నేతాజీ మరణంపై దిగ్భ్రాంతికరమయిన కధనం

 

భారత స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుబాష్ చంద్ర బోస్ జీవితంలో చివరి అంకం గురించి అనేక కధనాలు ప్రచారంలో ఉన్నపటికీ, భారత ప్రభుత్వం మాత్రం నిజాలు కనుగొనేందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేదు. ఆయన విమాన ప్రమాదంలో మరణించాడని కొందరు భావిస్తుంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఉత్తర భారతంలో సాధువుగా తన అంత్య జీవితం గడిపారని మరికొందరు నమ్ముతున్నారు. అయితే, అసలు నిజం ఏమిటనేది మాత్రం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు.

 

అనేక సం.లుగా రష్యాలో ఉన్న రామకృష్ణ మఠంలో సేవలందిస్తున్న రధిన్ మహారాజ్, అక్కడ కలిసిన అనేక మంది ప్రసిద్ధ వ్యక్తుల నుండీ, చరిత్రకారులనుండీ నేతాజీ గురించి సేకరించిన వివరాలను కలగలిపి సుబాష్ చంద్ర బోస్ అంతిమ దినాల గురించి ఇటీవల కొన్ని దిగ్బ్రాంతి కలిగించే విషయాలను బయట పెట్టారు. ఆయన బయట పెట్టిన వివరాలన్నీ ప్రస్తుతం భారతీయులు నేతాజీ గురించి ఊహించుకొంటున్న కధనాలకి పూర్తీ భిన్నంగా ఉన్నాయి.

 

నేతాజీ అందరూ ఊహించినట్లు విమాన ప్రమాదంలో కాక, సైబీరియా జైలులో అంత్యంత దీన స్థితిలో తన చివరి రోజులు గడిపి, తీవ్ర అనారోగ్యంతో మరణించారని ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ చలి ఉండే ఆ దేశంలో, ఆయనకు కనీసం కప్పుకోవడానికి దుప్పటి గానీ, చలి నుండి కాపాడుకొందుకు కనీసం స్వెట్టర్ కూడా లేకుండా దుర్భరమయిన జీవితం గడిపి, చివరికి తీవ్ర మానసిక, శారీరిక అనారోగ్యంతో బాధపడుతూ మరణించారని అయన తెలిపారు.

 

మరో దిగ్భ్రాంతికరమయిన విషయం ఏమిటంటే, నేతాజీ అక్కడ ఆ దుస్థిలో ఉన్నట్లు భారత ప్రభుత్వానికి తెల్సి ఉండటం. అయినా కూడా అయన విడుదలకు గానీ, కనీసం ఆయనను రక్షించుకోవడానికి గానీ చిన్నపాటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదని ఆయన తెలిపారు. ఆ నాడు రష్యాలో భారత రాయభారిగా పనిచేసిన విజయలక్ష్మీ పండిట్ స్వయంగా నేతాజీని జైలులో కలిసి ఆయన దుస్థితి చూసినప్పటికీ, అయన జైలు నుండి విడుదల కాకపోవడమే అందుకు ఉదాహరణగా చెపుతున్నారు.

 

దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళిన నేతాజీ విగ్రహాలు, అయన నామస్మరణ మనం చూస్తాము. అంతటి మహనీయుడిని నాటి మన భారత ప్రభుత్వం ఎందుకు అంత నిర్దయగా వదిలేసిందో ఎవరికీ తెలియదు. బహుశః గాంధీజీతో అహింసా సిద్దాంతముతో విభేదించి, సాయుధపోరటం ద్వారానే స్వాతంత్రం పొందగలమని భావించిన ఆయనను జైలునుండి విడిపించి భారత్ కు తిరిగిరప్పిస్తే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమస్యలేమయినా సృష్టిస్తాడని భయం చేతనో మరే బలమయిన కారణం చేతనో ఆ మహనీయునికి అత్యంత దైన్యమయిన చావుకి కారకులయ్యారు.