ఏపీ రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం
ఆంధ్రరాష్ట్ర నూతన రాజధాని శంఖుస్థాపనపై మళ్లీ అయోమయం నెలకొంది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి వచ్చిన కారణంగా జూన్ 6వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి వస్తుంది. అవి.. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదు.. ఎటువంటి పర్యటనల్లో పాల్గొనకూడదు.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్వహించే కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కి లేఖ పంపగా ఆయన ఈ లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపారు. ఈ లేఖపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.