తమిళనాడులో దుకాణాల మూసివేత.. కార్యక్రమాలు, ప్రయాణాలు రద్దు
గత రెండు నెలలుగా చెన్నై ఆపోలో ఆస్పత్రిలో ముఖ్యమంత్రి జయలలిత చికిత్స సొందుతున్న సంగతి తెలిసిందే. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యతో ఆస్పత్రిలో చేరగా ఆమెకు చికిత్స అందించగా ఆమె కాస్త కోలుకున్నారు అని ఇప్పటి వరకూ పలు బులెటిన్ లు విడుదల చేశారు. దాదాపు రెండు నెలల పాటు సీసీయూలోనే ఆమెకు వైద్య చికిత్సలు కొనసాగాయి. అయితే నిన్న సడెన్ గా ఆమెకు గుండె పోటు రావడంతో వెంటనే ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకూ అమ్మ ఆరోగ్యంపై ఎలాంటి బులెటిన్ లు ప్రకటించకపోవడంతో, పార్టీ నేతలతో పాటు, అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు ఆస్పత్రి వద్దకు తరలివస్తున్నారు.
మరోవైపు జయలలితకు గుండెపోటు వచ్చిందని తెలిసిన వెంటనే నగరంలోని పలు చోట్ల దుకాణాలు, హోటళ్లను మూసివేశారు. నుంగంబాక్కం, మైలాపూర్, కోడంబాక్కం, థౌజంట్‌లైట్స్ తదితర ప్రాంతాల్లో పెట్రోలు బంక్‌లు మూతపడ్డాయి. చెన్నైలో ఆదివారం రాత్రి జరగాల్సిన కార్యక్రమాలను చాలా వరకు రద్దు చేశారు.డీఎంకే కోశాధికారి స్టాలిన్ తూత్తుకుడిలోని తన పర్యటనను రద్దు చేసుకుని చెన్నైకి తిరుగు ప్రయాణమయ్యారు. ఇతర పార్టీల నేతల ప్రయాణాలు కూడా రద్దయ్యాయి.