గాలితో జగన్ మ్యాచ్ ఫిక్సింగ్
posted on Apr 26, 2011 @ 12:56PM
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కర్ణాటక మంత్రి, బిజెపి నాయకుడు గాలి జనార్దన్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు విమర్శించారు. కాంగ్రెసు, తెలుగుదేశం మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే మాటలను ఎవరూ విశ్వసించబోరని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్‌కు గానీ కాంగ్రెసు పార్టీకి గానీ ఓటేస్తే దాన్ని బురదలో వేసినట్లేనని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కడప లోక్ సభ స్థానంలో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌ను ఓడించడం ఖాయమని కడప తెలుగుదేశం అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం ఉదయం వామపక్షాల నేతలతో సమావేశమయ్యారు. వామపక్షాలతోనే తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నట్లు ఆయన అన్నారు. సరైన సమయంలో మిత్రపక్షాలు ప్రచారంలోకి వస్తాయని ఆయన చెప్పారు. వామపక్షాలు తన తరఫున ప్రచారం చేస్తాయని ఆయన చెప్పారు.