బాబాకు ప్రముఖుల నివాళి
posted on Apr 26, 2011 @ 12:01PM
పుట్టపర్తి: శ్రీలంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్షే పుట్టపర్తి సత్య సాయిబాబా పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మంగళవారం ఉదయం పుట్టపర్తికి చేరుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా సత్య సాయిబాబాకు నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత అశోక్ సింఘాల్ మంగళవారం ఉదయం బాబా భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని పనిని సత్య సాయిబాబా చేసి చూపించారని దేవెగౌడ అన్నారు. బాబా మార్గంలోని హిందూ ధర్మ కార్యక్రమాలు సాగుతాయని అశోక్ సింఘాల్ చెప్పారు. అలనాటి సినీనటి జమున కూడా బాబాను కడసారి దర్శించుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి పుట్టపర్తిలోనే ఉంటారు. బాబాను కడసారి చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. భక్తులకు సేవాదళ్ స్వచ్ఛంద సేవకులు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తులతో క్రిక్కిరిసిపోయింది.