జగన్ ది జైలు బాట.. చంద్రబాబుది అభివృద్ధి జాడ!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జగన్ పాలనను జనం ఎంత తీవ్రంగా తిరస్కరించారో తేటతెల్లం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సుపరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమో కూడా జనం గ్రహించారని ఫలితాలు తెలియజేశాయి. అయితే తన పట్ల, తన పాలన పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగానే తాను పరాజయం పాలయ్యాననీ, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగించిన సుపరిపాలనను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తమైనందునే ఈ స్థాయిలో తన పార్టీని ఓడించారని జగన్ గ్రహించడం లేదు. కాదు కాదు అంగీకరించడం లేదు.
విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలనను, మలి ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూసుకుని మరీ, రాష్ట్రం బాగుండాలంటే, జగన్ విధ్వంసం నుంచి కోలుకుని ప్రగతి బాట పట్టాలంటే చంద్రబాబు పాలన ఒక్కటే మార్గమన్న కృత నిశ్చయంతో , చంద్రబాబును ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో, అలాగే జగన్ ను గద్దె దింపాలన్న కసితో పోలింగ్ బూత్ లకు వెల్లువెత్తారనీ తేటతెల్లమైనా దానికి అంగీకరించి, తప్పులు ఒప్పుకుని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశం జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా తానేదో తన జేబులో డబ్బులు ఇచ్చినట్లు సంక్షేమం అంటే వేలకు వేల రూపాయలు బటన్ నొక్కి పందేరం చేసినా జనం ఎందుకు ఓట్లు వేయలేదని నెపం వారిపైనే నెట్టేస్తున్నారు. అలాగే గతంలో తాను గట్టిగా సమర్ధించిన ఈవీఎంలే తన ఓటమికి కారణమని చెప్పుకుంటున్నారు.
జగన్ ఓటమికి కారణాలేమిటి అన్న దానిపై పరిశోధనలు, విశ్లేషణలు అవసరం లేదు. చాలా సింపుల్.. రాష్ట్ర విభజన తరువాత గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు ప్రజలు చెరో అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ పార్టీల పాలనను ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు పనితీరును, అలాగే జగన్ పనితీరును గమనించారు. దీంతో అధికారం ఎవరికి ఇవ్వాలి.. మరోసారి సీఎంగా ఎవరు కావాలి అనేది జనం నిర్ణయించుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతాలు, సామాజిక వర్గాలు, యువత, వయోవృద్ధులు అన్న తేడా లేకుండా జనం దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన తరువాత ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం, తాము బాగుంటాము అన్న విషయంలో వారిలో కన్ఫ్యూజన్ అన్నది ఇసుమంతైనా కనిపించలేదు. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా అన్ని అంశాలలో జగన్ పాలనను, చంద్రబాబు పాలనతో పోల్చి చూసి జగన్ ను తిరస్కరించారు.
గత ఐదేళ్లలో అరకొర సంక్షేమం తప్ప అభివృద్ధి అన్న మాటకు అర్ధమే లేకుండా, అసలా పదమే వినపడకుండా పాలన సాగించిన జగన్ ను జనం ఛీకొట్టారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమ మాట అటుంచి... ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితిని గమనించిన జనం.. రాష్ట్రం బాగుండాలంటే.. తమ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావలసిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కూటమికి అంత అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు జనాభిప్రాయానికి పట్టం కట్టాయి.
సరే ఆ విషయాన్ని గ్రహించడానికి జగన్ సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. కానీ తన ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడుపెట్టుకుని వైసీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి సాగించిన అవినీతిపై, అధికార మదంతో పాల్పడిన అక్రమదందాలు, అడ్డగోలు దాడులు, దౌర్జన్యాలపై ఇప్పుడు తెలుగుదేశం కూటమి చర్యలకు ఉపక్రమించింది. అది సహజం కూడా. అవినీతికి పాల్పడిన, నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఉండాలి కూడా. అలా తెలుగుదేశం కూటమి సర్కార్ చర్యలకు పాల్పడుతుంటే జగన్ మాత్రం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసి అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి, ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడన్నంత బిల్డప్ ఇచ్చారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు. అది ఆయన ప్రాధాన్యత.
మరో వైపు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. పోలవరం, అమరావతిలలో పర్యటించిన చంద్రబాబు జగన్ అసమర్థ పాలన, అహంకార వైఖరి కారణంగా ఆ రెండింటి విషయంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా.. ఆ రెండింటి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎండిపోతున్న కృష్ణా డెల్టాకు పట్టిసీమద్వారా నీటిని అందించి ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. బీపీసీఎల్ సంస్థ ఏపీలో 60 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కేంద్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానున్నది. జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది. సరికదా రాష్ట్రంలో ఉన్న జాకీ, అమర్ రాజా, లూలూ వంటి సంస్థలను తరిమేసింది.
అదే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్న నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బాటలు పరిచారు. దీంతో జనం జగన్ జైలు ములాఖత్ లలో బిజీబిటీగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యత అది. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ, పారిశ్రామిక వేత్తలతో భేటీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈయన దార్శనికత ఇదీ అని నెటిజనులు పోల్చి చూపుతూ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.