నాయకత్వం మార్పు నిజమేనా?
posted on Aug 23, 2012 @ 3:15PM
రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితికి తోడు ముఖ్యమంత్రిని, పిసిసి చీఫ్ బొత్సను కూడా మారుస్తారని డిల్లీ నుండి గల్లీ వరకు వార్తలు జోరందు కుంటున్నాయి. దానికి ముహూర్తం ఈ నెల 27 అనికూడా కొందరు జోస్యం చెపుతున్నారు. 27లోపు దాని తాలూకూ ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రిగా జానారెడ్డి పేరు దాదాపు ఖరారైదని కూడా చెబుతున్నారు. ఆయనకు సంబందించిన పూర్తి వివరాలను ఇంటిలిజెన్స్ అధికారులనుండి తెప్పించుకున్నారని కూడా చెబుతున్నారు. జానారెడ్డి అయితే అటు సీమాంద్రకు, ఇటు రాయలసీమకు కావల్సిన వ్యక్తిగా ఉండటమే కాక, అందరికీ కావల్సిన పనులను చేసి పెడతారని ఆ విషయంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విఫలమయ్యారని ఎమ్మేల్యేలను సంతృప్తి పరచి వారిని సమన్వయంతో ముందుకు తీసుకు పోయే నాయకుడు కావాలని భావించిన అధిష్టానం జనార్ధనరెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే రేసులో మర్రి శశిధర్‌రెడ్డికూడా ఉన్నట్లు ఆయన తన లాబీతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో పిసిసి ప్రసిడెంట్‌గా కన్నా లక్ష్మీనారాయణ పేరు దాదాపుగా ఖరారయ్యారన్న వార్తలు వినవస్తున్నాయి.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన సామాజిక వర్గం అండ అవసరం ఉందని గత ఎన్నికల్లో కాపులు పార్టీకి దన్నుగా ఉన్నారని అదే వర్గాన్ని తమ వెంట ఉంచుకోవడం వల్ల పార్టీకి లాభంగా భావిస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ కన్నాకు పిసిసి పగ్గాలు ఇవ్వాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. బొత్స ఎవరినీ సమన్యయం చేసుకోలేక పోతున్నారని, ఒకవర్గానికి చెందిన వారికే ప్రాతినిత్యం వహిస్తూ పార్టీ గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం అధిష్టానంలో ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అదే కన్నా అయితే మొదటినుండి ఏ వర్గానికి అనుబంధంగా లేరని అందుకే తనకంటే జూనియర్ అయిన బొత్స పిసిసి అద్యక్షుడయినా కన్నా కలత చెందకపోవడం తన పరిణితికి నిదర్శనమంటున్నారు.