రైస్ మిల్లర్ల ఆగడాలకు అడ్డేలేదా?
posted on Aug 23, 2012 @ 3:12PM
అప్పో సప్పో చేసి పంటపండిరచిన రైతులు గిట్టుబాటు ధరలేక, పంటమీద తెచ్చిన రుణంకు వడ్డీలు కట్టలేక , వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే మిల్లర్ల పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉంది. మితిమీరిన స్వలాభంకోసం అధిక ధరలను సృష్టించి అమాయక ప్రజల జీవితాలతో ఆడు కుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌లో బియ్యం అధిక ధరలకు కారణం దళారీ వ్యవస్థ ద్వారా అప్పటికప్పుడు కృత్రిమ కొరత సృష్టించడమే అని వారు వివరిస్తున్నారు. గడచిన కొన్నేళ్లుగా లక్షలాది రూపాయలు వెనుక వేసుకొనే రైసు మిల్లర్లకు చెందిన యజమానులు ఎప్పుడైనా నష్టాల బాటను పడి ఆత్మహత్మలు చేసుకోలేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. మిల్లర్లు కోట్లాది రూపాయల విలువ చేసే బియ్యాన్ని మిల్లుల్లోనే నిల్వ ఉంచుకొని బియ్యం స్టాకు లేదంటూ బోర్డు తిప్పేస్తున్నారని మార్కెట్ వర్గాల వారు చెబుతున్నారు. ఒక ప్రక్క విజిలెన్స్ అధికారలులు దాడులు చేస్తున్నా అవి సరిపోయేంతగా లేవని చెబుతున్నారు. చాలా వరకు రైసు మిల్లర్లంతా రాజకీయ నాయకులు కావడం, మరి కొంతమంది అధికార పార్టీనాయకులకు అనుచరులుగా ఉండటం వల్ల వారిపై అధికారలు దాడులు చేసేందుకు జంకుతున్నారు. ఈ విధానంతో ప్రజలతోపాటు పంట పండిరచిన రైతులు కూడా నష్టపోవల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రైసు మిల్లర్ల ఆగడాలను వెంటనే అరికట్టాలని, లేకపోతే ప్రజలు బాగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తచేశారు. ప్రభుత్వం వెంటనే మిల్లర్ల ఆగడాలపై కొరడా జుళిపించాలని లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.