ట్రంప్... అమెరికా వాళ్ల కేసీఆర్!
posted on Nov 9, 2016 @ 4:00PM
అమెరికా 250ఏళ్ల ప్రజాస్వామ్య అస్థిత్వం తరువాత కూడా ఒక స్త్రీని అధ్యక్షురాలిగా ఎన్నుకోలేదు!క్లింటన్ కి బదులు కరుడుగట్టిన బిజినెస్ మ్యాన్ ట్రంప్ నే నెత్తిన పెట్టుకుంది! దీనికి కారణం ఏంటి? కొందరు చెబుతున్నట్టుగా పురుషాధిక్యతే కారణమా? అఫ్ కోర్స్, అయ్యి కూడా వుండొచ్చు. కాని, అంతకంటే సీరియస్ పొలిటికల్ కారణం ఒకటి ట్రంప్ ను గెలిపిచిందే! అదే కేసీఆర్ ఫార్ములా!
ట్రంప్ కు , కేసీఆర్ కు ఏంటి సంబంధం అంటారా? ఏ సంబంధమూ లేదు. కాని, వాళ్ల వ్యూహాలు మాత్రం చాలా దగ్గరగా వుంటాయి. అదే పెద్ద లింక్. ఇంతకీ విషయం ఏంటంటే... కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగదోయటానికి ఏం చెప్పేవారు? తెలంగాణని ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని! ముఖ్యంగా, ఆంద్రా పాలకులపై ఆయన తోచినప్పుడల్లా ఒంటి కాలు మీద లేచేవారు. ట్రంప్ కూడా తన ప్రెసిడెన్షియల్ క్యాంపైన్ లో అదే రూల్ పాటించాడు. అమెరికా అంతటి అగ్రరాజ్యానికి కూడా ట్రంప్ అభద్రత నూరిపోశాడు. ఇండియన్స్ , చైనీస్, సింగపూర్ వాళ్లు, మెక్సికో జనాలు మన అవకాశాలు తన్నుకుపోతున్నారని ఒకటే ఉదరగొట్టాడు. కేసీఆర్ కూడా అచ్చం ఇలాగే చెలరేగిపోయే వారు తమ ఉద్యమ కాలంలో. అలాగే, ఆంధ్రుల పట్ల కేసీఆర్ విపరీత వాఖ్యలు చాలా సందర్భాల్లో పెద్ద రచ్చకి కారణం అయ్యేవి. డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీదా , మెక్సికన్ల మీదా చేసిన కామెంట్స్ కూడా అలాగే వుంటాయి. అయిన దానికి, కాని దానికి అన్నిటికి ముస్లిమ్ లే కారణమంటాడు అమెరికా 45వ అధ్యక్షుడు!
కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడింది, ట్రంప్ అమెరికా గురించి మాట్లాడింది అంతా తప్పా? అస్సలు కాదు. వాళ్ల వాదనలో నిజం వుంది. అందుకే, కోట్లాది మంది ప్రత్యక్ష ఎన్నికల్లో వారి వెంట నిలిచారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని, ట్రంప్ కు అమెరికాని అప్పజెప్పారు. కాని, చాలా మందికి కేసీఆర్, ట్రంపుల్లో హర్ట్ చేసే విషయం ఏంటంటే... వాళ్లు ఆరోపణలు చేసే విధానం! పరమ దారుణమైన భాషని ప్రయోగించి తమ ప్రత్యర్థుల్ని, శత్రువుల్ని దెబ్బతీస్తారు ఇద్దరు! అది వాళ్ల వాక్చాతుర్యం అని అభిమానులు అంటే... పొగరని మిగతా వారు అంటుంటారు!
తెలంగాణ జనం తరుఫున మాట్లాడిన కేసీఆర్ అధికారం చేపట్టారు. ట్రంపు కూడా అమెరికన్ల గురించి మాట్లాడి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. వాట్ నెక్ట్స్? కేసీఆర్ ఆంద్రా వాళ్లని వెళ్లగొట్టయే లేదు. హైద్రాబాద్ లో ఎవ్వరి మీదా దాడులు జరగలేదు. పై పెచ్చు ఆంధ్రా జనానికి కేసీఆరే ఇప్పుడు రక్షణగా వుంటానంటున్నారు! ట్రంపుకు కూడా ఇదే మార్గం తప్పక పోవచ్చు!అమెరికాలోని ఇండియన్స్ ని ఉద్యోగాల్లోంచి తీసేసి స్వదేశానికి వెళ్లగొట్టేయటం హిల్లరీపై గెలిచినంత తేలిక కాదు. ఇక ముస్లిమ్స్ ను టార్గెట్ చేసి దాడులు, యుద్దాలు చేస్తూ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించటం కూడా అంత ఈజీ కాదు. చైనా, రష్యా లాంటి దేశాలు ట్రంప్ ఆధిపత్యాన్ని చూస్తూ ఊరుకోవు. కాబట్టి, అధికారంలోకి వచ్చిన ట్రంప్ మేఘాల మాటుకు చేరుకున్న సూర్యుడిలా వేడి తగ్గించుకోవాల్సిందే! కేసీఆర్ ఈ సూత్రం సీఎం అయిన నాటి నుంచే ఫాలో అవుతున్నారు!