వివాదాలకి ప్రణనామం... సంయమనానికి ఎగనామం!
posted on Nov 5, 2016 @ 4:33PM
మన దేశంలోని హిందూ దేవాలయాలకు రెండే రెండు సమస్యలు! కొన్నిటికి డబ్బు లేకపోవటం! మరి కొన్నిటికి డబ్బులు విపరీతంగా వుండటం! ఈ రెండో కోవకు చెందినదే తిరుమల వెంకన్న ఆలయం! ఇక్కడ డబ్బులకి ఏ కొదవా వుండదు. బోలెడన్ని నిధులు. అయినా నిత్యం ఏదో ఒకరకంగా రచ్చకెక్కుతుంటారు తిరుమల అధికారులు, పూజారులు, జీయర్లు, ఉద్యోగులు... అందరూ. దానికి తోడు అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నట్లు కాచుకుని కూర్చుంటాయి మీడియా భానల్స్. వాటి ఆశయం తిరుమల బాగు కాదు... ఆశ కేవలం టీఆర్పీలే. తిరుమల అన్న పేరు చెప్పి ఏ న్యూస్ ఇచ్చినా జనం చూస్తారు కాబట్టి అవ్వి ఎగబడుతుంటాయి. వివాదం దొరికితే అవసరానికి మించి రాజేస్తుంటాయి... తాజా నామాల గొడవ అలాంటిదే!
తిరుమలలో జరిగే ప్రతీ గొడవకి మీడియా కారణం కాదు. అయితే, అక్కడ ఏ చిన్న అవకతవక చోటు చేసుకున్నా టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ లు బద్ధలైపోతుంటాయి. వాటి వల్ల వేంకటేశ్వరుడి క్షేత్రానికి జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ. జనం కొండపైన ఏదో జరిగిపోతోందని విభ్రాంతికి గురైపోతారు. కాని, అక్కడ రకరకాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు నిత్య సత్యం. ఎవరి గోల వారిదే...
ఈ శుక్రవారం నాడు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఎప్పటిలాగే శ్రీవారికి నామం దిద్దారు. కాని, అది వుండాల్సిన విధంగా కాక యూ ఆకారంలోకి మారిందని జీయర్లు ఆగ్రహించారు. కాని, వెంకన్న స్వామి నామం ఎలా వుండాలి? నాలుగు మూలలతో ఒక బాక్స్ ఆకారంలో వుండాలి. ఇది ఇప్పుడు కాదు బ్రిటీషర్ల టైంలో నిర్ణయింపబడ్డ విషయం. అప్పట్లో కూడా తిరుమలలోని రెండు వైష్ణవ వర్గాలు గొడవపడితే తెల్లవారు కలగజేసుకుని సంధి చేశారట. తెంగలై వర్గంగా పిలవబడే వైష్ణవులు వై ఆకారంలో నామాలు వుండాలంటే ... వడగలై వర్గం వారు యూ ఆకారం అన్నారు. ఇద్దరిదీ కాదు యూకి , వైకి మధ్యస్థంగా వుండే ఆకారం స్వీకరిద్దాం అన్నారు మధ్య వర్తులు. అదుగో అప్పట్నుంచీ శ్రీనివాసుని ప్రత్యేక నామం అమల్లోకి వచ్చింది. నిజానికి తిరుమలేశుని ముఖాన వున్న లాంటి నామం వైష్ణవులు ఎవరూ తమ ముఖాలపై పెట్టుకోరు. పెట్టుకోవటం కుదరదు కూడా...
తెంగలై, వడగలైల మధ్య గొడవలన్నీ కేవలం నామాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. వాళ్ల మధ్య నుదుటన పెట్టుకునే తిరునామాల విషయంలోనే కాదు ఇంకా అన్ని విషయాల్లోనూ అభిప్రాయ భేదాలే వున్నాయి. అంతకు మించి ఆధిపత్య పోరు కూడా వుంది. ఒక వైపు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వడగలై వైష్ణవుడైతే, జీయర్లు తెంగలై వైష్ణవులు. ఇలా రెండు బలమైన కేంద్రాలుగా ఇరు వర్గాలు మోహరించటంతో ఏదో ఒక గొడవకి దారి తీస్తుంటుంది. కొన్నేళ్ల కిందట కూడా రమణ దీక్షితులు మీద నామాల ఆకారం మార్చారని ఆరోపణలు వచ్చి నానా యాగీ జరిగింది. మొన్నటికి మొన్న ఆయనే తన మనవడ్ని గర్భాలయంలోకి తీసుకెళ్లాడని దుమారం రేగింది. ఇలా పదే పదే ఒక్క అర్చకుడి మీదే దృష్టి పడుతోందంటే అతను నిజంగానే ఏదైనా తప్పు చేస్తూ వుండాలి. లేదంటే అతనంటే పడని వారు ఏకమై మీడియాకి ఎక్కుతూ వుండాలి.
తిరుమల లాంటి పెద్ద వ్యవస్థలో సమస్యలు, సతమతమవటాలు వుంటూనే వుంటాయి. అయితే, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకోకుండా ఛానల్స్ కు లీక్ లు ఇవ్వటం , రో్డ్డున పడటం ఎంత మాత్రం మెచ్చుకోదగ్గది కాదు. ఆ మాటకొస్తే ఆర్మీ లాంటి వ్యవస్థల్లో కూడా లోపల ఎన్నో లుకలుకలు వుంటాయి. అన్నిటికి జనం మధ్యలో వచ్చి పంచాయితీ పెట్టుకోవటం లేదు కదా? తిరుమలను కూడా టీటీడీ అలా గంభీరంగా, నిజాయితీగా నడిపిస్తే ఎంతో బావుంటుంది. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వుంటాయి...