హజారే దీక్షకు మెట్టుదిగిన కేంద్రం
posted on Apr 8, 2011 @ 5:00PM
న్యూఢిల్లీ: అవినీతిని అడ్డుకోవడానికి జన్ లోక్‌పాల్ బిల్లును తీసుకురావాలని గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దెబ్బకు కేంద్రం మెట్టు దిగింది. అన్నాహజారే డిమాండ్‌లను ఒప్పుకుంటున్నట్లుగా తెలిపింది. అన్నాహజారే మద్దతుదారుడు స్వామి అగ్నివేష్‌ను చర్చలకు ఆహ్వానించింది. హజారే దీక్ష తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం ఎన్నికలలో ప్రభావం పడుతుందని భావించి దిగివచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా లోక్‌పాల్ బిల్లు ప్రతిని స్వామి అగ్నివేష్‌కు కేంద్రం పంపించింది. సాయంత్రం చర్చలకు రమ్మని ఆహ్వానించింది. వచ్చే పార్లమెంటు సమావేశాలలో లోక్‌పాల్ బిల్లును పెట్టడానికి అంగీకరించింది. లోక్‌పాల్ బిల్లుపై జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది. కమిటీలో 10 మంది ఉంటారు. అందులో 5గురు సామాజిక, క్రియాశీలక కార్యకర్తలను నియమించేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్యానల్ కన్వీనర్‌గా కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఉంటారు. కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని చెప్పారు.
ప్రజావాణికి కేంద్రం దిగి వచ్చినప్పటికీ అన్నాహజారే పెట్టిన ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లపై కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదని తెలుస్తోంది. అందులో నోటిఫికేషన్ జారీ చేయడం ఒకటి కాగా, చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జెఎస్ వర్మని తీసుకోవాలని రెండు డిమాండ్లపై నోరు మెదపడం లేదు. అయితే అన్ని డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకుంటే దీక్ష విరమించేది లేదని అన్నా చెబుతున్నారు. కేంద్ర ప్రతిపాదనలను అన్నా హజారే తిరస్కరించారు. కాగా అన్నాహజారేతో పాటు దీక్ష చేపట్టిన 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.