బొత్స ప్రకటన మతలబు ఏమిటి?
posted on Feb 4, 2013 @ 12:56PM
ఉప్పు పప్పులా కలిసిపోయున్న కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్య ఉన్న అనుబంధాన్ని నిర్వచించడం కొంచెం కష్టమే. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో ఉంచిన కారణంగా ఆ రెండు పార్టీలు రెండూ బద్ధ విరోధులని సూత్రీకరిద్దామనుకొంటే, జగన్ సానుభూతిపరుల సహాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తున్నవిషయం, రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసిన విషయాలు అందుకు అడ్డంకిగా నిలుస్తాయి. పోనీ మిత్రులుగా పరిగణిద్దామంటే, జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, ఇటీవల 9మంది శాసన సభ్యుల బహిష్కరణవంటి అంశాలు వారు మిత్రులుకారని ఋజువు చేస్తాయి. ఇంతకీ వారు, మిత్రులా లేక శత్రువులా అనేది (రానున్నఎన్నికల) కాలమే నిర్ణయిస్తుంది.
గానీ, వారిరువురు ఒకరినినొకరు ద్వేషించుకొంటూ, లోలోన ప్రేమించుకొంటూ తప్పని పరిస్థితుల్లో ఒకే పడవలో పులీ మేకలా ముందుకు (ఎన్నికల తీరం వైపు)పయనిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ దీపం కొడిగట్టకుండా ఉండాలంటే, జగన్ మోహన్ రెడ్డి విధేయుల మద్దతనే తైలం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరి. అందువల్ల, వారిని వదులుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. పక్కలో పామముందని తెలిసినా దానిని ఏమిచేయలేని అసహాయత కాంగ్రెస్ పార్టీది. గానీ, మొన్న పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒకేసారి 9మంది జగన్ అనుచరులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నానని సంచలన ప్రకటన చేయడంతో, కాంగ్రెస్ ఏదో ఆలోచనతోనే ఆ పని చేసిందని అనిపిస్తోంది. గానీ, ప్రకటన చేసిన మూడు నాలుగు రోజులయినా కూడా దానిని అమలు చేయాడానికి మీనమేషాలు లెక్కించడం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశ్యం వారిని బయటకి సాగనంపడం కాక మరేదో ఉందని అర్ధమవుతుంది.
ఇంతవరకు, జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విదుదల చేయకపోయినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కానీ, అటు వైపు నుండి ఇంతవరకు సానుకూల ప్రతిస్పందన కనబడలేదు. పైగా, మున్ముందు కాంగ్రెస్ పార్టీయే తమపై ఆధారపడకతప్పదన్నట్లు సాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు, కాంగ్రెస్ పార్టీకి అసహనం కల్గించడం సహజమే. ఒకవేళ ఇప్పటికీ తమతో పొత్తులకు ఇష్టపడని పక్షంలో ఇక ఆ పార్టీతో పూర్తిగా తెగ తెంపులు చేసుకొనడానికి కూడా వెనకాడమనే హెచ్చరికగా బొత్స సత్యనారాయణ ఇటువంటి ప్రకటన చేసి ఉండవచ్చును.
కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపకపోతే జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల కావడం కూడా కష్టమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ మోహన్ రెడ్డి విడుదల కోరుకొంటే, ఎన్నికల పొత్తుల గురించి సానుకూల ప్రకటన చేసితీరాలి. అప్పుడు, ఈ బహిష్కరణ తంతు కూడా ఎప్పటిలాగానే స్పీకర్ వద్ద నిలిచిపోతుంది. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు, జగన్ విడుదల అవసరం లేదనుకొంటే బొత్స సత్యనారాయణ ప్రకటనను, త్వరలో స్పీకర్ నిజం చేసి చూపిస్తారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఈ ‘గ్రేస్ పీరియడ్’ ను సద్వినియోగం చేసుకొంటుందా లేదో చూడాలి.
కానీ వారి వాలకం చూస్తే, ఈరోజు కాకపొతే రేపయిన కోర్టులు జగన్ మోహన్ రెడ్డిని జైలు నుండి బెయిలు పై విడుదల చేస్తాయి గనుక, ఇటువంటి తరుణంలో తమకి కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన అవసరంలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేత సబ్బం హరి ఇటీవలే స్పష్టం చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ జగన్ అనుచరులను బహిష్కరించుకొంటుందో, లేక మళ్ళీ నిసిగ్గుగా వారి అండతోనే మిగిలిన ఏడాది కాలక్షేపం చేసేస్తుందో చూడాలి.