గాలికి సుప్రీం షాక్
న్యూఢిల్లీ: కర్ణాటక అక్రమ మైనింగ్ 'ఘనుల'కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బళ్లారి-హోస్పేట ప్రాంతంలోని 19 ఇనుప ఖనిజం మైనింగ్ లీజులను సుప్రీం కోర్టు నిలిపేసింది. వీటిలో కర్ణాటక పర్యాటక మంత్రి గాలి జనార్దనరెడ్డి భార్య అరుణ భాగస్వామిగా ఉన్న కేపీ పార్వతమ్మ మైనింగ్ కంపెనీ సహా ఆయన పరోక్షంగా మైనింగ్ నిర్వహిస్తుంటారనే ఆరోపణలున్న పలు ఇతర కంపెనీ లూ ఉన్నాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ అక్కడ తవ్వకాలూ జరపరాదని సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే తవ్విన ఖనిజం తరలింపును సైతం నిషేధించింది. బళ్లారి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) రెండు నివేదికలను సమర్పించింది. వీటి ఆధారంగా సుప్రీం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. "తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆ 19 గనుల్లో ఎలాంటి తవ్వకాలూ జరపకూడదు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని తరలించకూడదు'' అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక అటవీ బెంచ్ ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ బెంచ్‌లో జస్టిస్ అఫ్తాబ్ ఆలం, కేఎస్ రాధాకృష్ణన్ కూడా ఉన్నారు. ఈ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడి మైనింగ్ నిర్వహిస్తున్నాయంటూ సీఈసీ ఏప్రిల్ 15న సమర్పించిన నివేదికలో పేర్కొంది. మైనింగ్ సందర్భంగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు సీఈసీ తన మూడు, నాలుగో నివేదికల్లో పేర్కొన్న మరో 68 లీజుదారుల విషయాన్ని తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వారిలో దాదాపు 30 మంది లీజు హోల్డర్లు కర్ణాటక హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు పొందారని ధర్మాసనం తెలిపింది. ఆ సంస్థలపై బదలాయింపు పిటిషన్‌ను దాఖలు చేయాలని అమికస్ క్యూరీ ఏడీఎన్ రావును బెంచ్ కోరింది. ఆ తర్వాత వాటి గురించి నిర్ణయం తీసుకుంటామని పే ర్కొంది. మిగిలిన 68 లీజులనూ నిలిపేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరిస్తూ.. "ఒకరిని మైనింగ్‌కు అనుమతిస్తూ, మరొకరిని నిలిపేస్తూ రెండు సమాంతర ఉత్తర్వులు ఉండవు. మేం వారందరినీ పిలిచి ఖాళీ చేయమని అడగాల్సి ఉంది'' అని బెంచ్ తెలిపింది. ఈ విషయంలో అందరి అభిప్రాయాలూ తీసుకుంటామని కోర్టుకు హా జరైన మైనింగ్ కంపెనీలు, వాటి సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చింది.
అదే సమయంలో సీఈసీ ఎలాంటి మధ్యంతర దరఖాస్తునూ దాఖలు చేయనందున మైనింగ్ లీజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వరాదని వారు చేసిన విజ్ఞప్తిని బెంచ్ నిరాకరించింది. దీనిపై.. సీఈసీ నివేదికను మధ్యంతర దరఖాస్తుగా మార్పు చేస్తామని తెలిపింది. సమాజ్ పరివర్తన్ సముదాయ అనే స్వచ్ఛంద సంస్థ తన వాదనలు వినిపిస్తూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అక్రమ మైనింగ్‌ను నిరోధించలేక పోవడంతో స్థానిక ప్రజలు ప్రత్యేకించి గ్రామీణ పేదల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. అక్రమ మైనింగ్ వల్ల 1100 హెక్టార్ల అటవీ భూమి కబ్జా అయిందని తెలిపింది. సుప్రీం కోర్టు నిలిపేసిన మై నింగ్ లీజుల్లో ఎస్‌బీ మినరల్స్, మునీర్ ఎంటర్‌ప్రైజెస్, ట్రైడెంట్ మినరల్స్, వీయమ్, ఆదర్శ ఎంటర్‌ప్రైజెస్, స్పార్క్‌లైన్ మైనింగ్, వీఎస్ఎల్ మైనింగ్ కంపెనీ, కతికేశ్వర్ మైనింగ్ అండ్ ఐరన్ ఓర్, మిత్ర మినరల్ ఎంటర్‌ప్రైజెస్, కేపీ పార్వతమ్మ మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. ఐరన్ ఓర్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుందని, కనుక తాము వాటిని నిలిపివేయలేమని చెప్పారు. ఇందుకు బెంచ్ ప్రతిస్పందిస్తూ.. అక్రమ మైనింగ్‌ను మీరు నిలిపేయలేకపోతే.. మేం నిలిపేస్తాం. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తాం'' అని ప్రతిస్పందించింది. చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా 2003 నుంచి 2010 మధ్య ఈ ప్రాంతం నుంచి 15,245 కోట్ల రూపాయలు విలువ చేసే 304.91 లక్షల టన్నుల ఐరన్ ఓర్ తరలిపోయిందని సీఈసీ తన నివేదికలో పేర్కొంది. లోకాయుక్త దీనిపై నివేదిక ఇచ్చినా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోలేక పోయిందని తెలిపింది.