గాలి వారి మ్యారేజ్ మెనూ... 1000 రకాలు! 100 కోట్లు!
posted on Nov 8, 2016 @ 5:03PM
గాలి వారి పెళ్లి! కొన్ని రోజుల క్రితం ఈ వార్త పెనుగాలిలా దుమారం రేపింది! మళ్లీ అంత త్వరగానే సద్దుమణిగింది. చాలా మంది గాలి జనార్దన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో వుండి రావటం, ఇప్పటికీ సీరియస్ కేసులు ఎదుర్కుంటూ వుండటం, అయినా భారీగా కూతురు పెళ్లికి సిద్ధపడటం అనేది జీర్ణించుకోలేకపోయారు. నెగటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా దద్దరిల్లింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా చానల్స్ కూడా ప్రైమ్ టైంలో గాలి వారి పెళ్లిని ఆన్ ఎయిర్ డిస్కషన్ గా మర్చేశాయి! అయితే, ఇప్పుడు మరోసారి గాలి కుమార్తె వివాహం గురించి ఓ వార్త బయటకొచ్చింది!
పెళ్లి అన్నాక తాళి, తలంబ్రాలు ఎంత ముఖ్యమో మన వాళ్లకు తిండీ అంతే ముఖ్యం కదా? జనార్దన్ రెడ్డి తన రేంజ్ కు తగ్గట్టుగా జనానికి తినిపించి పంపే ఏర్పాట్లు చేస్తున్నారట. వందల కోట్లు ఖర్చు చేస్తున్న ఆయన కూతురు పెళ్లిలో ఆహార్యాలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆహారాలకు కూడా ఇస్తున్నారట! వస్తోంది మరి మామూలు వారు కాదు కదా! బెంగుళూరు పొలిటీషన్స్ , అక్కడి కన్నడ సినిమా వాళ్లు మన తెలుగు రాజకీయ, సినిమా ప్రముఖులు... ఇలా అందరికందరూ పోలోమంటున్నారు! అసలు బాలీవుడ్ నుంచి సాండల్ వుడ్ దాకా ఎన్ని సినిమా రంగాల ఎందరు సెలబ్రిటీలు వస్తారో ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. వాళ్ల కాకుండా రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల వాళ్లు కూడా ఎలాగూ వుంటారు!
సామాన్యుల పెళ్లికి మొత్తంగా వచ్చే జనం కన్నా జనార్డన్ రెడ్డి ఇంటి పెళ్లికి వచ్చే సెలబ్రిటీలే ఎక్కువగా వుండే ఛాన్స్ వుండటతో బోజనాల సంగతి కూడా ప్రత్యేకంగా పట్టించుకుంటున్నారట. మొత్తం ఎన్ని ఐటెమ్స్ టేబుల్స్ పై వుంటాయో తెలుసా? వెయ్యి! అవును, వెయ్యి రకాల ఆహారాలు ఆవురావురుమనిపిస్తాయట! అవ్వి కేవలం కర్ణాటక స్పెషల్ వంటకాలు మాత్రమే కాదు. మొత్తం దేశంలోని అన్ని ఫేమస్ ఫుడ్ ఐటెమ్స్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహంలో దర్శనమిస్తాయి. అంతే కాదు, ప్రపంచంలోని బాగా ఫేమస్ రెసిపీస్ కూడా మనోళ్ల పెళ్లిలో పొగలుగక్కుతాయట! ఇంతకీ, ఈ క్యాటరింగ్ మొత్తానికి ఎంత ఖర్చవుతోందనుకుంటున్నారు? వంద కోట్లట!
ఒక్క పెళ్లికి మరీ ఇంత ఖర్చు చేసి వండించటం అవసరమా అని మీకు డౌట్ రావొచ్చు. కాని, ఇందులో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే, కర్ణాటక మాజీ మంత్రి అయిన గాలి జనార్దన్ రెడ్డి ఆ రాష్ట్ర యావత్ ప్రజానీకానికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు! నవంబర్ 16న ఆయన కూతురు పెళ్లికి జనం ఎవ్వరైనా వెళ్లి భోజనం చేసి రావొచ్చు! మరి అటువంటప్పుడు వంద కోట్లు ఖర్చు అవ్వవంటరా? అయితే, ఇందులో మరో లాభం కూడా వుంది. ఇప్పుడు గాలి వారి ఇంటి రుచికరమైన భోజనం తిన్న జనం భవిష్యత్ లో ఎప్పుడైనా అది గుర్తొచ్చి ఓట్లు వేయోచ్చు. మరోసారి ఆయన్ని మంత్రిని కూడా చేయోచ్చు! కాదంటారా?