బందులతో విద్యార్దుల చదువులు నాశనం చేయొద్దు

 

ఉద్యమాలపేరిట తరచూ బందులకు పిలుపునిస్తూ, విద్యార్దుల జీవితాలతో ఆడుకొంటున్న రాజకీయ నాయకులను నిలదీసే దైర్యంలేక, పిల్లల చదువులు పాడవుతున్నా చేసేదేమీలేక నిస్సహాయంగా జరిగే పరిణామాలను చూస్తూ ఉండిపోయారు తల్లితండ్రులు, స్కూలు యాజమాన్యాలు. మళ్ళీ ఇటీవల మొదలయిన తెలంగాణా ఉద్యామాలతో బందులు కూడా సర్వసాధారణం అయిపోవడంతో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో స్కూలు యాజమాన్యాలు బందులకు వ్యతిరేఖంగా నోరు విప్పక తప్పలేదు.

 

ఈరోజు జంట నగరాల ప్రైవేటు స్కూలు యాజమాన్యాల అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ “తెలంగాణా ఉద్యమాలకు మా మద్దత్తు ప్రకటిస్తున్నాము. కానీ, ఈ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు బందులు ప్రకటించడం మాత్రం సబబు కాదు. దీనివల్ల ఉద్యమంతో సంబంధము లేని విద్యార్దుల చదువులు పాడవుతున్నాయి. మరొక్క నెలరోజుల్లో 10వ క్లాసు పరీక్షలుండగా ఈ విధంగా ప్రతీరోజు బందులు ప్రకటిస్తుంటే, సిలబస్ పూర్తికాక, పిల్లలు పరీక్షలకు సిద్ధం కాలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల వారు విలువయిన విద్యా సంవత్సరం కోల్పోవడమే గాకుండా, చదువుల్లోను వెనకబడిపోతున్నారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఉద్యమనేతలు స్కూళ్ళను బందుల నుండి మినహాయించాలి. ఒకవేళ వారు బందు చేయదలిస్తే, కనీసం రెండుమూడు రోజుల ముందు ఆ సంగతిని ప్రకటించగలిగితే మంచిది. ఏదో ఒకటి రెండు రోజుల బందు అంటే మేము సైతం స్కూళ్ళను మూసి మద్దత్తు ప్రకటించగలము గానీ ఈవిధంగా ఎప్పుడుపడితే అప్పుడు బందులు చేస్తే మాత్రం సహకరించలేము."

 

"ఇదివరకు, హై-కోర్టు కూడా మాకు అనుగుణంగానే తీర్పు చెప్పింది. అయినా కూడా తెలంగాణా ఉద్యమానికి సహకరించాలనే ఆలోచనతో ఇంతకాలం ఉద్యమనేతలు బంధులకు పిలుపునిచ్చినప్పుడల్లా, విద్యార్దులకు నష్టం జరుగుతోందని తేలినా కూడా కళాశాలలు మూసేస్తూన్నాము. అయితే, ఇప్పటికయినా ఉద్యమనేతలు కళాశాలలును బందులనుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము తప్పనిసరిగా పోలీసు రక్షణ తీసుకోనయిన సరే మా విద్య సంస్థలను నడిపించుకోవాలని నిశ్చయించుకొన్నాము,” అని తెలియజేసారు."

 

విద్యార్దుల తల్లి తండ్రులు కూడా పాల్గొన్న ఈ మీడియా సమావేశంలో "తరచూ జరుగుతున్న బందులవల్ల పిల్లల చదువులు పాడయి, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతే, తమవంటి మద్య తరగతికి చెందినవారికి ఆర్దికంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని" వారు ఆందోళన వ్యక్తం చేసారు.

 

రెక్కాడితే గానీ డొక్కాడని నగర జీవులందరూ ఇదే వేదన అనుభవిస్తున్నపటికీ ఉద్యమనేతలకి భయపడి మౌనంగా బాధలు భరిస్తున్నారు. ఇప్పటికయినా ఉద్యమ నేతలు విద్యార్దులను తమ ఉద్యామలకు దూరంగా ఉంచగలిగితే మేలు.