పట్టపగలే నెలవంక దర్శనం
posted on Apr 27, 2011 @ 11:15AM
పుట్టపర్తి: సత్యసాయి బాబా మహా సమాధి సందర్భంగా పుట్టపర్తిలో బుధవారం పట్టపగలే చంద్రుడు దర్సనమిచ్చాడు. ఓ వైపు సత్య సాయి బాబా పార్థివ దేహం ఖననం జరుగుతుండగా పుట్టపర్తిలో ఆకాశంలో నెలవంక కనిపించింది. ఈ నెల వంక దృశ్యాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దీన్ని ప్రజలు వింతగా గమనించారు. ఖననానికి ముందు బాబా నోట్లో నవ రత్నాలు ఉంచారు. ఆవుపాలు, నెయ్యితో సంప్రోక్షణ చేశారు. శాస్త్రోక్తంగా బాబా అంత్యక్రియలు జరిగాయి. సమాధిలో బాబా తలను దక్షిణం వైపు ఉంచారు. బాబా సోదరుడు జానకీ రామయ్య కుమారుడు రత్నాకర్ వేద క్రియ నిర్వహించారు. త్రివేణి సంగమ నదీ జలాలతో అభిషేకం చేయించారు. మహా సమాధి సందర్భంగా 8 మంది మత పెద్దలు ప్రార్థనలు చేశారు. సప్త మృత్తికలతో బాబా దేహానికి స్నానం ఆచరింపజేశారు. కుల్వంత్ హాలులో బాబా మహా సమాధి అయ్యారు. మహా సమాధి దర్శనానికి ప్రజలను ఈ నెల 29వ తేదీ వరకు అనుమతిస్తారు.అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.