ఒక్కడిని ఎదుర్కొనేందుకే
posted on Apr 27, 2011 @ 1:45PM
కడప : తన ఒక్కడిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్ర కాబినెట్‌ను కడపకు పంపించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జగన్ మరోసారి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చలవ వల్లే దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. వైఎస్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
కాగా, జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారంలో అబద్ధం లేదని తెలుస్తోంది. జగన్ బుధవారం మైనారిటీలతో జరిపిన సమావేశంలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని తెలియజేస్తోంది. వైయస్ జగన్ జాతీయ స్థాయిలో బిజెపికి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు చెబుతున్నారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అంటూనే ఒక వేళ జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాల్సి వస్తే ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తానని చెప్పారు. దీన్ని బట్టి బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి జగన్ వెనకాడే ప్రసక్తి లేదని చెబుతున్నారు. వైయస్ జగన్‌తో బిజెపి కలిసి పనిచేస్తోందని, రాష్ట్రంలో పాగా వేయడానికి బిజెపి వైయస్ జగన్‌ను వాడుకుంటుందని ఇటీవల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. డి. శ్రీనివాస్ ప్రకటనను వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఖండించారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని జగన్ ప్రకటించారు. కానీ బుధవారంనాటి ప్రకటన అసలు విషయాన్ని బయటపెడుతోందని, జగన్ బిజెపితో కలిసి పనిచేస్తారని అంటున్నారు.