జగన్, కాంగ్రేసు-ఎవరిని ఎవరు కోల్పోయారు?
రాష్ట్రంలో నేడు రెండు ప్రధాన అంశాలు చర్చలో ఉన్నాయి. మొదటిది తెలంగాణా కాగా, రెండోది రాష్ట్ర రాజకీయాలపై జగన్ పార్టీ ప్రభావం. తెలంగాణా అంశంతో అన్నిరాజకీయ పార్టీలు బంతాట ఆడుకొంటుండగా, జగన్ విషయంలో మాత్రం చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అనేక కేసులలో సతమతమవుతు ఇప్పట్లో బెయిలు కూడా దొరకని పరిస్తితిల్లో అతను జైల్లో ఉన్నపటికీ అనేక మంది ఇతర పార్టీల సభ్యులను, తన పార్టీలోకి ఆకర్షించగలుగుతున్నాడంటే రాష్ట్ర రాజకీయాలపై అతని ప్రభావం ఎంతగా ఉందో అర్ధమవుతోంది. ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా కాదనలేని నిజం ఇది. అందుకనే, కాంగ్రెస్ అధిష్టానం సైతం మొన్న పంపిన పరిశీలకులతో జగన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని రాష్ట్ర నేతలను అడిగింది. వారు కూడా అతని ప్రభావం బాగానే ఉందని చెప్పినట్లు తెలిసింది.
మరి అంతటి ప్రభావశీలి అయిన ఒక యువ నాయకుడిని, కేవలం కొందరు సీనియర్ నాయకుల సలహాల మేరకు దూరం చేసుకొన్న కాంగ్రేసు నష్టపోయిందా? లేక, తన తొందర పాటుతో తన రాజకీయ భవిష్యత్తుని తానే గందరగోళంలో పడేసుకొన్నాడా? ఏమతేనేమి, ఇటు కాంగ్రెస్, అటు జగన్ ఇద్దరు నష్టబోవడమే గాక, ఇప్పుడు అందుకు తీరికగా విచారించ వలసివస్తోంది వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, కొందరి అనాలోచిత సలహాల వల్ల తొందరపడి ముఖ్యమంత్రి పీఠం తన సొత్తుగా భావించి కాంగ్రేసు అధిష్టానానికి ఎదురు తిరగడం అతను చేసిన పోరాపటయితే, 120 సంవత్సరాల అనుభవంఉన్న కాంగ్రేసు, అతనికి నచ్చజెప్పి దారికి తెచ్చుకొని అతనిని తన ఆయుధంగా మలుచుకోలేకపోవడం ఒక చారిత్రాత్మక తప్పిదం అనిచెప్పవచ్చు.
కాంగ్రేసు అధిష్టానంతో సయోధ్య కుదుర్చుకోవడంలో విఫలం అవడంలో కేవలం అతని పాత్రే లేదు. అతని వెంట ఉండి అతనికి ఆవిదంగా వెళ్ళమని రాజకీయ సలహాలు ఇచ్చిన వారిని సైతం ఇందుకు తప్పు పట్టక తప్పదు. అదే సమయంలో అతని విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి శల్యసారద్యం చేసి అతనిని తెలివిగా పార్టీకి దూరం చేసిన వారూ ఉన్నారు. కాంగ్రేసులో తమ అనుభవమంత వయసుకూడా లేని ఒక కుర్రకుంక కేవలం తన తండ్రి కీర్తి ప్రతిష్టలను ఆసరాగా చేసుకొని తమని మించిపోవడం సహించలేని నేతలే అతనిని పార్టీ అధిష్టానానికి విరోధిగాచేసి బయటకి వెళ్ళే పరిస్తితులు సృష్టిమ్చేరని చెప్పవచ్చు.
అయితే, అప్పటికయినా మళ్లీ పరిస్తితులు చక్కదిద్దుకొనే అవకాశం అతనికి ఉంది. గానీ, జగన్మోహన్ రెడ్డికి సరయిన రాజకీయ సలహాలిచ్చేవారు కరువయ్యారు. ఒక వేళ ఉండి ఉంటే, వెంటనే వారు రంగంలోకి దిగి పరిస్తితులు చక్క దిద్ది అతను కాంగ్రెసులోనే కొనసాగేలాగ చేసేవారు. కాని, జగన్మోహన్ రెడ్డి కి తగిన రాజకీయ సలహాదారులు కరువయ్యారు. ఉన్నకొద్ది మందిని తన అభిజ్యాతంతో తనే దూరం చేసుకొన్నాడు. ఒక వేళ, అతను కొంచెం తగ్గి పార్టీలోనే కొనసాగి ఉంటె నేడు అతని పరిస్తితి, హోదా తప్పక వేరేలా ఉండేవి. అయితే, జగన్ తన తొందరపాటు నిర్ణయంతో కాంగ్రెసును వీడి బయటకి వచ్చి తన ప్రమేయం లేకుండానే ఇంటా,బయటాకూడా శత్రువులను పోగేసుకొన్నాడు.
తన తండ్రి మరణంతో ఏర్పడిన సానుబూతిని ప్రజలు మరువకమునుపే వారి ‘ఓదార్పు’తో తానూ రాజకీయ ప్రయోజనం పొందాలనే ఆలోచనతో అతను ‘ఓదార్పు యాత్ర’ మొదలు పెట్టి, తనకి మద్దత్తు కూడగట్టుకొనే ప్రయత్నం చేసాడు. అది కాంగ్రేసుకి యెంత మాత్రం నచ్చలేదు. ఆ సంగతి అతనే స్వయంగా చెప్పడమే గాక, తదనంతర పరిణామాలలో అది స్పష్టంగా కనిపించింది కూడా. అయితే, ఆటను చేపట్టిన ఓదార్పు యాత్ర రాజకీయంగా అతనికి చాల లబ్దినిచ్చిందని ఇప్పుడు రుజువవుతోంది. తన ఓదార్పు ద్వారా పార్టీని ఎర్పరచకముందే తగిన బలం కూడా గట్టుకోవడమే గాకుండా, ప్రజలకి చేరువయ్యాడని చెప్పవచ్చు.
అయితే, అదే సమయంలో ప్రధాన పార్టీలయినా కాంగ్రెస్, తే.దే.పా.లకి అతను, అతని పార్టీ బద్ద శత్రువులుగా మారేరు. చివరికి అదే అతనిని జైలు పాలు చేసింది కూడా. తమ బలమయిన ఆయుధంగా మలుచుకోవలసిన అతనిపై కాంగ్రెస్ సిబిఐ అనే ఆయుధం ప్రయోగించింది. అది ప్రయోగించి వదిలేసినప్పటికీ, అది అతని వెంట పడి అతని మూలాలు పట్టుకొని ప్రజల ముందు అవినీతిపరుడిగా ఒక ముద్ర పడేందుకు దోహదపడింది. అంటే, అతను కాంగ్రెసులోనే ఉండి ఉంటే అతనికి ఈకష్టాలు ఉండేవి కావు, అతనిపై ఈ ముద్ర ఎన్నటికీ పడేది కాదన్నమాట. ఏమయినప్పటికీ, ఇప్పుడు అతని అక్రమ ఆస్తుల వ్యవహారాలు బయటకి పొక్కడంతో కోర్టులు కూడా అతని మీద జాలి చూపించడం మానేసాయి.
అయినప్పటికీ, అతని మానస పుత్రిక సాక్షి పత్రిక, మరియు సాక్షి టీవీ కలిసికట్టుగా అతనిని బాగానే ప్రజలోకి తీసుకు వేల్లగలిగేయని చెప్పవచ్చు. దానికితోడూ, అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కలిసి ‘జగన్ని అన్యాయంగా జైలు పాలు చేసారనే’ ప్రచారం కూడా అతనికి కొండంత సానుబూతి తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు అదికంగాఉన్న మనరాష్ట్రంలో ఆపని మరింత సులువు అయిందని చెప్పవచ్చును. అందుకే, గ్రామీణ ప్రజలు విజయమ్మ షర్మిలాల వెంట నడుస్తోన్నారు. ప్రజలలో ఈ ఆదరణని చూసే వివిధ పార్టీలలో నేతలు చంచలగూడ జైలు వైపు అడుగులేస్తున్నారిప్పుడు.
కాంగ్రేసులో నెలకొన్న ప్రస్తుత అయోమయస్తితి, పరిపాలన స్తంబించిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం, ప్రధాన ప్రతిపక్షమయిన తే.దే.ప. నేతలలో తెలంగాణా సమస్య వల్ల ఏర్పడిన అంతులేని నిర్లిప్తత, నానాటికి పెరుగుతున్న ధరలు,షాకిచ్చే కరెంటు బిల్లులతో తల్లడిల్లుతున్న ప్రజల అసహనం అన్నీ కలిసి, ప్రజలు మరోసరికొత్త నేతకోసం తలుపులు తెరిచి మరీఎదురు చూస్తున్నారని గ్రహించిన మన రాజకీయ నేతలకి సహజంగానే జైల్లో ఉన్న జగన్ జగన్మోహనాకారుడిగా కనిపించడంలో వింతేమి లేదు.
అయితే, దేశాన్నిఎక్కడికో తీసుకుపోగల యువనేత మా రాహుల్ బాబు అని పార్టీ నేతలతో పొగడబడుతున్న రాహుల్ గాంధీ కూడా చంచల్గూడా జైలు వైపే చూడడం రాష్ట్ర రాజకీయాలపై జగన్ ప్రభావం యెంత బలంగా ఉన్నదో తెలియజేస్తోంది. ఇక, అతనే స్వయంగా కాంగ్రేసులో కలుస్తాడా లేక కాంగ్రేసే అతనితో జత కడుతుందా అనేది కాలమే చెపుతుంది.