దుష్ప్రచారం వెనుక పెద్ద కుట్ర
పుట్టపర్తి: భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్టు కార్యకలాపాలపై సాగుతున్న దుష్ప్రచారం పట్ల ఆ ట్రస్ట్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందని సభ్యులు ఆరోపించారు. ఇరవై ఏళ్ల తర్వాత గురువారం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు తొలిసారి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసన్, రత్నాకర్, చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ.. సత్యసాయి ట్రస్టు కార్యకలాపాలపై దుష్ప్రచారం జరగడం వెనుక కొన్ని స్వార్థపర శక్తుల కుట్ర దాగి వుందని ఆరోపించారు. ట్రస్టు సభ్యుడు మద్రాసు శ్రీనివాసన్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయిబాబా సెంట్రల్ ట్రస్టు కార్యకలాపాలపై, దానికి ఉన్న ఆస్తులపై ఆయన సవివరమైన ప్రకటన చేశారు. బాబా ఆరోగ్యంపై తాము దృష్టి పెట్టామని, బాబా అనారోగ్యం కారణంగానే తాము ఇంత కాలం మీడియాతో మాట్లాడలేకపోయామని ఆయన అన్నారు. ట్రస్ట్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో చట్ట ఉల్లంఘనకు తావులేదని స్పష్టం చేశారు. ట్రస్టు చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగుతాయని, నిర్వహణలో గోప్యత ఏదీ ఉండదని వివరించారు. ట్రస్ట్ ఆదాయం ఖర్చుల వివరాలను ఎప్పటికపుడు ఆడిటింగ్ చేస్తామన్నారు. వీటిని ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆడిటింగ్ సంస్థ తనిఖీ చేస్తోందన్నారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని చెప్పారు.
ఇకపోతే.. ట్రస్ట్ సభ్యుల్లో ఎలాంటి విభేదాలు లేవని అందరం ఐక్యంగానే ఉన్నట్టు చెప్పారు. ట్రస్ట్ సారథి ఎవరన్న విషయంపై ట్రస్ట్ తదుపరి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అలాగే, ట్రస్ట్ వ్యవహారాల్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. అంతకుముందు సత్యసాయి నిర్యాణంపై ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇతపోతే సత్యసాయి ట్రస్ట్ ఏడాది వ్యయం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటుందని శ్రీనివాసన్ వెల్లడించారు. అలాగే సత్యసాయి మెడికల్ ట్రస్టుకి ఏటా రూ.100 నుంచి రూ.130 కోట్ల వరకూ విరాళాలు అందుతున్నాయని చెప్పారు. సత్య సాయి ట్రస్టు చేపట్టిన మంచినీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ దేశ, విదేశాల నుంచి వచ్చే విరాళాలతో సాగుతున్నాయని ఆయన అన్నారు. తాము ఏ విధమైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులను వాణిజ్య కార్యకలాపాలకు వాడడం లేదని, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. తాము కొన్న భూములకు లెక్కలు, రశీదులు ఉన్నాయని ఆయన చెప్పారు. ట్రస్టుకి విరాళాలు కావాలని సత్యసాయి బాబా ఏనాడు భక్తులను కానీ, మరెవ్వరిని కానీ కోరలేదని తెలిపారు. సత్య సాయి బాబా కోసం తాము శవపేటికకు ఆర్డర్ ఇవ్వలేదని, ఓ భక్తుడు ఆర్డర్ ఇచ్చాడని శ్రీనివాసన్ చెప్పారు. ఈ విషయంపై అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.