పాన్ నెంబర్ చోరీ స్కామ్!
posted on Aug 23, 2012 @ 4:31PM
తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు పాన్ నెంబర్ ఇస్తున్నారా..? కాస్త ఆలోచించండి! మీ పాన్ నెంబర్ ని ఎవరైనా అక్రమంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది.. ఎలా అంటారా..? టిక్కెట్ కోసం ఇచ్చిన పాన్ నెంబర్ ని రైల్వే శాఖ బోగీమీద అంటించే చార్ట్ లో పేరుపక్కన ముద్రించడం వల్ల.. ఎవరుపడితేవాళ్లు పరాయి పాన్ నెంబర్లను కొట్టేస్తున్నారు. వాటిని ఎక్కడపడితే అక్కడ కోట్ చేసి పబ్బం గడిపేసుకుంటున్నారు.
ముఖ్యంగా నగల వ్యాపారులకు దో నెంబర్ దందాకోసం పరాయివాళ్ల పాన్ నెంబర్లు విరివిగా అవసరమౌతున్నాయట. తాజాగా కొందరు ఇలా బోగీమీద చార్ట్ లో ఉన్న నెంబర్లను సేకరిస్తుండగా కొందరు ప్రయాణికులు చూసి పట్టుకున్నారు. గట్టిగా నాలుగు తగిలించి ఆరాతీస్తే అసలు బండారం బైటపడింది. రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ మొత్తం చెల్లించి నగలు కొనుక్కునేవాళ్ల దగ్గర్నుంచి
కొత్త ఫైనాన్స్ చట్టం ప్రకారం వ్యాపారులు పన్నును సేకరించాలి. అలా జరక్కుండా ఉండాలంటే ప్రతిసారీ మరో కొత్త పాన్ నెంబర్ని కోట్ చేయడమే మార్గమని చాలామంది వ్యాపారులు భావిస్తున్నారు.
దో నెంబర్ దందా చేసే బంగారం వ్యాపారులు ఇలా సేకరించి ఇచ్చిన పాన్ నెంబర్లకు ఒక్కోదానికీ పదేసి రూపాయల చొప్పున చెల్లించి అడ్డదారిలో సేకరించి విచ్చలవిడిగా తమ అవసరాలకోసం వాడుకుంటున్న విషయం బైటపడింది. రైలు టిక్కెట్టుమాట దేవుడెరుగు.. మరొకరెవరైనా పాన్ నెంబర్ ని అడ్డదారిలో వాడుకుంటే లేనిపోని తిప్పలు ఎదురౌతాయేమోనని చాలామంది ప్రయాణికులు భయపడుతున్నారు.