జనం సొమ్ము పోస్టాఫీసులపాలు!
posted on Aug 23, 2012 @ 5:18PM
ఏడొందల యాభైకోట్లు.. ప్రజాధనం.. నిరుపయోగంగా పడుంది.. ఇప్పుడా డబ్బు పరిస్థితి న ఘరకా.. న ఘాట్ కా అన్నట్టుగా తయారైంది. ఇంతకీ ఎక్కడుందా డబ్బు..? ఎందుకలా నిరుపయోగంగా పడుంది..? ఎవరు దాచిపెట్టారో.. ఎందుకలా పడుందో చెప్పడం కష్టమే కానీ ఆ డబ్బు గుట్టలు, కొండలుగా పేరుకుపోతోందన్న నిజాన్ని మాత్రం బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు. సరదాగా నెలకింత పొదుపుచేస్తే ఎప్పుడో ఓ సారి అక్కరకొస్తుందిరా అబ్బాయ్.. అంటూ అమ్మలు కొడుకులచేత కట్టించిన డబ్బు.. కొడుకులు ఖర్చులకని ఇచ్చిన డబ్బుని దాచిపెట్టి కొంతమొత్తమయ్యాక తిరిగి వాళ్లకే ఇచ్చేద్దామని, తల్లులూ, తండ్రులూ సేవ్ చేసిన డబ్బు. నెలకింత చొప్పున దాచిపెట్టుకుని ఎవరికీ చెప్పాపెట్టకుండా బాల్చీ తన్నేసిన వాళ్ల డబ్బు.. ఎప్పుడో ఏళ్ల క్రితం జమచేసి ఇప్పుడు పూర్తిగా దానిగురించి మర్చిపోయినవాళ్ల డబ్బు.. ఏదైతేనేం.. ఇలా ఎవరెవరో, ఎక్కడెక్కడో పోస్టాఫీసుల్లో జమచేసిన బోల్డంత డబ్బు పోస్టాఫీసుల్లో అనామతు ఖాతాల్లో మూలుగుతోంది.