అవినీతిపై మన్మోహన్ సాకులు
posted on Apr 9, 2011 @ 10:06AM
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారేను కాంగ్రెసు నాయకులు ఎగతాళి చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన హజారేను ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చలకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని, అలా చేయకపోగా కాంగ్రెసు నేతలు హజారేను ఎగతాళి చేస్తూ మాట్లాడారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవినీతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. జన్ లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం కాలయాపన చేస్తోందని, హజారే దీక్షతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. హజారే పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసం బతుకుతున్నాడని ఆయన అన్నారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడానికి పకడ్బందీ చట్టాలు లేవని, ఇందుకు పనిచేస్తున్న సంస్థల్లో ప్రభుత్వం నియమించినవారే ఉంటున్నారని, దానివల్ల అవి సమర్థంగా పనిచేయలేకపోతున్నాయని ఆయన అన్నారు.