దారి మళ్లిన ప్రధాని మోడీ హెలికాఫ్టర్..

ప్రధాని నరేంద్రమోడీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను అధికారులు దారి మళ్లీంచారు. బీజేపీ నిర్వహిస్తున్న పరివర్తన్ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ప్రధాని పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం హెలికాఫ్టర్‌లో ఆయన అక్కడికి బయలుదేరారు. అయితే ర్యాలీ జరిగే ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా హెలికాఫ్టర్‌ను కిందకు దించేందుకు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించడంతో హెలికాఫ్టర్‌ను లక్నోకు మళ్లించారు.. అయితే, ప్రధాని మొబైల్ ఫోన్ ద్వారా ప్రసంగిస్తుండగా..ఆ ఫోన్‌ను సభలోని లౌడ్ స్పీకర్ల వద్ద ఉంచి ప్రజలకు వినిపిస్తున్నారు బీజేపీ నేతలు.

నెల్లూరు తీరంలో టెన్షన్..టెన్షన్

వార్దా తుఫాను నెల్లూరు జిల్లా శ్రీహరికోట-చెన్నై మధ్య తీరం దాటనుండటంతో అధికార యంత్రాంగా అప్రమత్తమైంది. సముద్రతీర మండలాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో సహాయక చర్యల కోసం మూడు జాతీయ విపత్తు బృందాలను సిద్ధం చేశామని, అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండగా, తీరం వెంట గాలి తీవ్రత పెరిగింది. తుఫాను తీరం దాటే సమయంలో సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కూలిన చర్చి పైకప్పు..60 మంది మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ నైజీరియాలోని ఉయో ప్రాంతంలో ఆదివారం ప్రార్థనల సందర్భంగా ఓ చర్చిలో జనం గుమిగూడారు. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా చర్చి పైకప్పు  కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకుని 60 మంది దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల కింద నుంచి ఇప్పటి వరకు 60 మృతదేహాలను వెలికి తీశారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చర్చిలో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఈ చర్చిని ప్రత్యేక ప్రార్థనల కోసమని హడావిడిగా ముగించేసినట్లు సమాచారం.

"గాలి" నోట్లు మార్చిన అధికారి అరెస్ట్

కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్థన్ రెడ్డికి సన్నిహితుడైన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్, అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్‌లను ఇవాళ గుల్బార్గాలో అదుపులోకి తీసుకున్నారు. నాయక్ దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన రమేశ్ ఆత్మహత్య కేసులో వీరిని అరెస్ట్ చేశారు. గాలి జనార్థన్ రెడ్డికి చెందిన రూ.100 కోట్ల పాత నోట్లను 20 శాతం కమీషన్ తీసుకుని నాయక్ మార్చారని..ఇవన్నీ తనకు తెలియడంతో చంపేస్తామని బెదిరించారని రమేశ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నాయక్ అతని వ్యక్తిగత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ముంబై టెస్టులో విరాట్ "విశ్వ"రూపం

సూపర్‌ ఫాంలో ఉన్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ..ముంబైలో విశ్వరూపం చూపించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ డబుల్ సెంచరీ సాధించాడు. 302 బంతుల్లో 23 ఫోర్ల సాయంతో డబుల్ మార్క్‌ను చేరాడు. 451/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా..తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం సాధించింది..ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు ప్రదర్శించాడు. జయంత్‌తో కలిసి విరాట్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ..తద్వారా మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ రికార్డుల్లోకి ఎక్కాడు.

పెను తుఫానుగా "వార్ధా"

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుఫాను మరింత బలపడి పెను తుఫానుగా మారింది. శ్రీహరికోట సమీపంలోనే రేపు తుఫాను తీరం దాటే అవకాశాలున్నాయని షార్ వాతావరణ విభాగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 550 కి.మీల దూరంలో, అదే దిశగా మచిలీపట్నానికి 650 కి.మీ..తూర్పు చెన్నైకి 660 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. వార్థా తుఫాను బలపడుతుండటంతో దానిని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంలో ఇస్రో, ఇతర శాఖల అధికారులతో, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

టర్కీపై ఉగ్రపంజా..29 మంది మృతి

టర్కీపై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో  ఫుట్‌బాల్ స్టేడియంని టార్గెట్‌గా చేసుకుని జంట బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. తొలి పేలుడు ఫుట్‌బాల్ స్టేడియం బయట జరగ్గా..రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 29 మంది మృతిచెందగా..166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలి దాడిలో కారు బాంబును వినియోగించగా..రెండో దాడికి ఆత్మాహుతి బాంబర్‌ను ఉగ్రవాదులు వినియోగించినట్లు భావిస్తున్నారు. అయితే దాడి జరిగే సమయానికి మ్యాచ్ ముగియడంతో జనం ఇళ్లకు చేరుకున్నారు..లేదంటే ప్రాణనష్టం భారీగా ఉండేది..దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటన జారీ చేయలేదు.

బ్యాంకులకు కేంద్రం వార్నింగ్..

పెద్ద నోట్ల రద్దు అనంతరం ఐటీ శాఖ చేస్తున్న దాడుల్లో నల్లధనం కుప్పలు కుప్పలుగా దొరుకున్నసంగతి తెలిసిందే. ఆశ్చర్యం ఏంటంటే అందులో కొత్త కరెన్సీ నోట్లు కూడా ఉంటడం. ఒక పక్క సామాన్య ప్రజలు బ్యాంకుల వద్దు, ఏటీఎం ల వద్ద క్యూలో నిలబడి కష్టపడుతుంటే.. మరోపక్క కొంతమందికి మాత్రం కొత్త కరెన్సీ నోట్లు కట్టలకి కట్టలు వచ్చి పడుతున్నాయి. ఆ విషయం బయటపడుతున్న నల్లధనాన్నిచూస్తుంటేనే అర్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే కేంద్రం బ్యాంకులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే నల్లకుబేరులతో చేతులు కలిసి రద్దైన నోట్లను వైట్మనీగా మార్చడానికి సాయపడిన పలువురిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అధికారులెవరు అక్రమాలకు పాల్పడినా వదిలేది లేదంటూ, ఎవరూ కూడా తప్పించుకోలేరంటూ.. మరోసారి హెచ్చరించింది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మంత్రిత్వశాఖ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది.

బాత్ రూంలో కోట్లకి కోట్లు నల్లధనం..

  పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దిమ్మతిరిగే విధంగా కర్ణాటకలో పెద్ద ఎత్తున నల్లధనం బయటపడింది. అది కూడా బాత్ రూంలో. వివరాల ప్రకారం... కర్ణాటకలోని హుబ్లీలో ఐటీ శాఖ అధికారులు ఓ హవాలా డీలర్ ఇంటిలో సోదాలు చేశారు. ఈ సోదాలో భాగంగానే స్నానాల గదిలో కూడా చూడగా అక్కడ ఉన్న డబ్బును చూసి దిమ్మతిరిగిపోయింది. బాత్ రూంలో రూ. 5.7 కోట్లు కొత్త నోట్లు, రూ. 90 లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 32 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీలర్ ను విచారిస్తున్నారు.

మూడో రోజు ముగిసిన ఆట... ఆధిక్యంలో ఇండియా..

  భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.  తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులు సాధించగా, దానికి దీటుగా టీమిండియా బ్యాట్స్ మన్ ఆడారు. ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 51 పరుగుల ఆధిక్యం సాధించింది.  142 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 451 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. ప్రధానంగా మురళీ విజయ్ (136), కెప్టెన్ విరాట్ కోహ్లీ (147) అద్భుతంగా ఆడారు. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉండగా, రేపు ఆట టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు కీలకంగా మారనుంది. పిచ్ టర్న్ అవుతుండడంతో రెండు జట్లకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు కూడా అవకాశం ఉంది.

కోర్టు ముందుకు ఎస్పీ త్యాగి...

  అగ‌స్టావెస్ట్‌ల్యాండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక ద‌ళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్యాగితో పాటు లాయ‌ర్ గౌత‌మ్ ఖైతాన్‌, సంజీవ్ త్యాగిల‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ముగ్గురు నిందితులను సెక్షన్ 120బీ, సెక్షన్ 420 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం,1998 ప్రకారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ ముగ్గుర్ని శుక్రవారం ఉదయం విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. అనంతరం వీరిని కోర్టు ముందుకు తీసుకురానున్నారు. కాగా12 హెలికాప్ట‌ర్ల కొనుగోలు చేసేందుకు ఈ ముగ్గురూ సుమారు 450 కోట్ల లంచం తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో సీబీఐ 2013లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే తొలిసారి ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు.

టెస్ట్ మ్యాచుల్లో కోహ్లీ రికార్డులు...

టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటకే భారత్-ఇంగ్లండ్ జట్టు మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా  వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. ఇప్పుడు మరో రికార్డ్ సాధించాడు. ముంబై టెస్ట్‌లో కోహ్లీ మ‌రోరికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెరీర్ లో మొత్తం 4000 ర‌న్స్‌ను పూర్తి చేశాడు. అతి త‌క్కువ మ్యాచ్‌ల్లో 4వేల మైలురాయిని చేరుకున్న ఆర‌వ భార‌త బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. గ‌తంలో సెహ్వాగ్‌, స‌చిన్‌, ద్రావిడ్‌, అజ‌హ‌ర్‌, గ‌వాస్క‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు.

పార్టీ పగ్గాలు శశికళ చేతిలోకే...

అందరూ అనుకున్నదే జరిగింది. చెన్నై దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ బాధ్యతలు ఆమె నిచ్చెలి అయిన శశికళకే అప్పగించే అవకాశాలు అన్నాయి అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అందరి అనుమానాలనే నిజం చేస్తూ.. పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమ్మ జయలలిత చూపిన దారిలో పార్టీని నడపాలని శశికళను పార్టీ నేతలు కోరారు. అయితే కొంతమంది సీనియర్ నేతలకు మాత్రం శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఇష్టంలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వ మద్దతే శశికళకు ఉండటం వల్ల పని సులువుగా అయిందంటున్నారు. మొత్తానికి శశికళ కల సాకారమయినట్టయింది. కాగా ఇంతకుముందు జయలలిత ఈ పదవిలో ఉండేవారు. దాదాపు 27 ఏళ్లపాటు పార్టీ ప్రధాన కార్యదర్సిగా ఆమె ఉన్నారు.

అమ్మ మరణం తర్వాత తొలి కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు

  చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అమ్మ మరణం అనంతరం పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. ఇక జయ కన్ను మూసిన తరువాత ప‌న్నీర్ సెల్వం అధ్యక్ష‌త‌న ఈ రోజు మొద‌టిసారిగా రాష్ట్ర‌ కేబినెట్ భేటీ జ‌రిగింది. సమావేశానికి ముందు జ‌యల‌లిత స‌మాధివద్ద ప‌న్నీర్ సెల్వంతో పాటు ఆ రాష్ట్రమంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయ భవనంలోనూ జయలలిత చిత్రపటాన్ని ఉంచి ఆ ఫొటో ముందే కేబినెట్ భేటీలో ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో కేటినేట్ పలు నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అవి. * జ‌య‌ల‌లిత పేరిట మెరీనా బీచ్ వ‌ద్ద ఘాట్ నిర్మాణానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. * జ‌య‌ల‌లిత రాష్ట్రంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను నిర్విఘ్నంగా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. * జ‌య‌ల‌లిత స్మార‌క విగ్ర‌హాల ఏర్పాటు చేయాలని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించింది.

నోట్ల రద్దుపై మోడీ.. అక్కడ మాట్లాడనివ్వలేదు..ఇక్కడ మాట్లాడుతున్నా..

  ప్రధాని నరేంద్ర మోడీ అహ్మాదాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రంతో పాటు పాల సహకార కేంద్రాలను ప్రారంభించారు. అంతేకాదు ప‌లు ప్రాజెక్టులకు కూడా ఆయ‌న చేతుల మీదుగా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై ప్ర‌స్తావించారు. పార్ల‌మెంటులో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరపకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని.. చర్చకు సిద్దంగా ఉన్నామని చెబుతున్నా చర్చను మాత్రం జరగనివ్వడం లేదు.. లోక్‌స‌భ‌లో త‌న‌కు ఈ అంశంపై మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని, కానీ తాను జ‌న్‌స‌భ‌లో ఈ రోజు మాట్లాడుతున్నాన‌ని చెప్పారు. అక్ర‌మ‌మార్గాల్లో డ‌బ్బు మార్చుకుంటున్న వారిని తాము వ‌దిలిపెట్ట‌బోమ‌ని..పెద్దనోట్ల రద్దు దేశంలోని పేదలకు ఎంతో లాభం చేకూర్చుతుంద‌ని.. సామాన్యుడిని విప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని, నిజానిజాల‌ను చెప్పేందుకే జ‌నం ముందుకు వ‌చ్చానని..  న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డం కోస‌మే పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేశామ‌ని అన్నారు.

లంచ్ టైం.. బారత్ స్కోర్ 247/2

  ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. ఇక ఈరోజు ఆట ప్రారంభించిన భారత్ జట్టు లంచ్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247పరుగులు చేసింది. తొలిరోజు ఆట ప్రారంభించిన వెంటనే  పుజారా ఔటయ్యాడు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ దూకుడుగా ఆట ఆడుతుండటంతో జట్టు ఇప్పటివరకూ బాగానే స్కోర్ చేసింది. ఈ రోజు ఆటలో 31ఓవర్లు ఆడిన భారత జట్టు వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. మూడో రోజు లంచ్‌ విరామ సమయానికి మొత్తం 83ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం మురళీ విజయ్‌ 124 పరుగులతో, విరాట్‌ కోహ్లీ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.

పెద్ద నోట్లపై నోరెత్తని రఘురామ్ రాజన్...

  పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇప్పటికే పలువురు స్పందించారు. కానీ దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని వీడిన తరువాత రఘురాం రాజన్ మాత్రం నోరు మొదపలేదు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ ప్రొఫెసర్ గా ఉన్న ఆయన, అహ్మదాబాద్ ఐఐఎంను సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన అహ్మదాబాద్ లో 'ది గ్లోబల్ ఎకానమీ: ఆపర్చ్యునిటీస్ అండ్ చాలెంజస్' అంశంపై ప్రసంగించారు. అయితే ఆతరువాత నోట్ల రద్దు అంశంపై మాట్లాడతారని అనుకున్నారు. కానీ అది మాత్రం జరగలేదు. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద సంస్కరణగా, తాను పదవిని వీడిన తరవాత వచ్చిన నోట్ల రద్దుపై ఆయన తన అభిప్రాయాన్ని చెబుతారని పలువురు భావించినా, రాజన్ మాత్రం నోరు మెదపలేదు.