భయపడను.. బులెట్ లా దూసుకెళ్తా.. చంద్రబాబు
posted on Jun 4, 2015 @ 4:11PM
రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు సూత్రధారి వేరే ఉన్నారని, చంద్రబాబు ఫోన్ సంభాషణలు మాదగ్గర ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నాయిని చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తమపై చేసే తప్పుడు వ్యాఖ్యలకు భయపడమని, బుల్లెట్ లా దూసుకెళ్తామని అన్నారు. ముందు తెదేపా ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ పై కేసు పెట్టాలని, అసలు జగన్ ఏ అర్హతతో తమ పార్టీని విమర్శిస్తున్నారో తెలియడంలేదు, 16 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు ఆ హక్కు లేదని ఎద్దేవ చేశారు.
మరోవైపు నాయిని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ తమ దగ్గర చంద్రబాబు సంభాషణలు ఉన్నాయి అంటున్నారు.. మా ఎమ్మెల్యేలతో కేసీఆర్, కేటీఆర్, కవిత మాట్లాడిన వాయిస్ రికార్డింగులను ముందు బయట పెట్టండి అని మండిపడ్డారు. ఏసీబీ మీ ఒక్కరికే కాదు మాకు కూడా ఉంది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు.