బాబుకి ఎన్నికలు ఎదుర్కొనే దైర్యం లేకనే...అలా! పేర్ని నాని

 

బాబుకి ఎన్నికలు ఎదుర్కొనే దైర్యం లేకనే...అలా! పేర్ని నాని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టే అనేక మంది నాయకుల్లో పేర్ని నాని కూడా ఒకరు. అయితే, మిగిలిన వారిలా కాకుండా దైర్యంగా పార్టీకి రాజీనామా చేసేసి(స్పీకర్ ఇంకా ఆమోదించలేదు గనుక, ఆయన ఇంకా కాంగ్రెస్ శాసనసభ్యుడే) వైయస్సార్ కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి ఆయన. సాక్షి న్యూస్ లో ప్రసారమయిన ఆయన ఇంటర్వ్యు వివరాలు:

 

నేను ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా ఉన్నపటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాను. సాంకేతికంగా అ పార్టీలో చేరలేదు తప్ప, ఆ పార్టీ సభ్యులమనే భావన నాకు, నా అనుచరులకు ఎప్పటినుంచో ఉంది. ఆ పార్టీ జెండా పట్టుకొని నేను నా అనుచరులు కూడా చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాము. వచ్చే నెలలో మచిలీపట్నంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వైయస్.విజయమ్మ సమక్షంలో మేమందరమూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరడం కేవలం లాంచనప్రాయమే.

 

కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం పనిచేసాను గనుక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకి మద్య ఎటువంటి తీవ్ర విబేధాలున్నాయో నాకు బాగా తెలుసు. మొన్న, బొత్స సత్యనారాయణ 9మంది శాసనసభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు చేసిన ప్రకటన, కిరణ్ కుమార్ రెడ్డిని ఇబ్బందులు పెట్టడానికే చేసారని నేను భావిస్తున్నాను.

 

ప్రతిపక్ష నేతగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించట్లేదంటే, కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ప్రభుత్వాన్ని పడగొడితే ప్రస్తుతం ఆయన పార్టీ ఎన్నికలను ఎదుర్కోలేమనే ఆలోచనతోనే వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు వెంటనే ఎన్నికలోస్తే గెలుస్తామనే నమ్మకం ఆయనలో లేనందునే, మెజార్టీ కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి ఆయన వెనకడుగు వేస్తున్నారు. అదిగాక, ఆ రెండు పార్టీలకి మద్య ‘జగన్ మోహన్ రెడ్డిని వీలయినంత కాలం జైల్లో ఉంచాలనే రహస్య అవగాహన’ కూడా అందుకు అడ్డుపడుతోందని భావిస్తున్నాను. జగన్ మోహన్ రెడ్డిని వీలయినంతకాలం జైలుకే పరిమితం చేసి, రాష్ట్రంలో ఆ రెండు పార్టీల పరిస్థితులు మెరుగుపడిన తరువాత వారు ఎన్నికలకు వెళ్లాలని కోరుకొంటున్నారని భావిస్తున్నాను.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలాగు అధికారంలోకి రాలేనని గ్రహించడంవల్లనే గ్యాస్, కరెంట్ సర్ చార్జీలు పెంచుకొంటూ పోతోంది. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరాను గాబట్టి, నా మీద పగతో నేను ప్రాతినిద్యం వహిస్తున్న కృష్ణా జిల్లా ప్రయోజనాలు దెబ్బతీయాలని కిరణ్ కుమార్ రెడ్డి, అతని ప్రభుత్వం గానీ ప్రయత్నిస్తే వచ్చే ఎనికల్లో కుక్క చావు చచ్చినట్లు, ప్రజలచేతుల్లో ఘోరంగా దెబ్బ తింటారని వారిని హెచ్చరిస్తున్నాను.