రాష్ట్రపతికి కోపం తెప్పించారు...
posted on Dec 8, 2016 @ 4:00PM
పార్లమెంట్లో తమ వైఖరితో ఆఖరికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా కోపం తెప్పించారు మన ఎంపీలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుండి ఇప్పటి వరకూ ఏరోజు ఉభయసభలు సజావుగా సాగిన దాఖలాలు లేవు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు సభల్లో ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. ప్రధాని మోడీ సభకు రావాలని.. నోట్ల రద్దుపై మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీల వైఖరిపై స్పందించిన ప్రణబ్ ముఖర్జీ ఎంపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం ఇరుపక్షాల సభ్యులకు ఏమాత్రం భావ్యంకాదని, ఇది అంగీకరించకూడని విషయం అని అన్నారు. ‘ ఎంపీలు.. మీ పని మీరు చేయండి. పార్లమెంటు నడిచేందుకే మీరు అక్కడ ఉన్నారు. పార్లమెంటును కార్యకలాపాలను భంగపరచడం అంగీకరించకూడని విషయం’ అని ఆయన అన్నారు.
కాగా నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై చర్చ జరగాలని, ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, అందుకు ససేమిరా అంటూ, తాము తీసుకుంది సరైన నిర్ణయమే అంటూ అధికార పక్షం చెబుతోంది. దీంతో రోజూ పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళనలు తప్ప చర్చలు మాత్రం జరగడంలేదు.