తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం

 

ఎలాగూ త్వరలో తన పీసీసి అధ్యక్షపదవిని కాంగ్రెస్ అధిష్టానం కన్నాలక్ష్మినారాయణకు కట్టబెట్టబోతోందనే సూచనలు అందడంవల్లనేమో, బొత్స సత్యనారాయణ ఈ రోజు సాయంత్రం రాజమండ్రీలో ఉండవెల్లి నిర్వహిస్తున్న జై ఆంధ్రా మహాసభకు బయలుదేరి ఇంతకాలం మనసు పొరల్లో గుట్టుగా దాచుకొన్న సమైక్యాంధ్రా భావనలు బయటపెట్టుకొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మొత్తానికి బాధ్యత వహించవలసిన ఆయన సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు హాజరవడం సహజంగానే తెలంగాణా వాదులకు కోపం తెప్పించింది.

 

అదే విషయం ప్రస్తావిస్తూ వారు ఆయనని సంజాయిషీ కోరినప్పుడు ఉండవల్లితో తనకున్న స్నేహ సంబందాల దృష్ట్యా నేను వ్యక్తిగతంగా హాజరవుతున్ననే తప్ప పార్టీ తరపున పీసీసీ అధ్యక్షుడిగా హాజరవడంలేదని చెప్పడం తెలంగాణా వాదులకు పుండు మీద కారం చెల్లినట్లయింది. ఒక వైపు సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు హాజరవడమే గాకుండా, ‘నేను మీరు ఊహిస్తున్న ఆ నేను కాదు’ అన్నట్లు తానూ వేరు, పార్టీ అధ్యక్షుడు వేరు అన్నట్లు సినిమా డైలాగు చెప్పడం పార్టీ సీనియర్ నేతలయిన వీ.హనుమంతరావు వంటి వారికి సైతం ఆవేశం తెప్పించింది. తెలంగాణావాదులు నిర్వహించిన సభలకి హాజరు కావడానికి ఇష్టపడని ఆయన ఇప్పుడు సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభకు మాత్రం హాజరవడంలో ఆయన అంతర్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు రాష్ట్రవిభజనపై తీవ్రమయిన కసరత్తు చేస్తున్న ఈ తరుణంలో పీసీసీ అధ్యక్షుడిగాఉన్న బొత్స సత్యనారాయణ, ఉండవల్లి సభకు హాజరయి ప్రజలకు ఏసందేశం పంపినట్లు భావించాలి అని ఆయన ప్రశ్నించారు.

 

తొలుత రాష్ట్రం విడిపోతే నష్టం ఏమిటని ప్రశ్నిస్తూ తెలంగాణావాదుల నుండి ఇబ్బందులు లేకుండా నావ నడిపించుకోచ్చిన ఆయన, ఇప్పుడు తన పీసీసి అధ్యక్షపదవికి రోజులు దగ్గరపడగానే ఈవిధంగా రంగులు మార్చడం సబబు కాదు. అయన సమైక్యవాదుల సభకి హాజరయి, జై ఆంధ్రా ఉద్యమం గురించి తెలుసుకోవాడానికే వెళ్తునానని చెప్పడం ఎలా ఉందంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడకి గడ్డి కోసం అన్నట్లుంది.

 

సమైక్యవాదులు నిర్వహిస్తున్న సభలో పాల్గొంటూ అధిష్టానం ఏనిర్ణయం తీసుకొంటే దానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించడం కేవలం వారినే కాకుండా తెలంగాణా వాదులను సైతం అపహాస్యం చేయడమే అవుతుంది. అంతకంటే ఆయన తన మనసులో మాట స్పష్టంగా బయటకి చెప్పేస్తే కనీసం సమైక్యాంద్రావారి విశ్వాసం అయినా పొందే అవకాశం ఉంటుంది. లేదంటే రెంటికీ చెడ్డ రేవడి అవుతుంది ఆయన పరిస్థితి.