అమెరికా TRUMPED... హిల్లరీ STUMPED!
posted on Nov 9, 2016 @ 1:38PM
ట్రంప్... ఒకప్పుడు ప్రపంచ మీడియాలో ఈ పేరు కామెడీ! తరువాత ట్రాజెడి! ఇంకా తరువాత హారర్! ఫైనల్ గా ఇప్పుడు ... రియాల్టీ! అసలింతకీ చాలా మంది గెలవడని, గెలువొద్దని చెప్పుకొచ్చిన ట్రంప్ ఎలా ట్రంపింగ్ విక్టరీ సాదించాడు? ఇదో గొప్ప పాఠం... పెద్ద గుణపాఠం!
2014కి ముందు భారతదేశంలో మోదీ చర్చ వుండేది. అసలాయన గుజరాత్ ముఖ్యమంత్రిగానే వుండొద్దని చెప్పే సత్యమంతులు మొదలు ఆయన ప్రధానైతే దేశం వదిలిపోతానని చెప్పుకొనే సాహసవంతుల వరకూ చాలా మంది వుండేవారు. మీడియాకి కూడా యాంటీ మోదీ బ్యాచ్ కి వీలైనంత విలువ ఇచ్చేది. అదే సమయంలో సోషల్ మీడియా అంతకంతకూ మోదీ అనుకూల పూనకంతో ఊగిపోయేది. ఇలా రక్తి కట్టిన 2014ఎన్నికలు చివరకు మోదీ ప్రమాణ స్వీకారంతో ప్రమోదంగా ముగిశాయి. ఈ సారి ఎన్నికల్లో అమెరికాలోనూ అదే జరిగింది!
ట్రంప్ పెద్దగా గెలిచే అవకాశాలు వున్న నేత ఏం కాదు. అసలు ఆయన ఫుల్ టైం పొలిటీషనే కాదు. ఏదో తన బిజినెస్ లు తాను చేసుకునే ఫక్తు క్యాపిటలిస్టు. కాని, అమెరికాలోని సో కాల్డ్ అభ్యుదయ వాద మీడియా, మేధావులు, వారికి తోడైన ఆదర్శవాద సామాన్య జనాలు అందరూ కలిసి వైట్ హౌజ్ అప్పగించేశారు. తమకి తాము పెట్టుకుని స్టాండర్డ్స్ తో ట్రంప్ ను పోల్చేసి చులకన చేసి మాట్లాడారు. నిందించారు. వెక్కిరించారు. హేళన చేశారు. అంతిమంగా ట్రంప్ ఏం చెబుతున్నాడో అమెరికన్స్ అంతా జాగ్రత్తగా వినేలా చేశారు! నిజానికి డొనాల్డ్ ట్రంప్ ముస్లిమ్ ల మీద, మెక్సికన్ల మీద చేసిన కామెంట్స్ అత్యంత దారుణమైనవి. ఒక రకంగా జాత్యహంకారం కొట్టొచ్చినట్టు వాటిల్లో ధ్వనించింది. అలాంటి ఒక మత ద్వేషి, ఒక వర్గ ద్వేషి అమెరికా ప్రెసిడెంట్ పదవికి పనికి రాడు. కాని, ఈ విషయం చెప్పటంలోనే అమెరికన్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా తప్పులో కాలేశాయి. ట్రంప్ అరాచకంగా మాట్లడుతున్నాడని చెప్పే తొందర్లో అసలు ఏ పేపరు, ఛానలు అమెరికన్స్ లోని ఉగ్రవాద భయాన్ని గుర్తించలేదు. ట్విన్ టవర్స్ కూలాక అమెరికా ప్రజలు టెర్రరిజాన్ని భూతంలా చూస్తున్నారు. కాని, హిల్లరీ అదేం పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడుతూ వచ్చింది. కాని ట్రంప్ నేరుగా మూలలు మాట్లాడాడు. ఉగ్రవాదం ఒక మతంలోని కొందరు అతి వాదుల వల్ల ఎక్కువవుతోందనీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఫండింగ్ చేస్తున్నాయని సుత్తి లేకుండా చెప్పాడు. ఇదే ఓటింగ్ టైంలో యూఎస్ ను ప్రభావితం చేసింది. ఉద్యోగాల విషయంలో భారత్, చైనా, సింగపూర్లను కూడా టార్గెట్ చేసినా... ట్రంప్ లో ఒక్కటి మాత్రం ఎప్పుడూ మారలేదు. ఇక్కడ మోదీ ఇండియా ఫస్ట్ అన్నట్టే ... ఆయన అమెరికా ఫస్ట్ అన్నాడు! హిల్లరీ లాగా మైనార్టీలు, ఇమ్మిగ్రెంట్స్ అంటూ సమాజాన్ని విడివిడిగా చూడలేదు. మొత్తం అమెరికా అంతా ఒక దేశం. దాని బాగే తన లక్ష్యం అన్నాడు!
ఎన్నికల ప్రచారం నడుస్తున్నంత కాలం హిల్లరీ పై ఈమెయిల్స్ కేసు ఆరోపణలు కొనసాగాయి. అది చివరి నిమిషం వరకూ ఆమెను వెంటాడింది. కాని, అంతకంటే ఎక్కువగా ట్రంప్ పై దాడులు జరిగాయి. అతనెప్పుడో చేయి పట్టుకున్నాడనీ, కన్ను కొట్టాడని రోజుకొకరు వచ్చి ఆరోపణలు చేశారు. ఇవన్నీ అతడి పట్ల జనం ఆలోచించే తీరులో మార్పు తెచ్చాయి తప్ప దురభిప్రాయం తీసుకురాలేకపోయాయి. అందుకే, ఒబామా, మిషెల్, హిల్లరీ, బిల్ క్లింటన్, మీడియా, మేధావులు ఇలా ఎందరు ఏకమైనా ట్రంప్ ఒక్కడిని గెలవలేకపోయారు.
మన పత్రికలు, ఛానల్సు తో సహా ప్రపంచ మీడియా ఇప్పటికైనా గుర్తించాల్సింది ఏంటంటే... అది భావిస్తున్నట్టు జనం ఆలోచించటం లేదు. టెర్రరిజమ్ హాజ్ నో రిలీజియన్ అంటే నమ్మటం లేదు. శాంతి ప్రవచనాలు, నైతిక సూత్రాలు చెబుతూ కూర్చుంటే విసిగిపోతున్నారు. దేశం గురించి నిజాయితీగా మాట్లాడనైనా మాట్లాడితే చాలు వాళ్లకు ఓట్లు వేస్తున్నారు. ఇక అలా గెలిచిన మోదీలు, ట్రంప్ లు నిజంగా జానానికి మంచి చేస్తే... అంతకంటే కావాల్సింది, కోరుకునేది ఏమంటుంది?