చెన్నై తెలుగు వ్యాపారవేత్తల ఇళ్లలో దాడులు.. దిమ్మతిరిగే డబ్బు...
posted on Dec 8, 2016 @ 5:03PM
పాత నోట్ల రద్దుతో ఒక్కసారిగా నల్ల కుబేరుల గుండెల్లో పెద్ద బండలు పడినంత పనైంది. ఇప్పటికే ప్రభుత్వం షరతులు పెట్టడంతో డబ్బు మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు మాత్రం ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడ్డారు. దీంతో పెద్ద వ్యాపారుల ఇళ్లలో డబ్బు మూలుగుతుంది. ఈనేపథ్యంలో ఐటీ దాడులు జరపగా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుంది. దీనిలో భాగంగానే చెన్నైలో ఐటీ దాడులు జరపగా దిమ్మతిరిగేంత డబ్బు బయటపడింది. చెన్నైలోని తెలుగు బడా వ్యాపారవేత్తల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అన్నానగర్, టి. నగర్ సహా 8 చోట్ల సోదాలు జరిపారు. ఈ దాడుల్లో 400 కోట్ల రూపాయల విలువైన దస్తావేజులతో పాటు రూ. 90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 70 కోట్ల నోట్లు, 20 కోట్లు పాత నోట్లు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు 100 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. కొత్త నోట్లు దొరక్క సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే వీరికి 70 కోట్ల విలువ చేసే కొత్త నోట్లు ఎలా వచ్చాయనే గురించి అధికారులు విచారిస్తున్నారు.