రోమ్ నగరం తగులబడుతుంటే....
posted on Jan 27, 2013 @ 12:57PM
ఒకవైపు తెలంగాణా జేయేసీ నేతలు చేపట్టిన సమరదీక్షతో జంట నగరాలు అట్టుడుకుతుండగా మరోవైపు సీమంద్రాలో సమైక్యాంద్రా ఉద్యమం కూడా మెల్లగా ఊపందుకొంటోంది. డిల్లీ నుండి ఎటువంటి ప్రకటన ఇంతవరకూ రాకపోయినా కూడా రెండు వైపులా ఉద్యమాలు మాత్రం తీవ్రతరమవడంతో రాష్ట్రంలో మళ్ళీ అరాచక పరిస్థితులు మొదలయ్యాయి. రాష్ట్రం ఇంత అల్లకల్లోలంగా మారినప్పటికీ కూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ కనీస స్పందన కరువవడం విచారకరం. బహుశః తమ మాటలని ఎవరూ లెక్క చేయరని భావించడంవల్లనే ఈ నిర్లిప్తత అని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికయినా తన నిర్లిప్త ధోరణిని విడనాడకపోతే రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంది.
తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం అవసరమని ప్రకటించిన గులాం నబీ ఆజాద్, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కోరినట్లు స్పష్టమయిన మరో ప్రకటన చేయడం ద్వారా పరిస్థితులను అదుపులోకి తేగల అవకాశం ఎందుకు జారవిడుచుకొంటున్నారో తెలియదు. రేపు అనగా జనవరి 28వ తేదీన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయలేమని తేల్చిన గులాం నబీ ఆజాద్, మరి తమ తదుపరి ప్రణాళిక ఏమిటో ప్రకటించి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల సహాయంతో పరిస్థితులను అదుపులో ఉంచే అవకాశం ఉన్నపటికీ అది పట్టించుకోకుండా, కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశాలలో మునిగితేలుతోంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి అది చేస్తున్న కసరత్తును ఎవరూ తప్పు పట్టకపోయినప్పటికీ, పూర్తిగా అదే ధ్యాసతో తలుపులేసుకొని సమావేశాలు అవడం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన యువనాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడి పరిస్థితులకి స్పందించకపోవడం విచారకరం. దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలని తన మంత్రం దండంతో సమూలంగా మాయం చేసేస్తానన్నట్లు మాట్లాడిన ఆయన, ఇటువంటి క్లిష్ట సమయంలో, క్లిష్ట సమస్యపై ఎందుకు నోరు మెదపట్లేదో ఆయనకే తెలియాలి. ఆయనకి రాష్ట్ర విబజన సమస్యపై పూర్తీ అవగాహన ఇంకా ఏర్పడలేదని పార్టీలో సీనియర్ నేతలు భావించిడంవల్లనే ఆయనను దీనికి దూరంగా ఉంచుతున్నారనుకొంటే, అటువంటప్పుడు అతి రధమహారధులని చెప్పుకొనే అనేక కాంగ్రెస్ నేతలలో ఒక్కరు కూడా ముందుకు వచ్చి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయకపోవడం చాలా విచారకరం.
కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తిసున్న సీనియర్ నేత వాయలార్ రవి, ప్రస్తుతం హైదరాబాదులో ఉండి, అక్కడి పరిస్థితులను స్వయంగా చూస్తూ కూడా తెలంగాణా అంశంతో తనకు సంబంధం లేదని, అది వేరొకరు చూసుకొంటున్నారని అనడం చాలా దారుణం. ఇక తెలంగాణా అంశం తన పరిధిలో లేదని స్పష్టంగా చెప్పి చేతులుదులుపుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టడం అనవసరం. అది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నపటికీ అది చేదు నిజం అని ఒప్పుకోక తప్పదు. అందువల్ల ఆయన తన పరిధిలో ఏమేమి ఉన్నాయో అవి చేసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజధానిలో తెలంగాణా జేయేసీ నేతలు తలపెటిన 36గంటల సమరదీక్ష వల్ల నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవడమే ఆయన చేతుల్లో ఉన్న పని. ఆ పనిని అయన సమర్ధంగానే నిర్వహిస్తున్నారని అనుకోవచ్చును. అయితే, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న ఉద్యమ కారులవల్ల పరిస్థితులు ఎప్పడు అదుపు తప్పుతాయో ఎవరికీ తెలియదు. అదే జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రానిదే బాధ్యతవుతుంది. అప్పుడు మళ్ళీ రాష్ట్రపతి పాలన అనే పాత ఆలోచన మరో సారి తెరమీదకి రావచ్చును. ఇది తెలంగాణా అంశాన్ని మరింత ఆలస్యం కావడానికే దోహదపడుతుంది అని ఉద్యమకారులు గ్రహించాల్సిన అవసరం ఉంది.