అరేబియాని గడగడలాడిస్తున్న ఆరుగురు పిల్లల తల్లి!
posted on Nov 8, 2016 @ 11:55AM
ఆమె రెండు సార్లు విడాకులు తీసుకుంది. మొత్తం ఆరుగురు పిల్లలు. వయస్సు 42ఏళ్లు. ట్విట్టర్ లో చాలా సూటిగా, సంచలనాత్మకంగా స్టోస్ల్ లు పెడుతుంది. స్త్రీల హక్కుల గురించి దైర్యంగా మాట్లాడుతుంది. ఆమె ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోన్న ఉద్యమకారిణి! అయితే, ఇదంతా పెద్ద విశేషంలా అనిపించటం లేదు కదా? ఎందుకంటే, ఇలాంటి పనులు చేసే చైతన్యవంతులైన మహిళలు బోలెడు మంది వుంటుంటారు. కాని, మనం ఇంత దాకా చెప్పుకున్న స్త్రీ ఏ దేశంలో పుట్టి, పెరిగి, తన ఉద్యమం సాగిస్తోందో తెలుసా? సౌదీ అరేబియా!
సౌదీ అరేబియాలో స్త్రీల హక్కుల కోసం ఉద్యమం... ఇప్పుడు మొత్తానికి మొత్తంగా కాంటెక్ట్సే మారిపోయింది కదా? ప్రపంచ ఇస్లాం మతానికి కేంద్రమైన సౌదీలో మహిళల స్వేచ్ఛ అందరికీ తెలిసిందే. కరుడుగట్టిన మత ఛాందసం అక్కడి రాచరిక వ్యవస్థలో అంతర్భాగం. కనీసం స్వంతంగా కార్ నడపటం కూడా అక్కడి ఆడవాళ్లకు నిషిద్ధం. అటువంటి దేశంలో ఒకామె ఆడవారి గురించి గొంతు ఎత్తుతోంది. ఏకంగా ట్విట్టర్ లో కామెంట్లు చేస్తూ ఆ దేశ మత పెద్దల్నే టార్గెట్ చే్స్తోంది. ఆమె పేరు... సవద్ అల్ షమ్మరి!
42ఏళ్ల వయస్సులో రెండు సార్లు విడాకులు తీసుకుని ఆరుగురు పిల్లల్ని పెంచుతోన్న షమ్మరి ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె చాలా మంది పేద సౌదీ అమ్మాయిల్లాగే చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. తన కంటే చాలా పెద్దవాడైన ఆ మొదటి భర్తతో ఒక పాప పుట్టగానే విడాకులు తీసుకుంది. కాని, తరువాత తనకు డైవోర్స్ ఇప్పించిన జడ్జీనే వివాహమాడింది. అతనితో 5గురు పిల్లలు పుట్టారు. అయితే, మొదటి భర్త షమ్మరి పై కోర్టుకు వెళ్లి తన కారణంగా పుట్టిన ఆమె కూతుర్ని తీసేసుకున్నాడు. షమ్మరి తన పెద్ద కూతురు తనతో వుండాలని ఎంతో పోరాటం చేసింది. కాని, సౌదీ అరేబియాలోని మత కోర్లులు ఆమె మాట పట్టించుకోలేదు. కూతురు సవతి తండ్రి వున్న ఇంట్లో వుండటానికి వీలు లేదని... స్వంత తండ్రితోనే వుండాలని తీర్పునిచ్చాయి. అలా తన మొదటి సంతానాన్ని మొదటి భర్తకు వదులుకోవాల్సి వచ్చింది, షమ్మరి.
ఒక సారి తన కూతుర్ని భర్తకు కో్ల్పోయాక సౌదీలోని స్త్రీల ఇబ్బందులపై మాట్లాడాల్సిన అవసరం గుర్తించింది అల్ షమ్మరి. ట్విట్టర్ లో యాక్టివ్ గా మారిపోయింది. అంతే కాదు ఒక ఆన్ లైన్ గ్రూప్ ఏర్పాటు చేసి అరబ్ మహిళల కష్టాలు, కన్నీళ్ల గురించి ప్రచారం, చర్చ చేస్తోంది! అంతే కాదు, తాను పెళ్లి చేసుకున్న రెండో భర్తకు కూడా ఆమె ఇప్పుడు విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం తన రెండో వివాహం వల్ల కలిగిన 5గురు పిల్లలతో పాటూ మొదటి భర్త తీసుకు వెళ్లిన మొట్ట మొదటి సంతానాన్ని కూడా వెనక్కి తెచ్చుకుని ఆరుగురితో జీవిస్తోంది. షమ్మరి తన ఫస్ట్ హజ్బెండ్ జబ్బు పడటంతో అతడి వద్ద వున్న బిడ్డని కోర్టు ఆర్డర్ ద్వారా వెనక్కి తెచ్చుకుంది.
సౌదీ లాంటి మత ఛాందసవాద రాచరిక వ్యవస్థలో షమ్మరి సింగిల్ మదర్ గా వుండటమే చాలా పెద్ద సక్సెస్. కాని, ఆమె అక్కడితో ఆగకుండా తన దేశంలోని అరాచాకాలపై ఆన్ లైన్ యుద్ధం చే్స్తోంది. రీసెంట్ గా ఆమె గడ్డాలు పెంచుకున్న వివిధ మతస్థుల ఫోటోలు పోస్ట్ చేసింది ట్విట్టర్ లో! అందులో మన సిక్కు మొదలు కమ్యూనిస్టుల వరకూ అందరూ వున్నారు. అయితే, ఇందులో విశేషం ఏంటంటే షమ్మరి ఆ గడ్డాలున్న వ్యక్తులందర్నీ చూపిస్తూ... కేవలం గడ్డాలు పెంచుకుంటే మత పెద్దలు, పవిత్ర ముస్లిమ్ లు అయిపోరని చురకలంటించింది! ఇలా నేరుగా సౌదీలోని అత్యంత శక్తివంతులైన మత పెద్దల్ని టార్గెట్ చేయటం... ప్రాణాలకి తెగించటమే!
అల్ షమ్మరి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ కి గానూ మూడు నెలలు జైలు శిక్ష అనుభవించింది. జనాన్ని రెచ్చగొట్టడం అనే అభియోగం ఆమెపై మోపారు. అయినా ఆమె తన ఉద్యమం ఆపలేదు. జైల్లో కూడా స్త్రీలకి ప్రోత్సాహానిస్తూ గడిపింది. ఓ బుక్ కూడా రాసింది. ఎందుకంటే నేను మనిషిని అన్న ఆ పుస్తకం సౌదీలో బ్యాన్ కూడా చేసేశారు! అసలు ఆమె ఏ విధంగా ప్రభుత్వ పెద్దల్ని బెంబేలెత్తిస్తోంది ఈ బ్యాన్ తోనే అర్థమైపోతుంది!
షమ్మరి ఆడవాళ్లు కార్ నడపొచ్చని, అందంగా అలంకరించుకోవచ్చని, సంగీతం వినొచ్చని... తన వద్దకు వచ్చే మహిళలకు సూచిస్తుంది. ఇవన్నీ సౌదీలోని షరియా చట్టానికి వ్యతిరేకం. మరి ఇలా తమకు వ్యతిరేకంగా పోరాడుతోన్న ఉద్యమకారిణి అరేబియా ఎంత కాలం భరిస్తుందో చూడాలి? అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా మరణ శిక్షలు చాలా సులువుగా వేసేస్తుంటారు. అందుకే, షమ్మరి ప్రాణానికి అనుక్షణం గండమే వుంది ఇప్పుడు. కాని, ఆమె వెంట మొత్తం ప్రపంచం నిలవాలని మనమూ కోరుకుందాం. ఆఫ్ట్రాల్ ఎక్కడైనా స్త్రీలకు స్వేచ్ఛా, సమానత్వం దక్కటం ప్రపంచ శాంతికి చాలా కీలకం. అందుకైనా ఈ అరేబియా ధీర నారికి అందరూ అండగా నిలవాలి!