బాబా ఆశీస్సులతో కొనసాగిస్తాం

పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సేవలను యధావిధిగా కొనసాగిస్తామని ట్రస్ట్ సభ్యుడు రత్నాకర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. సత్య సాయిబాబా ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. బాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్ పేరుతో ఈ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సత్య సాయి బాబాకు నివాళులు అర్పిస్తూ ట్రస్ట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సత్యసాయి బాబా జీవించి ఉన్నంత కాలం మార్గదర్శనం చేస్తూ తమను నడిపించారని, ఇప్పుడు బాబా ఆశీస్సులతో ముందుకు సాగుతామని రత్నాకర్ చెప్పారు. సత్యసాయి బాబా ప్రారంభించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. బాబా తమపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. బాబా జీవించి ఉన్నంత వరకు ఎలా నడిపించారో అదే రీతిలో నడిపించడానికి తాము వజ్ర సంకల్పంతో పాటుపడతామన్నారు.

ఒక్కడిని ఎదుర్కొనేందుకే

కడప :  తన ఒక్కడిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర కాబినెట్‌ను కడపకు పంపించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జగన్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్లే దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. కాగా, జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారంలో అబద్ధం లేదని తెలుస్తోంది. జగన్ బుధవారం మైనారిటీలతో జరిపిన సమావేశంలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది. వైయస్ జగన్ జాతీయ స్థాయిలో బిజెపికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు చెబుతున్నారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అంటూనే ఒక వేళ జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాల్సి వస్తే ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తానని చెప్పారు. దీన్ని బట్టి బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి జగన్ వెనకాడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. వైయస్ జగన్‌తో బిజెపి కలిసి పనిచేస్తోందని, రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి వైయస్ జగన్‌ను వాడుకుంటుందని ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. డి. శ్రీనివాస్ ప్రకటనను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఖండించారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని జగన్ ప్రకటించారు. కానీ బుధవారంనాటి ప్రకటన అసలు విషయాన్ని బయటపెడుతోందని, జగన్ బిజెపితో కలిసి పనిచేస్తారని అంటున్నారు.

యూపీఏ నుంచి వైదొలగం: డీఎంకే

చెన్నై: యూపీఏ కూటమి నుంచి వైదొలగే యోచన లేదని డీఎంకే స్పష్టం చేసింది. డీఎంకే ముఖ్య నేతలు బుధవారం చెన్నైలో సమావేశం అయ్యారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో కనిమొళి పేరు ఉండటం ఆశ్చర్యకరంగా ఉందంటూ ఆమెను డీఎంకే వెనకేసుకొచ్చింది. కనిమొళి వ్యవహారాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆపార్టీ ప్రకటించింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆమె పేరును ఛార్జ్‌షీటులో నమోదు చేశారని అభిప్రాయపడింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కొన్ని పార్టీలు కుట్రగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కార్‌ను విచ్చిన్నం చేయటానికి కొన్ని పార్టీలు కావాలనే కుట్ర పన్నుతున్నాయన్నారు.

పట్టపగలే నెలవంక దర్శనం

పుట్టపర్తి‌: సత్యసాయి బాబా మహా సమాధి సందర్భంగా పుట్టపర్తిలో బుధవారం పట్టపగలే చంద్రుడు దర్సనమిచ్చాడు. ఓ వైపు సత్య సాయి బాబా పార్థివ దేహం ఖననం జరుగుతుండగా పుట్టపర్తిలో ఆకాశంలో నెలవంక కనిపించింది. ఈ నెల వంక దృశ్యాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దీన్ని ప్రజలు వింతగా గమనించారు. ఖననానికి ముందు బాబా నోట్లో నవ రత్నాలు ఉంచారు. ఆవుపాలు, నెయ్యితో సంప్రోక్షణ చేశారు. శాస్త్రోక్తంగా బాబా అంత్యక్రియలు జరిగాయి. సమాధిలో బాబా తలను దక్షిణం వైపు ఉంచారు. బాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ వేద క్రియ నిర్వహించారు. త్రివేణి సంగమ నదీ జలాలతో అభిషేకం చేయించారు. మహా సమాధి సందర్భంగా 8 మంది మత పెద్దలు ప్రార్థనలు చేశారు. సప్త మృత్తికలతో బాబా దేహానికి స్నానం ఆచరింపజేశారు. కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి అయ్యారు.  మహా సమాధి దర్శనానికి ప్రజలను ఈ నెల 29వ తేదీ వరకు అనుమతిస్తారు.అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

డీజీపీ అరవిందరావు నియామకం చెల్లదు

హైదరాబాద్ : డీజీపీ అరవిందరావు నియాకమం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) బుధవారం సంచలన తీర్పునిచ్చింది. సీనియారిటీని పక్కనపెట్టి డీజీపీగా అరవిందరావును ఎందుకు నియమించాల్సి వచ్చిందని క్యాట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డీజీపీ ఎంపిక నిష్పాక్షపాతంగా సహజ న్యాయసూత్రబద్దంగా నిర్వహించలేదని క్యాట్ అభిప్రాయపడింది. జూన్ 9వ తేదీలోగా కొత్త డీజీపీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకూ అరవిందరావును డీపీజీగా కొనసాగించవచ్చునని పేర్కొంది. డీజీపీగా అరవిందరావు నియామకాన్ని సవాల్ చేస్తూ హోంశాఖ కార్యదర్శి గౌతంకుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

సత్యసాయిబాబా మహా సమాధి

పుట్టపర్తి : తన భక్తులను బంగారు అని ప్రేమగా పిలిచే సత్యసాయి బాబా శాశ్వత సమాధిలోకి వెళ్లిపోయారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బుధవారం ఉదయం 8 గంటల నుండి క్రతువు ప్రారంభమయింది. బాబా సోదరుడి తనయుడు రత్నాకరరాజు క్రతువుని నిర్వహించారు. మహాక్రతువుకు అనీల్ కుమార్ వ్యాఖ్యానం చేశారు. ప్రభుత్వం తరఫున బాబాకు గౌరవ వందనం సమర్పించారు. ఆయన పార్థివ శరీరంపై జాతీయ జెండాను కప్పారు. వేదమంత్రోచ్ఛరణాల మధ్య హారతి ఇచ్చారు. పుణ్య నదుల క్షేత్రాల మట్టిని తీసుకు వచ్చారు. సరస్వతీ నది నుండి కూడా మృత్తికను తీసుకు వచ్చారు. సాయి సమాధిని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులో సమాధి చేశారు. బాబా శిరస్సు దక్షిణం వైపు ఉంచారు. సాయికి మహాహారతితో మహాసమాధి పూర్తి అయ్యింది. మహా సమాధి కార్యక్రమానికి బాబా కుటుంబసభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు ఎల్‌కె అద్వానీ, వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, మర్రి శశిథర్‌రెడ్డి, డీజీపీ అరవిందరావు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్, వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, పలు రాష్ట్ర మంత్రులు, వీఐపీలు హాజరు అయ్యారు. బాబా లేరనే వార్తను భక్తులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సత్యసాయి మరలా తమకు దర్శనం ఇస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ప్రపంచ మానవాళికి ప్రేమతత్వం సేవాతత్పరతలను చాటిచెప్పి కోట్లాది మంది భక్తుల హృదయాల్లో కొలువై ఉన్న సత్యసాయి బాబా భక్తకోటిని శోకసంద్రంలో ముంచి శివైక్యం చెందారు.

జూన్‌ తర్వాత రాజీనామా

జగిత్యాల‌: కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జూన్‌ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తే తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలంతా రాజీనామాలు చేస్తామని లిఖిత పూర్వకంగా అధిష్టానానికి వివరించామని నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ అన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు కోసం అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ సంఘాలు ఐక్యం గా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చిదంబరం ఆదేశాలతో గవర్నర్‌ కనుసన్నలలో సీమాంధ్రనాయకుల ఒత్తిళ్ళతో కొందరు అధికారులు, నిఘా వర్గాలు తెలంగాణ ఉద్యమం బలహీనపడిందనే తప్పుడు నివేదికలను ఇస్తున్నారని ఆరోపించారు. కడప ఎన్నికల ప్రభావం అధినాయకత్వంపై ఏమాత్రం ఉండదన్నారు

నల్లధనంలో భారత్ దే అగ్రస్థానం

ప్రపంచం మొత్తమ్మీద చూసినప్పుడు భారతదేశం నుంచి వస్తున్న నల్లధనమే ఎక్కువని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అస్సాంజే చెప్పారు. ఓ ప్రైవేట్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బును డిపాజిట్ చేస్తున్నవారిలో భారత దేశానికి చెందినవారే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తున్నారని చెప్పుకొచ్చాడు. నల్లధనం రూపేణా దాచుకుంటున్నవారిలో భారతదేశానికి చెందినవారే అధికులనీ, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని ప్రకటించాడు. కోట్లకు కోట్లు నల్లధనాన్ని ఇండియన్స్ ఇక్కడ దాచుకున్నారనీ, బ్లాక్ మనీపై భారతదేశంలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆ డబ్బును మెల్లగా ఇతర ప్రాంతాలకు తరలించే పనిలో వారున్నారనీ వెల్లడించాడు. విదేశాలలో నల్లధనానికి సంబంధించిన వివరాలను వెలికి తీయడంలో భారతదేశం ఇంకా నిపుణుత ప్రదర్శించాల్సి ఉందన్నారు. బ్లాక్ మనీని తరలిస్తున్నవారు ప్రభుత్వ లెక్కల నుంచి తప్పించుకునేందుకు అనేక పద్ధతులను పాటిస్తున్నట్లు తేలిందన్నారు. అయితే తాము నల్లధనం ఖాతాదారులకు సంబంధించి సమచారాన్ని అందిస్తే భారత ప్రభుత్వం మాత్రం తామేదో తప్పు చేసినట్లు చూడటం తమకు అసంతృప్తి కలిగిస్తోందన్నారు. దేశ ప్రధాని అవినీతిపరుడని తాము చెప్పలేదనీ, కొంతమంది వ్యక్తులు దేశాన్ని కొల్లగొట్టి భారీగా నల్లధనం రూపంలో విదేశాలకు తరలించుకుంటున్నారని మాత్రమే చెప్పామన్నారు. ఇటువంటివారిపై భారతప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు. అదేవిధంగా స్విస్‌లో దాచుకున్న నల్లధనానికి డబుల్ టాక్స్ విధించేటట్లు ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం చేస్తున్న యత్నం కూడా సరియైన చర్య కాదని అభిప్రాయపడ్డారు అస్సాంజే. నల్లధనం కలిగిన వ్యక్తుల వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిసిన తర్వాత తనను చాలామంది బెదిరించారనీ, అయితే అటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని అస్సాంజే వెల్లడించారు. వికీలీక్స్ అంతగా చెపుతున్నప్పటికీ కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదని ప్రధానప్రతిపక్షం బీజేపీ మండిపడింది. తక్షణమే నల్లధనం దేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

సేవా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం: రత్నాకర్

అనంతపురం: మాన వాళికి సత్యసాయి అందించిన సేవలు మరువరానివని, ఆయన వజ్ర సంకల్పాన్ని నెరవేర్చడమే ట్రస్ట్ ధ్యేయమని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. బాబా చూపిన బాటలోనే సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ట్రస్ట్ నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. బాబా ఆత్మ దేహాన్ని వీడిన తర్వాత మొదటిసారిగా ట్రస్ట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. బాబా సేవలను వారు కొనియాడారు. బాబా వజ్ర సంకల్పానికి ఏమాత్రం మచ్చ రాకుండా ట్రస్ట్ ముందుకు సాగుతుందని తెలిపారు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే బాబా ఆత్మకు శాంతి కలుగుతుందని తెలిపారు. భగవాన్ దేహం వీడినా ఆయన మనతోనే ఉంటూ సేవలు కొనసాగిస్తారని తెలిపారు. బాబా సేవల కొనసాగింపే ముందున్న లక్ష్యమన్నారు. సత్యసాయిబాబా ఆకాంక్షించిన సేవలన్నిటినీ కొనసాగిస్తామని వెల్లడించారు.

బాబాకు సోనియా, మన్మోహన్ నివాళులు

పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయిబాబా పార్ధివ దేహాన్ని సందర్శించి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం నివాళులు అర్పించారు. వారిద్దరు మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. నివాళులు అర్పించి, కొద్ది సేపు సాయి బాబా భౌతిక కాయం వద్ద కూర్చున్నారు. వారి వెంట ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ఉన్నారు. కేంద్ర మంత్రులు పి. చిదంబరం, మునియప్ప, పనబాక లక్ష్మి కూడా వారి వెంట ఉన్నారు. మన్మోహన్, సోనియా రాకతో దాదాపు గంట పాటు భక్తుల సందర్శనను ఆపేశారు.

కల్మాడీ కి చెప్పుదెబ్బ

న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీకి పాటియాలా కోర్టు ఆవరణలో పరాభవం ఎదురైంది. కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో అరెస్టయిన సురేష్ కల్మాడీని సీబీఐ అధికారులు పాటియాలా కోర్టు ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. పాటియాలా కోర్టుకు సురేష్ కల్మాడీతో పాటు ఏఎస్‌వి ప్రసాద్ కూడా హాజరయ్యారు. కానీ కోర్టు ఆవరణలోనే గుర్తు తెలియని వ్యక్తి కల్మాడీపై చెప్పుతో దాడి చేశాడు. అనంతరం కల్మాడీని పాటియాలా కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది. పది రోజుల పాటు విచారణ నిమిత్తం సీబీఐ రిమాండ్ కోరనుంది. కాగా సురేష్ కల్మాడీపై చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు కల్మాడీతో పాటు కోర్టులో హాజరైన ఏఎస్‌వి ప్రసాద్ కూడా కోర్టులో సీబీఐ హాజరు పరిచింది. కామన్వెల్త్ కుంభకోణం కేసులో ఏకేఆర్ సంస్థకు లింకు ఉందని తేలింది. హైదరాబాద్ ఏకేఆర్ సంస్థకు రూ.23కోట్లు బదిలీ అయినట్లు సీబీఐ అధికారులు విచారణలో తేల్చారు. సీడబ్ల్యూజీ జేడీగా కొనసాగుతూనే ఏఎస్‌వి ప్రసాద్ ఏకేఆర్ కన్స్‌స్ట్రక్షన్ నడిపినట్లు తెలియవచ్చింది.

కాంగ్రెసు ప్రభుత్వానికి సంక్షోభం తప్పదు: సురేఖ

కడప: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం 2014 వరకు కొనసాగబోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికలపై కాంగ్రెసు నాయకులే భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆమె చెప్పారు. కడప లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అందరూ అశ్చర్యపోయే విధంగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్ కు మెజార్టీ తగ్గించేందుకు కాంగ్రెసు పార్టీ పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తుందని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

గాలితో జగన్ మ్యాచ్ ఫిక్సింగ్

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే మాటలను ఎవరూ విశ్వసించబోరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్‌కు గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఓటేస్తే దాన్ని బురదలో వేసినట్లేనని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోక్ సభ స్థానంలో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌ను ఓడించడం ఖాయమని కడప తెలుగుదేశం అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. వామపక్షాలతోనే తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నట్లు ఆయన అన్నారు. సరైన సమయంలో మిత్రపక్షాలు ప్రచారంలోకి వస్తాయని ఆయన చెప్పారు. వామపక్షాలు తన తరఫున ప్రచారం చేస్తాయని ఆయన చెప్పారు.

'ఆ నలుగురు' మంత్రులకు ఇసి నోటిసులు

కడప: కడప ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న నలుగురు మంత్రులకు ఎన్నికల సంఘం (ఇసి) నోటీసులు జారీ చేసింది. మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, అహ్మదుల్లా, మాణిక్య వరప్రసాద్, అహ్మదుల్లాలకు ఇసి నోటీసులు జారీ అయ్యాయి. గుడ్ ఫ్రైడే రోజు వారు చర్చిలోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేశారనే ఆరోపణపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. డిఎల్ రవీంద్రా రెడ్డి కాంగ్రెసు తరఫున కడప లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కడప లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఓడించడానికి మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే వారు గుడ్ ఫ్రైడే రోజు ఓటర్లను ప్రభావితం చేయడానికి చర్చిలోకి ప్రవేశించారని ఆరోపిస్తున్నారు.

బాబాకు ప్రముఖుల నివాళి

పుట్టపర్తి: శ్రీలంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్షే పుట్టపర్తి సత్య సాయిబాబా పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మంగళవారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా సత్య సాయిబాబాకు నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత అశోక్ సింఘాల్ మంగళవారం ఉదయం బాబా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పనిని సత్య సాయిబాబా చేసి చూపించారని దేవెగౌడ అన్నారు. బాబా మార్గంలోని హిందూ ధర్మ కార్యక్రమాలు సాగుతాయని అశోక్ సింఘాల్ చెప్పారు. అలనాటి సినీనటి జమున కూడా బాబాను కడసారి దర్శించుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి పుట్టపర్తిలోనే ఉంటారు. బాబాను కడసారి చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. భక్తులకు సేవాదళ్ స్వచ్ఛంద సేవకులు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తులతో క్రిక్కిరిసిపోయింది.