పాదయాత్రా ఫలం పార్టీకే అంకితం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా 208 రోజులయింది. 63సం.ల వయసులో ఏకధాటిగా 2,817 కి.మీ దూరం నడవడానికి కేవలం ఒంట్లో ఆరోగ్యం ఒకటే సరిపోదు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలననే ఆత్మవిశ్వాసం, పట్టుదల కూడా ఉండాలి. అవి చంద్రబాబులో పుష్కలంగా ఉండబట్టే, ఆయన ఈ రోజు తన పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయగలిగారు.
గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా, హిందూపురంలో మొదలుపెట్టిన పాదయత్రలో ఆయన 16 జిల్లాలు, 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలలోగల వివిధ కులాలు, మతాలూ, జాతులు, వృత్తులు, తరగతుల ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరియు నేతలను స్వయంగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోగలిగారు. తద్వారా అధికారంలో ఉన్నపుడు వారితో ఏర్పడిన దూరాన్ని తొలగించుకొని మళ్ళీ వారికి చేరువకాగలిగారు. అదేవిధంగా ఆయనను స్వయంగా కలుసుకొన్న ప్రజలకు ఆయనపట్ల ఒక అవగాహన ఏర్పడింది.
ఈ పాదయాత్ర ద్వారా నాలుగు ముఖ్య ప్రయోజనాలు సిద్దించాయి. 1. ప్రజలకి చేరువగా పార్టీని తీసుకువెళ్ళడం. 2.పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవడం. 3.ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితి పట్ల ఆయన స్వయంగా అవగాహన పొందడం. 4.తనపట్ల, పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఏర్పరచడం.
తన పాదయాత్రలో చంద్రబాబు మారుమూల గ్రామాలలో పార్టీకోసం పనిచేసే అనామక కార్యకర్తలు మొదలుకొని నగరాలలో, పట్టణాలలో ఉండే నేతల వరకు అందరినీ స్వయంగా కలిసి మాట్లాడి మళ్ళీ వారిలో పోరాట స్పూర్తిని నింపగలిగారు. ప్రతీ జిల్లా పర్యటనలో నియోజక వర్గాల వారిగా పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతూ ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకొంటూ, పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసుకొంటూనే, మరో వైపు అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకం అవడంవలన పార్టీ పట్ల వారిలో సానుకూల వాతావరణం సృష్టించారు.
మంచి పరిపాలన దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు తన పాదయాత్రలో వివిధ జిల్లాలో పార్టీ పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలకి తగిన ప్రణాలికలు వ్యూహాలు రచించుకోగలిగే అవకాశం కూడా ఏర్పడింది. గ్రామస్థాయి నుండి పట్టణ, నగర స్థాయి వరకు ఉండే అనేక స్థానిక సమస్యలపట్ల ఆయన స్వయంగా అవగాహన పెంచుకోవడమే కాకుండా, వాటిని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియజేసే ఒక నిర్దిష్టమయిన జిల్లా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తూ ప్రజలని ఆకట్టుకొన్నారు.
అదేవిధంగా వివిధ జిల్లాలో పార్టీ నేతల మద్యన ఉన్న విబేధాలను తొలగించే ప్రయత్నాలు చేసారు. కొన్నిసర్దుబాట్లు, మార్పులు చేర్పులతో, అలిగిన నేతలకు కొన్ని తాయిలాలు, అవసరమయిన చోట క్రమశిక్షణా చర్యలు తీసుకొంటూ, గత 9ఏళ్లుగా అధికారానికి దూరమయి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నపార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేసారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఇందుకు పూనుకోవడంతో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవిధంగా పార్టీని అంతర్గతంగా బలపరుచుకోవడం చాలా మంచి ఆలోచనే.
అయితే ఈ పాదయత్ర ప్రభావం ప్రజల మీద, పార్టీ కార్యకర్తలు, నేతల మీద రాబోయే ఎన్నికలవరకు ఉంటుందా లేదా అనే సంగతిని పక్కన పెడితే, చంద్రబాబు తన తన పాదయాత్ర ద్వారా పార్టీని పటిష్టపరుచుకొని పార్టీ ప్రభావం ప్రజల మీద ప్రసరించేలా చేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. చంద్రబాబు పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ప్రజలకు సమర్ధంగా తెలియజేయగలిగారు. రాబోయే ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాదిస్తే ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసిన ఈ పాదయాత్రకు, ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కినట్లే భావించవచ్చును. .