సారధి కోసం సమరం
posted on Feb 5, 2013 6:11AM
కాంగ్రెస్ పాలనపట్ల ప్రజలలో వ్యతిరేఖత పెరుగుతున్నపటికీ, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అందివస్తున్నఆ అవకాశాన్నిసద్వినియోగపరుచుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ, ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించాలి? అనే సందిగ్ధంలోపడి, అందివస్తున్న అవకాశాన్నివదిలిపెట్టి, అంతః కలహాలలోములిగి తేలుతోంది. వచ్చేఎన్నికలలోపార్టీని గెలిపించుకోవడమే ప్రధానం అని గ్రహించక, పార్టీకి ఎవరు సారద్యం వహించాలని అనే అంశంపై పార్టీ నేతలు ముఠాలుగా విడిపోయి వారిలో వారే కలహించుకొంటున్నారు. పార్టీలో ఉన్నసీనియర్లు మోడీ అనుకూల, వ్యతిరేఖ వర్గాలుగా చీలిపోయి, శత్రువుల మీద దూయవలసిన కత్తులను తమ స్వంత మనుషులమీదే దూసుకొంటూ, అందరికీ చులకనయిపోయారు.
వచ్చే ఎన్నికలలో పార్టీని ఖచ్చితంగా గెలిపించగలమని ప్రధాని రేసులో ఉన్న ఏఒక్కరూ చెప్పలేకపోతున్నా పార్టీకి నాయకత్వం వహించేందుకు మాత్రం అందరూ తహతహలాడుతున్నారు. వారి ఆరాటం చూసి అందని ద్రాక్షలకోసం అంత పోటీలెందుకు? అని కాంగ్రెస్ పార్టీ హేళన చేసింది.
గుజరాత్ లో నరేంద్ర మోడీ మూడోసారి వరుసగా గెలిచినప్పుడు దేశమంతా మోడీ జపం మొదలు పెట్టింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు భారతీయజనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలని కోరుకొన్నాయి. ఆ పార్టీకి ఊహించని విధంగా ప్రజల నుండి సానుకూల స్పందన కనిపించినప్పటికీ, కనీసం దానిని సైతం సద్వినియోగపరుచుకోలేకపోయింది.
తమ పార్టీ నాయకత్వ సమస్యను తీర్చమంటూ ఒకసారి సంఘ్ పరివార్ వద్దకి, మరో మారు శివసేన దగ్గరికీ, ఇంకోసారి విశ్వహిందూ పరిషత్ దగ్గరికీ అక్కడి నుండి వారు చూపించిన సాధుసన్యాసుల దగ్గరికీ పరుగులు తీస్తుంటే, ప్రజలు నవ్వుకొంటున్నారు. తమ నాయకుడినే తామే స్వయంగా నిర్ణయించుకోలేని ఆ పార్టీ రేపు అధికారం కట్టబెడితే, విధాన నిర్ణయాలు ఎలా తీసుకోగలదు? దేశాన్ని ఎలా పరిపాలించగలదనే అనే ప్రశ్నలు తలఎత్తుతున్నాయి.
మరో వైపు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడయిన రాహుల్ గాంధి సారధ్యంలో ఎన్నికలకి వెళ్లేందుకు సన్నధం అవుతుంటే, అతనిని డ్డీ కొనగల నాయకుడని నిరూపించుకొన్న నరేంద్ర మోడీ పేరు ప్రకటించడానికి కూడా భారతీయజనతా పార్టీకి దైర్యం చాలట్లేదు. కారణం పార్టీలో లుకలుకలు!
అద్వానీకి ప్రధాని పదవి ప్రతీసారి చేతికి అందినట్లే అంది చేజారిపోతోంది. అందువల్ల 85 సం.ల వయసులోఉన్నఆయన జీవితంలో ఇదే ఆఖరి అవకాశం. గనుక, ఆయన తాపత్రాయం ఆయనది. తన నాయకత్వంలో, రాహుల్ గాంధీ వంటి యువకుడిని ఎదుర్కొని, దేశం మొత్తం మీద పార్టీని గెలిపించగలననే నమ్మకం ఆత్మవిశ్వాసం ఆయనలో ఉంటే, మోడీయే కాదు పార్టీలో ఎవరూ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండేది కాదు. పార్టీని ఎన్నికలలో గెలిపించడం అంత తేలికయిన పని కాదని, అది తన వయసుకు మించిన పని అని ఆయనకీ తెలుసు. అయినా కూడా, పార్టీకి నాయకత్వం వహించి తన చిరకాల వంచ నెరవేర్చుకోవాలని తాపత్రాయపడుతున్నారు.
అయితే, ఎన్నికలలో అసలు పార్టీ గెలవకపోతే మరో ఐదు సం.లు ప్రతిపక్షంలో కూర్చోవడం మంచిదా? లేకపోతే, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, సగౌరవంగా పక్కకు తప్పుకొని మోడీ వంటి సమర్దుడయిన నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడం మంచిదా? అని ఆ పార్టీలో అందరూ తమని తాము ప్రశ్నించుకోవలసిన తరుణం ఇది. ప్రజల అభీష్టం మేరకు నడుచుకొంటే అధికారం చేతికి వస్తుంది.
సాధువులు, సంఘ్ పరివార్లు అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటే మరో ఐదేళ్ళు ప్రశాంతంగా ప్రతిపక్షంలో కూర్చొనే అవకాశం దక్కుతుంది. పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనే విషయంపై చర్చలు చేయడం కన్నా ముందు, అసలు పార్టీని వచ్చే ఎన్నికలలో గెలిపించుకోవాలా వద్దా అని ఆలోచించుకొంటే, నాయకత్వ సమస్య కూడా తీరిపోతుంది.