దీక్ష విరమించనున్న అన్నా హజారే
posted on Apr 9, 2011 @ 10:14AM
న్యూఢిల్లీ: అవినీతిపై అస్త్రాన్ని ఎక్కుపెట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం ఉదయం తన దీక్షను విరమించనున్నారు. లోక్‌పాల్ బిల్లు ఏర్పాటుపై ఆయన పెట్టిన అన్ని డిమాండ్లతో కమిటీ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపడంతో ఆయన దీక్షను విరమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అణచడానికి రూపొందిస్తున్న లోక్‌పాల్ బిల్లుపై తాము చేస్తోన్న డిమాండ్లకు కేంద్రం అంగీకరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నా హజారే ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం తలొగ్గడం ఇది భారత ప్రజల విజయమని పేర్కొన్నారు.
కాగా, ఇది చాలా సంతోషకరమైన రోజు.. ఇది ప్రజాస్వామ్యాం విజయం అని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించి తాను చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను విరమించేందుకు ముందుకు వచ్చిన అన్నా హజారే నిర్ణయాన్ని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హర్ష వ్యక్తం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాగా సంయుక్త కమిటీ ఏర్పాటుకు సంబంధించి శనివారం గెజిట్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు.