వైఎస్ జగన్ తో చేయికలిపితే తప్పేటున్నాదీ?
posted on Jan 20, 2013 7:30AM
రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా ముంచుకు రాకముందే జగన్ పార్టీతో జత కట్టేందుకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీ, తమ అనైతిక బంధానికి ప్రజలు మనస్సులో ఇప్పటినుండే ఇంకించే ప్రయత్నంలో భాగంగా జగన్ పార్టీతో ఎన్నికల పొత్తుల గురించి మెల్లగా మాట్లాడటం ఆరంభించింది. మొన్న సీనియర్ కాంగ్రెస్ నేత వాయలార్ రవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుల విషయం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చూసుకొంటుందని మొదటి సిగ్నల్ విడుదల చేయగానే, నిన్న బొత్స సత్యనారాయణ ‘జగన్ తో చేయికలిపితే తప్పేటున్నాదీ?’ అన్నట్లు మాట్లాడారు.
వయలార్ రవి ఆవిధంగా చెప్పడంలో తప్పులేదని, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే, రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. ఒక వైపు జగన్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధం అంటూనే, మరో వైపు తమ పార్టీ సిద్ధాంతాలు, సోనియమ్మ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్నవారితోనే పొత్తులు ఉంటాయని చెప్పడం విశేషం.
ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు సిద్ధాంతాల ప్రాతిపదికన ఎన్నికలలో పొత్తులు పెట్టుకొంటాయని అయన చెప్పడం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయకపోతే తనపేరు చిరంజీవీ కాదని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారి దయతోనే మనుగడ సాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తనని నిత్యం బండ బూతులు తిడుతున్న తెరాసను తనలో కలిపేసుకోవలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ, ఇంతకాలం అవినీతిపరుడిగా చెప్పిన జగన్ తో చేతులు కలపడానికి ఒక పక్క సిద్దపడుతూనే అదే నోటితో సిద్ధాంతాలు వల్లెవేయడం ప్రజల కళ్ళకి గంతలు కట్టాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ప్రజలు అవివేకులు, వారికి ఏమి చెప్పినా గుడ్డిగా నమ్ముతారు అనుకోవడం వల్లనే రాజకీయ నేతలు ఇటువంటి మాటలు అనగలుగుతున్నారు.
ఎన్నికలు దగ్గిర పడుతున్నకోద్దీ ఈ రెండు పార్టీల మద్య ఇటువంటి సంకేతాలు మరిన్ని వెలువడి ప్రజలు తమ అనైతిక బంధం అంగీకరించే స్థాయికి చేరగానే, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలకావడం, ఆ వెంటనే రెండు పార్టీలు ఎన్నికల పొత్తుల చర్చలు మొదలుపెట్టడం తరువాత జరిగే ప్రక్రియ.