2జీ నివేదికను సమర్పించిన జోషీ
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం స్కామ్‌పై రూపొందించిన నివేదికను ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) అధ్యక్షుడు, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు అందజేశారు. ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆమెను కోరారు. ‘నేను నివేదికను సమర్పించాను. స్పీకరు దానిని ఆమోదించి, పార్లమెంట్లో ప్రవేశపెడతారని అనుకుంటున్నాను’ అన్నారు. స్పీకర్ అభిప్రాయమే అంతిమమన్నారు. నివేదికలో ప్రధానమంత్రి మన్మోహన్‌ను, నాటి ఆర్థికమంత్రి చిదంబరంను, ప్రధానమంత్రి కార్యాలయాన్ని తీవ్రంగా అభిశంసించారు. అయితే, ఆ నివేదికను కమిటీలోని యూపీఏ సభ్యులు తిరస్కరించిన విషయం తెలిసిందే. 21 మంది సభ్యుల కమిటీలో 11 మంది తిరస్కరించారు కాబట్టి ఆ నివేదిక చట్టబద్ధం కాదని యూపీఏ వాదిస్తోంది. యూపీఏ వాదనను రాజ్యాంగ విరుద్ధమైనదిగా జోషి కొట్టివేశారు. ఆ నివేదికలోని ప్రతి పేరాను సభ్యులందరూ చదివి, చర్చించారు కాబట్టి.. తిరస్కరించడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. పీఏసీ సమావేశాల్లో సభ్యుల ప్రవర్తనను కూడా ఆయన తప్పుబట్టారు.
సమాధానాలివ్వవద్దంటూ యూపీఏ సభ్యులు సాక్షులతో చెప్పారని, కమిటీ సభ్యులే అడ్డుకుంటుంటే.. ఇక విచారణకు అర్థమేముందని ఆయన వాపోయారు. ‘ఏప్రిల్ 4 వరకు అంతా బావుంది. చైర్మన్ మంచివాడు, నమ్మకమైనవాడు, నిష్పక్షపాతంగా వ్యవహరించేవాడు. పీఏసీ ఉండగా జేపీసీ ఎందుకు అని కూడా అన్నారు. ప్రధాని కూడా పీఏసీ ముందు హాజరవుతానన్నారు. ఆ తరువాతే అంతా మారిపోయింది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారులను, సీబీఐ డెరైక్టర్‌ను, కేబినెట్ కార్యదర్శిని, అటార్నీ జనరల్‌ను పీఏసీ ముందుకు పిలవాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సమస్య ప్రారంభమైందని జోషి వివరించారు. పీఏసీ నివేదికను చెత్తబుట్టలో వేయాలని ఒక మంత్రి వ్యాఖ్యానించడంపై జోషి విచారం వ్యక్తంచేశారు. ‘ఇప్పుడు పీఏసీ నివేదికను చెత్తబుట్టలో వేస్తారు.. రేపు పార్లమెంటు ప్రతిపాదనలను, ఆ తరువాత సుప్రీంకోర్టు ఆదేశాలను చెత్తబుట్టలో వేస్తారు.. ఇలా ఎంత దూరం వెళ్తారు?’ అని ప్రశ్నించారు. సమయాభావం వల్లనే మాజీ టెలికాం మంత్రి రాజాను పీఏసీ ముందుకు పిలవలేదని వివరించారు. కాగా, పీఏసీ చైర్మన్ జోషిపై బురదజల్లే కార్యక్రమం ప్రధాని నిర్దేశకత్వంలోనే నడుస్తోందని బీజేపీ ఆరోపించింది.