కేవీపీ చక్రం ఎందుకు తిప్పారు?
posted on Jan 24, 2013 @ 1:59PM
గులాం నబి ఆజాద్ “నెల అంటే సరిగా ముప్పై రోజులు కాదంటూ” నిన్న డిల్లీలో చేసిన ప్రకటనతో తెలంగాణా ఒక్కసారిగా భగ్గుమంది. తెలంగాణావాదులు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన విరుచుకుపడుతూనే మరో వైపు సీమంద్రా నాయకుల నిర్వాకాన్నివారు నిరసిస్తున్నారు. తెలంగాణావాదులందరూ కూడా దీనికి ఒకే ఒక్క వ్యక్తి కేవీపీ రామచంద్ర రావు కారకుడని ఆయన మీద తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ కూడా తెలంగాణాకి అనుకూలంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, ఇక నేడో రేపో తెలంగాణా ఇచ్చేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నఈ తరుణంలో ఆకాశం నుంచి ఉడిపడినట్లు ఊడిపడిన కేవీపీ, సీమంద్రా నేతలను వెంట బెట్టుకొని డిల్లీ వెళ్లి, అక్కడ తనకున్న పూర్వ పరిచయాలను ఉపయోగించుకొంటూ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడగానే మొత్తం పరిస్థితి ఒక్కసారిగా తారుమారవడం తెలంగాణావాదులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు ఇంతవరకు తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలలో కలుగజేసుకోని కేవీపీకి ఆకస్మాతుగ్గా సమైక్యాంద్రా పట్ల ఇంత ఆసక్తి ఎందుకు కలిగింది? అని ప్రస్నించుకొన్న తెలంగాణావాదులకి అతని వెనుకున్నజగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనబడ్డాయి. తెలంగాణా ఉద్యమంలో మొదటినుంచి చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ యం.పీ. మధుయాష్కీ, చాప క్రింద నీరులా చేరిన కేవీపీ కాంగ్రెస్ అధిష్టానం మనసు మార్చేడని నిప్పులు గక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నపటికీ అయన జగన్ మోహన్ రెడ్డికే అనుకూలంగా పనిచేస్తున్నాడని, ఆ కారణంగానే అతని ఆదేశాలు పాటిస్తూ కేవీపీ ఈ రాయభార కార్యక్రమం జరిపి కాంగ్రెస్ పెద్దల మనసు మార్చగలిగేడని మధుయాష్కీ ఆరోపించారు.
మొన్నటి వరకూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు సాదించలరూ? అని సీమాంధ్రా నేతలను ఎదురు ప్రశ్నించిన కాంగ్రెస్ పెద్దలు, జగన్ మోహన్ రెడ్డి రాయభారిగా వచ్చిన కేవీపీ భరోసాతో ఒక్కసారిగా తెలంగాణా పై మాట మార్చడం తెలంగణావాదులను ఆశ్చర్యపరిచినా, నిజానికి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూనే ఉండటం వారు గమనించలేదని తెలుస్తోంది. రానున్న ఎనికలలో ఆ రెండు పార్టీలు జతకట్టి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం సంపాదించుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ చదరంగంలో కేవీపీ, జగన్, కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురూ కలిసి ఆడిన చదరంగంలో అమాయుకులయిన కాంగ్రెస్ తెలంగాణా వాదులు ఓడిపోయారని చెప్పక తప్పదు.
ఇక ఈ ఆటని మరింత వెనక్కి వెళ్లి మనం చూడగలిగితే, గతంలో తన తండ్రి స్వర్గీయ వైయస్స్ రాజశేకర్ రెడ్డి కూడా తెలంగాణాను వ్యతిరేఖించేవారు గనుక, ఇప్పుడు అయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి కూడా తన తండ్రి అడుగు జాడల్లోనే నడవాలనే ప్రయత్నంలోనే ఇప్పుడు తెలంగాణాను అడ్డుకొని ఉండవచ్చును. కేవీపీ కూడా ఆ గూటి చిలకే గనుక, జగన్ ప్రోద్బలంతో ఈ విదంగా తెలంగాణాకు అడ్డుపడి ఉండవచ్చును. క్రిందటి నెల జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడకుండా మౌనం వహించడం కూడా జగన్ తెలంగాణాను వ్యతిరేఖిస్తునట్లు అర్ధమవుతుంది.
అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణా నేతల నుండి కూడా ఇంతవరకు సరయిన స్పందన రాకపోయినా ఎందుకు పట్టించుకోలేదని ఆలోచిస్తే, వారు తెలుగుదేశం పార్టీ నిజంగానే ఈ సారి తెలంగాణకు అడ్డుపడలేదని నమ్మడమే ఒక కారణం.
కాంగ్రెస్ తెలంగాణా వాయిదా ప్రకటన చేసిన తరువాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా వాదులెవరూ నోరేత్తకపోవడం, ముఖ్యంగా అచ్చ తెలంగాణావాది అయిన కొండా సురేఖ కూడా ఏమి మాట్లాడకపోవడంతో తెరాస నేతలు అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డినే అనుమానిస్తున్నారు.
అయితే, తెలంగాణా ఏర్పడటంవల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చే లాభం గానీ నష్టం గానీ ఏమీ ఉండవు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినట్లయితే, మొదటి అవకాశం తెరాసాయే పొందుతుంది. ఏర్పడకపోతే, తెలంగాణా సెంటిమెంటుతో ఆ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. కాంగ్రెస్ పరిస్థితి దీనికి బిన్నం కాదు. మరి అటువంటప్పుడు ఆ రెండు పార్టీలు వేరే ఏ ప్రయోజనం ఆశించి తెలంగాణాను అడ్డుకొంటున్నాయో వారికే తెలియాలి.