ఇది ప్రజలందరి విజయం: అన్నా హజారే
posted on Apr 9, 2011 @ 11:09AM
న్యూఢిల్లీ: ఇది ప్రజలందరి విజయమనీ, ఈ పోరాటంలో మన పాత్ర ఇక్కడితో ఆగిపోకూడదని అన్నా హజారే అన్నారు. అవినీతి మీద ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. మద్దతుదారులందరి చేతా హజారే దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత తానూ నాలుగు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష విరమించారు. హజారే దీక్ష సుమారు 96 గంటలపాటు సాగింది. ఆగస్టు 15 లోగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించకపొతే మళ్ళీ ఉద్యమిస్తానని అన్నా హజారే చెప్పారు. జన్ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రమంత్రి కపిల్ సిబల్ స్వామి సంయుక్త కమిటీ ఏర్పాటుకు కేంద్రం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రతిని స్వామి అగ్నివేశ్‌కు అందచేశారు. జీవో జారీ చేయటంతో హజారే ఈ సందర్భంగా సోనియాగాంధీ, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా శిబిరం వద్ద సామాజిక కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేటు వద్ద విజయోత్సవ వేడుకలలో పాల్గొనాలని హజారే పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనకు తాము చేపట్టిన ఈ దీక్ష ఇంతటితో ఆంతం కాలేదని, ఇది ఆరంభం మాత్రమేనని స్వామి అగ్నివేశ్ అన్నారు.