ఆడాళ్లందరికీ... శబరిమలకు స్వాగతం!
posted on Nov 7, 2016 @ 4:35PM
కార్తీకం వస్తే ఎక్కడ చూసినా నల్ల బట్టలతో అయ్యప్ప స్వాములు కనిపిస్తుంటారు! అయితే, చాలా వరకూ ఈ అయ్యప్ప మాల వేసుకున్న వారు మగవారే. 10ఏళ్ల కంటే చిన్న పిల్లలు, 50ఏళ్ల కంటే పెద్దవారు మాత్రమే ఆడవారు కనిపిస్తారు. యవ్వనంలో వున్న మహిళలెవరూ అయ్యప్ప దీక్ష చేయరు. ఇది నియమం. కాని, అతి త్వరలో మొత్తం పరిస్థితి అంతా మారిపోనుందా? సుప్రీమ్ కోర్టు , కేరళ ప్రభుత్వం వాలకం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది!
సుప్రీమ్ కోర్టులో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల స్త్రీలని అనుమతించాలన్న పిటీషన్ పై విచారణ నడుస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అన్న కారణం చేత ఋతు స్రావం జరిగే మహిళల్ని కొండపైకి అనుమతించరు. ఇది శతాబ్దాలుగా అమలు అవుతూ వస్తోన్న ఆచారం. దీనికి శాస్త్రీయత అంటూ ఏమీ లేకపోయినా తరతరాలుగా వస్తోన్న ఒక విశ్వాసం మాత్రమే ఆధారం. కాని, దాన్ని ప్రశ్నించే వ్యక్తులు చాలా రోజులుగా వుంటూనే వున్నారు. కేరళలోని ఇతర శాస్తా ఆలయాల్లో ఆడవార్ని మామూలుగానే అనుమతిస్తారు. ఒక్క శబరిమల మీద మాత్రమే నెలసరి వచ్చే స్త్రీలని అనుమతించరు. ఇది ఆడవారి సమానత్వానికి, గౌరవానికి భంగమే అంటూ కొందరు కోర్టుకెక్కారు. ఇప్పుడు శబరిమల ఆలయం ఆచారం కాస్తా కోర్టు నిర్ణయంపై ఆధారపడి వుంది!
కోర్టు అటు అయ్యప్ప ఆలయాన్ని నిర్వహించే దేవస్థానం బోర్డును, ఇటు కేరళ ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. అందుకు, కేరళలోని ఒకప్పటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం స్త్రీలు ఆలయంలో ప్రవేశించవచ్చని సమాధానం ఇచ్చింది. కాని, తరువాత వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని సర్కార్ కుదరదని చెప్పింది. ముందు గవర్నమెంట్ ఇచ్చిన అఫీడవిట్ లో అచ్చు తప్పు పడిందని కూడా చెప్పింది! తమ అభిప్రాయం ప్రకారం అన్ని వయస్సుల ఆడవాళ్లు ఆలయంలో ప్రవేశించకూడదని కోర్టుకు చెప్పింది. అయితే, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి లెప్ట్ ప్రభుత్వం రావటంతో కథ మొదటికి వచ్చింది. అన్ని వయస్సుల్లోని మహిళలు కొండపైకి రావచ్చని గవర్నమెంట్ అంటోంది!
ఒక హిందూ దేవాలయంలోకి స్త్రీలని అనుమతించకపోవటం సామాజికంగా తప్పే కావచ్చు. మహారాష్ట్రలోని శని సిగ్నాపూర్ మూల విగ్రహం వద్దకి ఆడవార్ని అనుమతించకపోవటం కూడా ఇలానే వివాదాస్పదం అయింది. ఉద్యమకారులు రంగంలోకి దిగి భారీగా పోరాటం చేశారు. అయితే, అక్కడ ఎట్టకేలకు మహిళలకు అనుమతి లభించింది. కాని, ఇప్పటికిప్పుడు శని సిగ్నాపూర్ లో ప్రధాన మూర్తి దగ్గరికి ఎంత మంది స్త్రీలు వెళుతున్నారు? లాజిక్ తో సంబంధం లేకుండా విశ్వాసంపై ఆధారపడ్డ ఆచారాలు అంత త్వరగా పోయేవి కావు. అనుమతి వున్నా లేకున్నా జనం నమ్మకంతో ఒక ఆచారం పాటిస్తున్నప్పుడు పాటిస్తూనే వుంటారు. పైగా సతీ, బాల్య వివాహాల వంటి వాటిల్లో వున్నట్లు ప్రత్యక్ష హాని కూడా లేనప్పుడు అంత త్వరగా సామాన్య జనం అభిప్రాయం మార్చుకోకపోవచ్చు. అది గుడి అయినా, దర్గా అయినా కోర్టు ఒప్పుకుంది కాబట్టి ఆడవారు విశ్వాసాల్ని పటాపంచలు చేసుకుని వెళ్లిపోరు. చాలా కాలం పట్టవచ్చు.
శబరిమల అనుమతి విషయంలో కూడా కోర్టు, కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్టు... వీటి అభిప్రాయం ఏమంత ప్రధానం కాదు. ఎందుకంటే, కేరళలో ప్రతీ అయిదేళ్లకోసారి మారే ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్లు అభిప్రాయలు మార్చుకుంటున్నాయి. ఇది ఒక విధంగా హిందూ సమాజం మనోభావాలతో ఆటలాడుకోవటమే. అయితే అభ్యుదయ పంథాకో, లేదంటే సంప్రదాయవాదానికో కట్టుబడాలి. కాని, కేరళలో కాంగ్రెస్ ఆచారం ముఖ్యం అంటే కమ్యూనిస్టులు సమానత్వమే గొప్ప అంటున్నారు. అందుకోసం స్త్రీలు అయ్యప్ప ఆలయంలో ప్రవేశించాలంటున్నారు. ఇదంతా రాజకీయ కోణం. ఫైనల్ గా సుప్రీమ్ కోర్టు చెప్పేదే అందరికీ శిరోధార్యం అవుతుంది. అప్పుడు కూడా కేవలం న్యాయస్థానం చెప్పింది కాబట్టి తరతరాల విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎంత మంది స్త్రీలు కొండ మీదకి వస్తారనేది పెద్ద ప్రశ్న! దాని కంటే ముందు తేలాల్సిన ఇంకో విషయం, అసలు కోర్టులు మత సంబంధమైన విషయంలో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు? చేసుకుంటే అన్ని మతాల్లోని అసమానత్వాల్ని కోర్టులు రూపుమాపుతాయా? అదెంత వరకూ సాధ్యం? ఇలా బోలెడు ప్రశ్నలు! సమాధానం కాలమే చెప్పాలి...