను అమెరికా తెగదెంపులు చేసుకుంది. దాంతో తైపీలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేసింది. ఒకే చైనా పాలసీని ప్రకటించింది. అప్పటి నుండి అమెరికా, తైవాన్ల మధ్య అధికారిక చర్చలు కానీ ఎలాంటి ఒప్పందాలు కానీ జరగలేదు. అయితే ఇప్పుడు దాదాపు 37 ఏళ్ల తరువాత ట్రంప్, తైవాన్ అధ్యక్షురాలితో మాట్లడటంతో ఇప్పుడు ఈ విషయంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం  చేసింది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయన ఈవిషయంపై కూల్ గా స్పందిస్తారా..? లేక అగ్నికి ఆజ్య పోసినట్టు మాట్లాడాతారా..? చూద్దాం..

దీదీకి అంత భయం ఎందుకో..?

  మొన్నటి వరకూ పెద్ద నోట్ల రద్దుపై నానా హడావుడి చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ఆర్మీ బలగాల మోహరింపుపై రచ్చ మొదలుపెట్టారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కొత్త నోట్ల మార్పిడికి వాహనదారులు ఇబ్బందుల పాలవకుండా కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఔటర్ పరిధిలో ఈ నెల రెండో తేదీ వరకు టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు ముగియడంతో ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు టోల్ ప్లాజాల వద్ద ఆర్మీలను మోహరించారు. కానీ ఇప్పుడు ఈ సైన్యాన్ని మోహరించడం వల్ల మమతా బెనర్జీకి వచ్చిన నష్టం ఏంటో తెలియడం లేదు కానీ ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది సైనిక కుట్రనా? అని ఆమె ధ్వజమెత్తారు. అంతేనా..తన కార్యాలయానికి దగ్గరగా ఉన్న టోల్ గేట్ వద్ద ఉన్న సైన్యం వెళితేనే కానీ తాను ఇంటికి వెళ్లనని రాత్రంతా సచివాలయంలోనే ఉన్నారు. ఆ తరువాత సైన్యం వెళ్లిపోయిన తరువాత.. అధికారులు వారు వెళ్లిపోయారని చెప్పినా కూడా.. మిగిలిన 18 జిల్లాల్లో టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు దాదాపు 30 గంటల తరువాత ఆమె తన కార్యాలయం నుండి బయటకు వచ్చారు.   అయితే అసలు డౌట్లు మాత్రం ఇప్పుడే వస్తున్నాయి. ఏదో పెద్ద నోట్లు రద్దు విషయంలో అంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. వారి కష్టాలను చూడలేక ఆమె ఇలా  ఆందోళనలు చేస్తున్నారు తప్పులేదు అని అనుకున్నా.. ఇప్పుడు ఆర్మీ సైన్యం మోహరింపుపై ఆమె ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఆర్మీ బలగాలను వ్యతిరేకించడం వల్ల ఆమెకు వచ్చే లాభం ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఫేక్ కరెన్సీ నా అన్న కోణంలో కూడా ఆలోచించే వారు ఉన్నారు. ఎందుకంటే పశ్చిమబెంగాల్ మిడ్నార్ జిల్లాల్లో ఆర్బీఐ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అంతేకాదు ఇక్కడ ఎక్కువ ఫేక్ కరెన్సీ కూడా ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఫేక్ కరెన్సీ విషయంలో గొడవలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఫేక్ కరెన్సీకి.. దీదీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా..? అందుకే ఈ విషయంలో ఆమె అంత రియాక్ట్ అవుతున్నారా...? అని సందేహ పడుతున్నారు.   ఇంకోపక్క మమతా చేస్తున్న దానికి కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దీనిపై స్పందించి... ఆర్మీ మోహరింపును రాజకీయం చేయొద్దని మమతకు హితవు పలికారు. ఇంక కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ కూడా దీదీ చేసిన పనిపై స్పందించి సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆర్మీ బలగాలు మోహరించాయి..గత నెల 28,29,30 వ తేదీలో తనిఖీలు జరగాల్సి ఉంది.. అయితే కొన్ని కారణాల వల్ల తనిఖీలు వాయిదా పడ్డాయి.. సాధారణ తనిఖీలను రాజకీయం చేయవద్దు అని.. బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి అని స్పష్టం చేశారు. మరి నిజంగానే గుమ్మడికాయల దొంగ ఎవరూ అంటే భుజాలు తడుముకున్న సామెత ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్మీ తమ తనిఖీలు తాము చేసుకుంటూ పోతుంటే.. మమతా బెనర్జీ కూడా వారికి సహకరిస్తే ఎలాంటి సందేహాలు రావు. ఇంత చిన్న విషయాన్ని కూడా అంతలా చేస్తుంటేనే లేనిపోని డౌట్లు వస్తున్నాయి అందరికీ.

దొంగ నోట్లు ప్రింట్ చేసిన ఇంజనీర్ మోడీకి నచ్చాడు..!

అభినవ్ వర్మ.. కొత్త 2000 రూపాయల నోట్లకు నకిలీనోట్లను ముద్రించి అరెస్ట్ అయ్యాడు. అలాంటి అభినవ్ వర్మ ప్రధాని నరేంద్ర మోడీకి నచ్చాడు. అదేంటీ అనుకుంటున్నారా..? అయితే అది ఇప్పుడు కాదులెండి గత కొన్ని రోజుల కిందట. అసలు అభినవ్ వర్మ ఎవరు.. మోడీ నచ్చడమేంటీ.. ఒకసారి చూద్దాం.. అభినవ్ వర్మ..  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఓ యువ ఇంజనీరు. అంధులు ఉపయోగించే కర్రలలో ఏర్పాటుచేయడానికి ఉపయోగపడే సెన్సర్లను అతడు తయారుచేశాడు. వాటి సాయంతో అంధులు కర్రకు ముందు ఏముందో కూడా తెలుసుకోవచ్చు. గోతులు గానీ, రాళ్లు గానీ ఏవైనా అడ్డం వస్తే ఈ సెన్సర్ గుర్తించి అలారం మోగిస్తుంది. ఇక అతను చూపిన ప్రతిభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఎంతగానో ప్రశంసించారు.   అలాంటి అతను ఇప్పుడు దొంగ నోట్లను ముద్రిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అభినవ్ వర్మ, అతడి బంధువు విశాఖా వర్మ, లూథియానాకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ సుమన్ నాగ్‌పాల్‌ లు ముగ్గురూ కలిసి ప్రజల వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, తాము ముద్రించిన 2000 రూపాయల నోట్లను కమీషన్ పద్ధతిలో ఇస్తున్నారు. అయితే అవి దొంగనోట్లు కావడం విశేషం. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురూ ఆడి ఎస్‌యూవీలో వెళ్తుండగా తాము ఆపి తనిఖీ చేశామని... అప్పుడే కారులో 42 లక్షల దొంగనోట్లు పట్టుబడ్డాయని మొహాలీ నగర ఎస్పీ పర్మీందర్ సింగ్ చెప్పారు. అంతేకాదు తన కార్యాలయంలో ఇప్పుడు అతడు నకిలీ 2000 నోట్లను మాత్రమే తయారుచేస్తున్నాడని, సెన్సర్లు తయారుచేయట్లేదని పోలీసులు చెప్పారు.

చైనా-భారత్ 16 లక్షల మంది మృత్యువాత.. కారణం అదే..?

  పారిశ్రామికంగా మన దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో తెలియదుకానీ.. ఒక్క విషయంలో మాత్రం మన దేశం ఎప్పుడూ ముందుంటుంది. అదేంటనుకుంటున్నారా.. వాయు కాలుష్యంలో. వాయు కాలుష్యంలో మాత్రం మన దేశం టాప్ పదిస్థానాల్లో చోటు సంపాదించుకుంది. ఇక మన దేశంతో పాటు మన పొరుగున ఉన్న దేశం చైనా కూడా ఈ విషయంలో మనతోనే పోటీపడుతుంది. చైనాలో కూడా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వాతావరణ కాలుష్యం వల్ల రెండు దేశాల్లో కలిపి 16 లక్షల మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. గ్రీన్ పీస్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి. వాయు కాలుష్యం వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్న తొలి పది దేశాల్లో ఇండియా కూడా ఉందని..భారత్, చైనాల్లో బొగ్గును అత్యధికంగా వినియోగించడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. ఈ రెండు దేశల్లో ప్రతి లక్ష మందిలో 115 నుంచి 138 వరకు వాయు కాలుష్యం బారిన పడుతున్నారని తెలిపింది. థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల వల్ల వాయుకాలుష్యం భారీగా పెరుగుతోంది..దీన్ని అదుపులో ఉంచాల్సిన అవసరం ఉందని గ్రీన్ పీస్ సూచించింది. మరి ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో చూద్దాం.

మోడీ ఫొటో వాడుకున్నందుకు జరిమానా ఎంతో తెలుసా..?

రిలయన్స్ జియో సిమ్ ప్రకటనల్లో ప్రధాని మోడీ ఫొటో వాడుకున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ ఫొటోను వాడుకున్నందుకు గాను రిలయన్స్ కు ఎంత జరిమానా విధించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఎంత జరిమానా విధించారబ్బా అనుకుంటున్నారా..? అక్షరాలా 500 రూపాయలు. జియో ఇచ్చిన ప్రకటనల్లో ప్రధాని ఫొటోను వాడటంపై తీవ్ర దుమారం రేగింది. అంతేనా ఈ విషయం ఏకంగా పార్లమెంటు వరకూ వెళ్లింది. ప్ర‌ధాని ఫొటోపై రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు నిల‌దీశాయి. ప్ర‌ధాని ఫొటో వాడుకున్నందుకు అనుమ‌తి మంజూరు చేశారా? అంటూ స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీర‌జ్ శేఖ‌ర్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. దీంతో స‌మాచార మంత్రిత్వ‌శాఖ స‌హాయ మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌సింగ్ రాథోడ్ జియో ప్ర‌క‌ట‌న‌ల్లో ప్ర‌ధాని మోదీ ఫొటో వాడుకునేందుకు కేంద్రం ఎటువంటి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. దీంతో అనుమ‌తి లేకుండా ఫొటో వాడుకున్నందుకు 1950 చ‌ట్టం ప్ర‌కారం రూ.500 జరిమానా విధించనున్నారు.

30 గంటల తరువాత బయటకు మమత..

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో టోల్ గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అంతేకాదు టోల్ గేట్ల వద్ద ఆర్మీ  ఉన్న ఆర్మీ తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి నుండి ఆమె తన కార్యలయంలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమె కార్యలయం నుండి బయటకు వచ్చారు. దాదాపు 30 గంటల తరువాత ఆమె బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి సైన్యాన్ని ఉప సంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని..ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు.   ఇదిలా ఉండగా మమతా తీరుపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కేవలం సాధారణమైన విషయమే అని.. ఈ తనిఖీలు ఇప్పుడు కొత్తేమి కాదు.. అనవసరంగా ఈ తనిఖీలను రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక ఈ అంశంపై స్పందించిన ఆర్మీ కూడా మమత ఆరోపణలు నిరాధారమైనవని కొట్టేపారిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము టోల్‌గేట్ల వద్ద తనిఖీలు చేపట్టామని స్పష్టం చేశారు. అంతేకాదు వాటికి సంబంధించిన పత్రాలను కూడా ఆర్మీ విడుదల చేసింది.