పాత వైట్ హౌజ్, కొత్త ట్రంప్, సరికొత్త నిర్ణయాలు!
posted on Nov 14, 2016 @ 1:52PM
పాలిటిక్స్ పాలిటిక్సే! అమెరికా అయినా ఆఫ్రికా అయినా రాజకీయాల్లో కేవలం సిన్సియారిటీ వుంటే సరిపోదు. సంచలనంగా నిలిచే సత్తా వుండాలి. మనం ఏం చేసినా జనం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయి చూస్తూ వుండిపోవాలి! అలా మ్యానేజ్ చేసిన వాళ్లే ఇప్పుడు అధికారం చేపడతున్నారు. మ్యాజిక్ చేసేవాళ్లు ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
మన దేశంలో ఇప్పుడు జరుగుతోన్న చర్చ దేని గురించి? ఇంకేముంది, నోట్ల రద్దు విషయం గురించే! 500, 1000 నోట్లు మోదీ అనూహ్యంగా నిషేధించారు. దాంతో జనం సమర్థిస్తూ , విమర్శిస్తూ రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎవరి వాదనలు వారివి. కాని, ఇక్కడ అంతా గుర్తించాల్సిన విషయం ఒక్కటే! ఎవరికి ఇష్టం వున్నా లేకున్నా మోదీని మాత్రం అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఆయన గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది!
మొన్న జరిగిన అమెరికా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడు కావటంతో అక్కడ కూడా సంచలనాల పరంపర మొదలైంది. తాను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమంగా వుంటోన్న వార్ని ఇంటికి పంపిస్తానన్న ట్రంప్ అన్నంత పని చేసేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తున్నాడట. అయితే , దాని కంటే ముందు అమెరికన్స్ లో ఆశ్చర్యానికి కారణమైన న్యూస్ ట్రంప్ సంవత్సర జీతం! ఇలాంటి వార్తలు మన భారతీయులకు అయితే మామూలేగాని అగ్ర రాజ్యం జనాలకి షాకింగ్ గా వున్నాయట! ఇంతకీ ట్రంప్ తన సంవత్సర జీతం గురించి ఏమన్నాడు?
సాధారణంగా అమెరికన్ ప్రెసిడెంట్ గారి జీతం వన్ ఇయర్ కి కోట్లలో వుంటుంది. అమెరికన్ డాలర్స్ లో చెల్లించే ఈ మొత్తం మన ఇండియన్ రూపీస్ లోకి వస్తే మరింత భారీగా వుంటుంది. ఒక అంచన ప్రకారం 2కోట్లా 60లక్షలు అవుతుందట. కాని, ఇంత మొత్తాన్నీ ట్రంప్ రిజెక్ట్ చేసేశాడు. కేవలం ఒక డాలర్ మాత్రమే జీతం తీసుకుని సంవత్సరమంతా పని చేస్తాడట! ఇలా రూపాయి జీతం, డాలర్ జీతం అనగానే మీకు మన ఎన్జీఆర్ గుర్తొచ్చారు కదా? అప్పట్లో అన్నగారు నెలకు రూపాయి జీతం తీసుకునే వారు. జయలలిత కూడా ఓ సారి నెలకు రూపాయి జీతం కార్యక్రమం నడిపింది! డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మన వాళ్లకంటే మరింత చెలరేపోతూ సంవత్సరం మొత్తానికి ఒకే ఒక్క డాలర్ తీసుకుంటా అంటున్నాడు! అంతే కాదు, మోదీ లాగా ఒక్క హాలీడే కూడా తీసుకోకుండా పని చేస్తానని అమెరికన్స్ కి హామి ఇస్తున్నాడు!
ట్రంప్ ఇప్పటి దాకా వైట్ హౌజ్ లో కాలుమోపిన ప్రెసిడెంట్స్ అందరి కంటే భిన్నంగా దూసుకుపోతున్నాడు. అది మంచికో, చెడుకోగాని ప్రస్తుతానికైతే ఒక డాలర్ జీతం న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముందు ముందు ఈ 45వ అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాడో... అవ్వి ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తాయో? కదిలిస్తాయో? లేక కవ్విస్తాయో! వేచి చూడాలి!