జయలలిత హాస్పిటల్ బిల్లు ఎంతో తెలుసా..?

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న తీవ్ర అస్వస్థకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన ఆమె దాదాపు రెండు నెలలు పైనే ఆస్పత్రిలో ఉన్నారు. ఎయిమ్స్ నుండి, లండన్ నుండి వైద్యులు వచ్చి మరీ అమ్మకు చికిత్స చేశారు. అంతేకాదు అమ్మ కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవుతారని అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డితోపాటు వైద్యులు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే సడెన్ గా అమ్మకు డిసెంబర్ 4 సాయంత్రం గుండెనొప్పి రావడం.. అది కాస్త విషమంగా మారడంతో ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అమ్మను బ్రతికించడం కోసం ఎంతో అత్యాధునిక చికిత్సను సైతం ఉపయోగించారు. అయినా ఎటువంటి లాభం లేకపోయింది. మొత్తం ఆసుపత్రిలో 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే మృత్యువుతో పోరాడారు. అయితే ఇప్పుడు అమ్మకు వైద్యానికి మొత్తం ఎంత ఖర్చు అయిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. జయ చికిత్సకు మొత్తం రూ.90 కోట్లు ఖర్చు అయిందని సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఖండించిన అపోలో ఆస్పత్రి సిబ్బంది.. జయ చికిత్సకు రూ.90 కోట్లు ఖర్చుకాలేదని, అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చయిన మాట మాత్రం వాస్తవమని వైద్యులు చెప్పారు.

చిన్నారుల డైపర్లలో బంగారు బిస్కెట్లు...

ఇప్పటివరకూ పలు అక్రమ మార్గాల ద్వారా బంగారం తరలించడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చిన్న పిల్లలు వాడే డైపర్లలో బంగారం తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...  ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబా య్ నుంచి ఢిల్లీ విమానం రాగా ఇందులో  సూరత్‌కు చెందిన ఆరుగురు వచ్చారు. వీరిలో ఇద్దరి మహిళల వద్ద పాపలు ఉన్నారు. ఇక ఉదయం 7 గంటలకు భద్రతా సిబ్బంది ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా చిన్నారుల డైపర్లలో బంగారు బిస్కెట్లు కనిపించాయి. కేజీ బరువున్న 16 బంగారు బిస్కెట్లను రెండు డైపర్ల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.  

జయ కూతురిపై క్లారిటీ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత వివరాలతో రోజూ వార్తాపత్రికలు నిండిపోతున్నాయి. జయ వారసుల గురించో..ఆస్తుల గురించో ఏదో ఒక రూపంలో కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జయలలిత కుమార్తె అంటూ గత కొన్నిరోజులుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ  చక్కర్లు కొడుతోంది. ఫోటోలోని మహిళ అచ్చుగుద్దినట్టు జయను పోలీ ఉండటంతో అమ్మ వారసురాలు ఈమేనంటూ జనం కూడా నమ్మేశారు.   అక్కడితో ఆగితే ఓకే కానీ పుకారు రాయుళ్లు ఊరుకుంటారా..? ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న ఆమె త్వరలోనే తమిళనాడు వస్తారని, ముఖ్యమంత్రి పదవి చేపడతారని కూడా కథలల్లారు. ఇది ఇప్పుడు తాజాగా జరిగిన విషయం కాదు..అయితే జయ మరణం తర్వాత ఈ ఫోటోకి ప్రాధాన్యత వచ్చింది. అమ్మ అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ విషయంపై జుట్టుపీక్కుంటుండగా ఈ ఉత్కంఠకు తెర దించారు గాయని చిన్మయి శ్రీపాద.   ఆ మహిళ, ముఖ్యమంత్రి గారి కూతురు కాదు..ఆమె తన కుటుంబానికి తెలిసిన వ్యక్తని..ఆమె పేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్ అని పేర్కొన్నారు. దివ్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారని తెలిపారు. ఆమె మృదంగ విద్వాంసులు వి.బాలాజీ కుటుంబానికి చెందిన వారు. ఆయన కచేరీలతో బిజీగా లేనపుడు "హస్‌బాన్డ్" అనే వెబ్ ‌సిరీస్‌లో పనిచేస్తారు అని ఫేస్‌బుక్‌‌లో పోస్ట్ చేసింది. 

జాతీయగీతం వస్తుంటే నిలబడలేదని చెన్నైలో..

ధియేటర్‌లో జాతీయగీతం ప్రదర్శితమవుతుండగా నిలబడలేదని ఏడుగురు విద్యార్థులపై కొందరు దాడికి పాల్పడ్డారు. నిన్న చెన్నైలోని ఓ ధియేటర్‌లో ఉదయం 11.30 గంటల షోకు కొందరు విద్యార్థులు హాజరయ్యారు. అయితే ధియేటర్లలో జాతీయ గీతాన్ని ప్రదర్శించాలన్న సుప్రీం ఆదేశాలతో సదరు ధియేటర్‌లో జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే జాతీయ గీతం వస్తున్న సమయంలో సీట్లలో కూర్చున్న విద్యార్థులు లేచి నిలబడలేదు..దీంతో కొందరు వ్యక్తులు ఆ విద్యార్థుల వద్దకు వెళ్లి జాతీయగీతం వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేదంటూ వాగ్వాదానికి దిగారు.   దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సుమారు 20 మంది.. విద్యార్థులను చితకబాదారు. సినిమా మధ్యలోనే వెళ్లిపోయిన విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జాతీయగీతం వచ్చినపుడు మేము ఎవ్వరం కూడా లేచి నిలబడలేదు..అంత మాత్రం చేత మాకు దేశభక్తి లేదనుకోవడం పొరపాటు. మా వెనుక కూర్చున్న యువకులు సినిమా జరుగుతున్నంతసేపూ అసభ్య పదజాలంతో దూషించారు..చివరకు దాడికి దిగారని తెలిపారు. అయితే జాతీయగీతం వస్తుండగా నిలబడకపోవడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు సదరు విద్యార్థులపైనా కేసు నమోదు చేశారు. 

మోడీ దారిలో...పెద్ద నోట్లు రద్దు చేసిన వెనిజులా

అవినీతిని అంతం చేయడంతో పాటు నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దు. ఆ నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి విమర్శలు ఎదురవుతున్నా సరే..మోడీ మాత్రం వెనక్కుతగ్గలేదు. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు మాత్రం మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. తాజాగా భారత్ దారిలో పెద్ద నోట్లు చేసింది వెనిజులా. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టే నిమిత్తం పెద్దనోటు 100 బొలివర్‌ను రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో ప్రకటించారు. రద్దయిన పెద్దనోటు స్థానంలో నాణేలను ప్రవేశపెట్టనున్నామని, ఆ ప్రక్రియను 72 గంటల్లోనే ముగుస్తుందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో నెలకొన్న ఆహార కొరత కూడా తీరుతుందని నికోలస్ అభిప్రాయపడ్డారు. 

తుఫానుపై రైల్వేశాఖ హెల్ప్‌లైన్

వార్ధా తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. బలమైన ఈదురుగాలుల కారణంగా ఎక్కడికక్కడ చెట్లు, స్థంభాలు నేలకొరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో పలు మార్గాల్లో రైల్వే సేవలు నిలిచిపోయాయి. విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లీంచగా..నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల సహాయార్థం ప్రధాన రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైళ్ల సమాచారం కోసం ప్రయాణికులు ఆయా నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హెల్ప్‌లైన్ నంబర్లు: ఆంధ్రప్రదేశ్   -   0866 248800 విజయవాడ -   0866 2575038, 1072 నెల్లూరు     -    0861  2345864, 7702774104 గూడూరు   -    9604506841

తమిళనాడు విలవిల: రంగంలోకి దిగిన ఆర్మీ

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్థా తుఫాను తాకిడికి తమిళనాడు అతలాకుతలం అవుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కుండపోత వర్షాలు, పెనుగాలులతో వందలాది వృక్షాలు నేలకూలాయి. ముఖ్యంగా రాజధాని చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. తుఫాను తీరాన్ని దాటడానికి ముందే నగరంలో బీభత్స వాతావరణం నెలకొంది.   ఇక తీరాన్ని తాకే సమయంలో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఎక్కడికక్కడ చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ముందస్తు చర్యగా నగర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలు సైతం నిలిచిపోయయి. చెన్నై రావలసిన విమానాలను బెంగళూరు, హైదరాబాద్‌ల వైపు మళ్లీస్తున్నారు. తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సేవలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తీరాన్ని తాకిన వార్ధా..చెన్నైలో బీభత్సం

అతి తీవ్ర తుఫానుగా మారిన వార్థా చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా వేలాది వృక్షాలు, స్థంభాలు, హోర్డింగులు విరిగిపడుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుఫాను కారణంగా ప్రజారవాణా పూర్తిగా స్తంభించింది. 

వార్ధా విలయం: చెన్నైలో భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. వార్థా మధ్యాహ్నానికి చెన్నైకి సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటీకే ప్రకటించింది. దీని ప్రభావంతో నగరంలో ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తోంది. దానికి తోడు తీవ్ర ఈదురుగాలులు వీస్తుండటంతో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షం కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

పని మొదలుపెట్టిన పాక్ ఆర్మీ చీఫ్.. !

పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా రావడం రావడంతోనే భారీ మార్పులు చేపట్టారు. రెండు వారాల క్రితం జనరల్ రహీల్ షరీఫ్ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన బజ్వా మిలటరీ అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని తొలగించి కొత్త వారిని నియమించారు. దీనిలో భాగంగా భారత్‌పై ప్రతినిత్యం విషం చిమ్మే పాక్ గూడచార సంస్థ ఐఎస్ఐ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రిజ్వాన్ అక్తర్ స్థానంలో..నవీద్ ముక్తర్‌ను నియమించారు. బిలాల్ అక్బర్‌ను జనరల్ స్టాఫ్ చీఫ్‌గా..అలాగే ప్రస్తుతం ఎన్డీయూ అధ్యక్షుడిగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ నజీర్ బట్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా నియమించారు. తాజా మార్పులపై పాక్ మిలటరీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

చెన్నైలో బౌ..బౌ బిర్యానీ..?

చెన్నై మహానగరంలో భోజనప్రియులు ఉలిక్కిపడేలా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నగరంలో కుక్కమాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.  కొద్ది రోజుల క్రితం పలు హోటళ్లలో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని వండి పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నట్లు ఆధారాలతో సహా తేల్చారు పీపుల్‌ ఫర్‌ కెటిల్‌ ఇన్‌ ఇండియా (పీఎఫ్‌సీఐ) ప్రతినిధులు. దీంతో పాటుగా తోపుడు బండ్ల వారికి పిల్లులను విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ముగిసిందో లేదో పలు హోటళ్లు, రోడ్ల వెంబడి దుకాణాల్లో కుక్క మాంసంతో బిర్యానీ చేసి విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మళ్లీ రంగంలోకి దిగిన పీఎఫ్‌సీఐ, పోలీసులు బెంగళూరులోనూ ఇటువంటి ఘటనలే చోటు చేసుకోవడంతో చెన్నైలోనూ ఈ తరహా ఘటనకు అవకాశం ఉండవచ్చనే కోణంలో వివిధ హోటళ్లపై నిఘా ఉంచారు.

మమతను జుట్టుపట్టి ఈడ్చిపారేయాల్సింది

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా జార్గ్రామ్‌లో నిన్న జరిగిన బీజేపీ యువజన విభాగం సమావేశంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్  పాల్గొని ప్రసంగించారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టుపట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో మమత వేలకోట్లు నష్టపోయారని, సడన్ స్ట్రోక్ వల్ల ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు.   ఢిల్లీలో ర్యాలీ చేస్తున్నపుడు జుట్టు పట్టి పక్కకు లాగి పారేసి ఉండవచ్చు..అక్కడున్న పోలీసులు మా వాళ్లే అయినప్పటికీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పారు. మమత తప్పులను బెంగాల్ ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై ఆమె చర్యలను తాము క్షమించబోమని ఘోష్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. నోట్ల రద్దుతో అప్రతిష్టపాలైన బీజేపీ వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. కోట్లాది మంది సామాన్యుల పక్షాన పోరాడుతున్న మమతా బెనర్జీకి ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది.

అసెంబ్లీలో మంత్రిగారి రాసలీలలు

ప్రజల తలరాతలు మార్చే అతి పవిత్రమైన అసెంబ్లీలోనే ఒక బాధ్యతగల మంత్రి రాసలీలలు జరిపాడు. ఈ పనికి ఒడిగట్టింది కర్ణాటక అబ్కారీ శాఖ మంత్రి హెచ్.వై.మేటీ. బాగల్‌కోటేకు చెందిన ఓ ఉద్యోగిని తన బదిలీ విషయమై కొన్ని రోజుల క్రితం కర్ణాటక విధానసౌధలోని మేటీ కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను లొంగదీసుకున్న మంత్రి పలుమార్లు రాసలీలలు జరిపాడు. అయితే ఈ అశ్లీల దృశ్యాలను ఆయన మాజీ గన్‌మెన్ రహస్యంగా చిత్రీకరించాడు. దీంతో మేటీ బండారం బట్టబయలైంది. ఈ ఘటనతో కాంగ్రెస్ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవలే టిప్పుసుల్తాన్ జయంతి రోజున ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్..వేదికపైనే ఫోన్‌లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడటంతో పెద్ద వివాదం రేగింది. ఆ వివాదం ఇంకా ముగియకముందే ఏకంగా అసెంబ్లీలోనే మంత్రిగారు రాసలీలలకు దిగడంతో సిద్ధూ పరువు గంగలో కలిసిపోయింది. మరో వైపు , మేటీని సదరు మహిళతో కలిసి మాజీ గన్‌మెన్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. రూ.15 కోట్లు ఇవ్వకపోతే వీడియోలను బయటపెడతానని గన్‌మెన్ హెచ్చరించాడు. అయితే బళ్లారికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు మంత్రిగారి రాసలీలలకు సంబంధించిన ఆడియో సీడీ బయటపెట్టడంతో కర్ణాటక ఉలిక్కిపడింది.

నా వల్ల జయ ఎంతో బాధపడ్డారు-రజనీకాంత్

జయలలితను తాను ఎంతో బాధపెట్టానన్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, చో రామస్వామిలకు సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో జయలలితకు ఘనంగా నివాళులర్పించిన రజనీ..ఆమెనుద్దేశించి మాట్లాడారు.. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.   నాటి ఎన్నికల్లో జయలలిత తిరిగి గెలిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడని వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి..డీఎంకే-టీఎంసీ కూటమి ఘన విజయం సాధించింది. ఓటమి కారణంగా జయ చాలా బాధపడ్డారని..ఆమెకు వ్యతిరేకంగా నిలిచానన్న విషయం తనను ఇప్పటికీ బాధపెడుతోందని రజనీ అన్నారు. పురుషాధిక్య సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారని, ఆ సవాళ్లే జయను సానపెట్టిన వజ్రంలా మార్చాయన్నారు. అలాగే నటుడు, రచయిత చో రామస్వామి సుధీర్ఘకాలంగా తనకు స్నేహితుడన్నారు.

ఏపీ, తమిళనాడులను వణికిస్తున్న వార్ధా

బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడులను వణికిస్తోంది. ఇది ఇప్పటికే రెండుసార్లు దిశ మార్చుకుని, పశ్చిమ నైరుతి దిశగా ముందుకు కదులుతోంది. తుఫాను ప్రభావంతో తీరం వెంటే ఆదివారం నుంచే గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా తుఫాను తీరం దాటే ఏపీ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దీని ప్రభావం అధికంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం వార్ధా తీరం దాటనున్నట్లు భావిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై సహా కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెన్నైలోని ఎన్నూరు, పట్టినపాక్కం, కాశిమేడు తదితర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా కనిపించింది. వార్థా తీరం దాటుతుండటంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, పన్నీర్ సెల్వంలు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. తుఫానును సమర్థంగా ఎదుర్కోవడం, ముందస్తు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు.

ముంబై టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం..

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముంబైలో జరుగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించి..మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది కోహ్లి సేన. 182/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్‌ను అశ్విన్ కోలుకోలేని దెబ్బ తీశాడు. అశ్విన్ వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత వచ్చిన వారు నిలబడలేకపోవడంతో ఇంగ్లీష్ జట్టు ఓటమి ఖాయమైంది. దీంతో 36 పరుగుల ఇన్నింగ్స్ పరాజయంతో సిరీస్‌ను భారత్‌కు అప్పగించింది.