తెదేపా తెరాసాలు మళ్ళీ దగ్గరవుతున్నాయా?
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు పడుతున్న తెరాస నేతలు, పొరపాటున కూడా తమ ప్రసంగంలో తెలుగుదేశం పేరు ఎత్తట్లేదిప్పుడు. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకొనే ఆ రెండు పార్టీల నేతలు గత కొద్ది రోజులుగా, కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారే తప్ప, గత నెలరోజులుగా ఒకరినొకరు ఇదివరకులా తీవ్రవిమర్శలు చేసుకోవట్లేదు. అంటే, వారి మద్య మళ్ళీ స్నేహ పరిమళాలు విరజిమ్మే విరజిమ్మే సమయం వచ్చినట్లు భావించవచ్చును.
చంద్రబాబు పాదయాత్రలోకూడా తెరాస ప్రసక్తే లేదిప్పుడు. ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న ఈ తరుణంలో తెరాస ప్రసక్తి తెచ్చి, సమైక్యవాదులకు తమ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరిని గుర్తుచేసి కోరుండి కొరివితో తల గోక్కోవడం ఎందుకని ఆయన మౌనం వహిస్తున్నారని అనుకొన్నా, ఈ రోజు (శుక్రవారం) తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సహకార ఎన్నికలలో తెరాస పార్టీకి తమ పార్టీ బేషరతుగా పూర్తీ మద్దతు ఇస్తుందని చేసిన ప్రకటన (చంద్రబాబు వెంటనే ఖండించినప్పటికీ) ఆ రెండు పార్టీలు మళ్ళీ ఎన్నికల పొత్తులకి ఆలోచిస్తున్నాయని తెలియజేస్తోంది.
తెలంగాణా ఇచ్చేమాటయితే తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు అయిష్టంగానే సిద్దపడుతున్నఆ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా ఇప్పుడు ఆపగలిగితే, అటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపడకుండా నిరోదించడమే గాకుండా, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఒంటరిచేసి, అటు తెలుగుదేశం, ఇటు తెరాస కూడా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు కాపాడుకొనే అవకాశం ఉంది. తద్వారా తెరాస తన ఉనికిని తానూ కాపాడుకోవడమే గాకుండా, కాంగ్రెస్ పార్టీతో కలవకుండానే తెలంగాణా సాదించుకొనే అవకాశం ఉంటుంది కూడా. ఇక, తెరాస, తెదేపా చేతులు కలిపితే, తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.
కానీ, తెలంగాణాలో ఎవరి సాయం లేకుండా స్వంతంగా గెలవగల సత్తా ఉన్న తెరాస పార్టీ, తెలుగు దేశం పార్టీతో ఎందుకు పొత్తులు పెట్టుకోవాలి? పెట్టుకొని ఆ పార్టీకి తెలంగాణాలో అనవసరంగా వాటా ఎందుకు పంచాలి? అని ఆలోచిస్తే, జాతీయ స్థాయి రాజకీయాల గురించి చెప్పుకోవలసి వస్తుందిప్పుడు.
కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీని విలీనంచేసి తమ ఉనికి కోల్పోవడం కంటే, వందరోజుల్లో తెలంగాణా ఇస్తామని నిర్ద్వందంగా చెపుతున్న భారతీయ జనతాపార్టీ ని నమ్ముకోవడమే మంచిదని తెరాసా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే, తప్పనిసరిగా దానికి ప్రత్యమ్నాయంగా ఉన్న భారతీయ జనతాపార్టీతో తెదేపా మళ్ళీ చేతులు కలపక తప్పదు. అంటే, ఎన్డీయేలో తెదేపా, తెరాస ఇద్దరూ భాగస్వాములు కాక తప్పదు. అప్పుడు, తెలంగాణా ఏర్పాటులో తెరాసకు చంద్రబాబు అవసరం ఉండవచ్చును.
అందువల్ల, వచ్చే ఎన్నికలలో, విజయవంతమయిన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపితే, లాభమే తప్ప నష్టం లేదు గనుక ఇప్పటి నుండే తెదేపా, తెరాస పార్టీలు రెండు పార్టీలు కూడా క్రమంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తునాయనుకోవచ్చును.
అప్పుడు, ఇక తెలుగుదేశంపార్టీ సీమంద్రా ప్రాంతంలో ‘రెండు కాంగ్రెస్ పార్టీలని’ లేదా ‘రెండూ కలిసిపోయిన కాంగ్రెస్’ పార్టీని ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశం గురించి మాత్రమే ఆలోచించుకోవలసి ఉంటుంది. ఇటు తెరాస, తెదేపాలు చేతులు కలిపితే, అటు 'రెండు కాంగ్రెస్ పార్టీలు' చేతులు కలిపే అవకాశం కూడా ఉంది.
అయితే, ఈ లెక్కలు ఏ నిమిషంలోనయినా, ఏ కారణం చేతనయినా మారవచ్చును. ఎన్నికల ప్రకటన వచ్చిన తరువాత మాత్రమే అన్ని పార్టీల అంతరంగాలు బయటపడతాయి. అంతవరకు ప్రజలను మభ్య పెట్టేందుకు ఒకరినొకరు తిట్టుకొంటూ వారికి కాలక్షేపం కలిగిస్తుంటారు.