సోనియా ఆదేశాల మేరకే జగన్‌పై కేసు
posted on Apr 9, 2011 @ 10:30AM
విజయనగరం: గుట్టు రట్టయింది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పై హస్తిన స్థాయిలోనే పక్కా స్క్రిప్టు ప్రకారం పకడ్బందీగా కుట్ర జరుగుతోందని ‘అధికారికంగా’ తేలిపోయింది. ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, ఆ వెంటనే ఆయనపై ప్రభుత్వపరంగా, ఇతరత్రా పలు రకాలుగా వేధింపులు మొదలవడం తెలిసిందే. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్లోనే జరుగుతున్నాయని విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా చేనేత, జౌళి మంత్రి పి.శంకర్రావు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. సోనియాగాంధీ ఆదేశాల మేరకే జగన్‌పై కేసు వేశామని ఏకంగా మీడియా సమావేశంలోనే ఆయన ప్రకటించారు! ముందుగా ఈ విషయాన్ని ప్రస్తావించిన విలేకరులు, కేసు ఎంతవరకు వచ్చిందని అడిగారు. అది కోర్టులో ఉన్నందున వ్యాఖ్యానించబోనని శంకర్రావు చెప్పారు. సోనియాకు తెలిసే కేసు వేశారా అని ప్రశ్నించగా, ఆమె ఆదేశాల మేరకే వేసినట్టు వెల్లడించారు. ‘‘సోనియా గాంధీ విష్ మాపై ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా సంస్థ తదితర అంశాలలో సోనియా విష్ మేరకే జగన్‌పై ఆరోపణలు చేశాం, కేసులూ వేశాం’’ అని స్పష్టంగా చెబుతూ వెళ్లిపోయారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, జగతి ఆస్తులపై పలు ఆరోపణలతో శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయడం తెలిసిందే. వీటి వెనక ఉన్నది సాక్షాత్తూ కాంగ్రెస్ అధిష్టానమేనని ఆయన తాజా వ్యాఖ్యలతో నిరూపణ అయింది.