పుణ్యక్షేత్రంగా పుట్టపర్తి: రఘువీరా
అనంతపురం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాల్లోని భక్తులకు భగవాన్ సత్యసాయిబాబా 70 ఏళ్లుగా ఆధ్యాత్మిక బోధనలు చేశారన్నారు. బాబా నిరాశ, నిస్పృహల్లో ఉన్న వారందరికీ మనోధైర్యం, ఆత్మస్థైర్యం నింపారన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతిని చాటి చెప్పడంలో బాబా పాత్ర ఎంతైనా ఉందన్నారు. అనంతపురం, మెదక్, మహబూబ్‌నగర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయా ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చిన ధన్యజీవి సాయి అన్నారు. సత్యసాయి తాగునీరు పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం పైపులైన్‌ల ద్వారా అందించి ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. 30 సంవత్సరాల క్రితం డీమ్డ్ యూనివర్శిటీని స్థాపించి విద్యార్థులకు నైతిక విలువలు, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి అంకుర్పారణ చేసిన మహోన్నత వ్యక్తి బాబా అన్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను స్థాపించారన్నారు.
ప్రభుత్వం కంటే సత్యసాయి ట్రస్టు ద్వారానే నీతి, నిజాయితీగా పూర్తిస్థాయిలో పనులు చేయవచ్చని ప్రపంచానికి బాబా తెలియచేశారన్నారు. బాబా ఆత్మ శరీరాన్ని వదిలిందే కానీ పుట్టపర్తిని వదల్లేదన్నారు. సాయిరాం అంటూ వలంటీర్లు పార్థివ దేహ దర్శనానికి వచ్చిన వారందరికీ సేవలు చేశారన్నారు. వేలాదిగా వచ్చిన పోలీసులు నెల రోజుల పాటు శ్రమించారన్నారు. వీరందరీ శ్రమ మూలంగా పుట్టపర్తి భవిష్యత్తులో గొప్ప పుణ్యక్షేత్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటుందని మంత్రి చెప్పారు. ఓ సాధువుకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తి అనంతపురం జిల్లాలో జన్మించడం మన అదృష్టం, పుణ్యమన్నారు. బాబా ఆశయాలను కొనసాగించడానికి సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తాయన్నారు.