కోర్టులో 30రౌండ్ల కాల్పులు.. ముగ్గురు మృతి

ఒక పక్క కోర్టులో విచారణ జరుగుతోంది.. ఇంతలో ఇద్దరు దుండగులు అమాంతంగా కోర్టు హోలులోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల ప్రకారం అనేక అక్రమాలకు పాల్పడిన కేసులో సుశీల్ శ్రీవాస్తవ్ అనే కరుడుగట్టిన ఓ ముఠా నాయకుడిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐదేళ్లుగా విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా శ్రీవాస్తవ కోర్టులో హాజరుకాగా ఇద్దరు దుండగులు కోర్టు హాలులోకి ప్రవేశించి వారి దగ్గరున్న ఏకే 47 తుపాకులతో కాల్పులు జరపగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 రౌండ్ల తూటాలు బయటకొచ్చాయి. ఈ కాల్పుల్లో శ్రీవాస్తవ్ తోపాటు అతని సన్నిహితులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

ఏపీ యం.యల్సీ. ఎన్నికల షెడ్యుల్

  ఆంద్రప్రదేశ్ స్థానిక సంస్థల కోటాలో 12యం.యల్సీ. స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమీషన్ నిన్న షెడ్యుల్ విడుదల చేసింది. ఎన్నికలకు నోటిఫికేషన్ జూన్ 9న జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు: జూన్ 16, నామినేషన్ల పరిశీలన: జూన్ 17, నామినేషన్ల ఉపసంహరణ: జూన్ 19, పోలింగ్: జూలై 3, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన: జూలై 7. కనుక నిన్నటి నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు.   ఈ 12స్థానాలలో విజయనగరం, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం మరియు అనంతపురం జిల్లాల నుండి చెరో ఒక్కో స్థానానికి, కృష్ణ, గుంటూరు, విశాఖ జిల్లాల నుండి చెరో రెండేసి స్థానాలకి స్థానిక సంస్థల కోటా క్రింద ఎన్నికలు నిర్వహించబడతాయి.   అధికార తెదేపా కృష్ణా, గుంటూరు జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఇప్పటికే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది. అనంతపురం నుండి పయ్యావుల కేశవ్, చిత్తూరు నుండి గాలి ముద్దు కృష్ణం నాయుడు, విశాఖపట్నం నుండి పప్పల చలపతిరావు, తూర్పు గోదావరి నుండి రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రకాశం నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసింది. కృష్ణా జిల్లా నుండి విజయవాడ పట్టణ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, రాజేంద్రప్రసాద్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అదేవిధంగా గుంటూరు జిల్లా నుండి అన్నే సతీష్, యం. సోంబాబు, చందు సాంభశివరావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.   వైకాపా కూడా కృష్ణా జిల్లా నుండి నటుడు కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు పేరును ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన వైకాపాలో చేరబోతున్న బొత్స సత్యనారాయణకు విశాఖ నుండి పోటీ చేయించాలని వైకాపా భావిస్తోంది.

తెలంగాణకు వ్యతిరేకం కాదు.. చంద్రబాబు

రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల్లో ఎలాంటి విభేదాలు లేవని విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని అలాగైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అంతేకాక నవనిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణలో ఉన్న సమస్యలపై కూడా పోరాటం చేస్తామని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ఇచ్చే ఒక్క ప్రత్యేక హోదాతో ఏపీ అభివృద్ధి అసాధ్యమని ఏపీ ఆభివృద్దికి కేంద్రం తప్పకుండా సహకరించాలని కోరారు. ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడతానని అందుకు తెలుగు ప్రజలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఒకవైపు తెలంగాణ వేడుకలు... మరోవైపు విద్యార్ధుల దర్నా

ఒక పక్క తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతుంటే మరోపక్క ఓయూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో ముఖ్య భూమిక పోషించిన ఓయూ విద్యార్ధులే కేసీఆర్ కు వ్యతిరేకంగా దర్నా చేపట్టారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, దానితో పాటు ఓయూ భూముల విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్ధులంతా నల్లజెండాలతో తమ నిరసనను తెలుపుతూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీ నిర్వహించారు. అయితే పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు ఓయూ వెళ్లే దారులను బ్యారీకేడ్లతో, ముళ్లకంచెలతో ఎక్కడికక్కడభద్రత ఏర్పాటు చేయడంతో పాటు ఓయూ నాయకులను ముందే అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసులకు ఓయూ విద్యార్ధులకు వాగ్వాదం జరగడంతో కొంతమంది విద్యార్ధులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

రేవంత్ రెడ్డి చంచల్ గూడ టు చర్లపల్లి

రేవంత్ రెడ్డికి 14 రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే చంచల్ గూడ జైలు అధికారులు చంచల్ గూడలో తీవ్రవాదులున్నారని, సరిపడా బ్యారక్ లు లేవని ఈ సమయంలో రేవంత్ రెడ్డికి భద్రత కల్పించడం కష్టమని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషిన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని, జైలులో తనకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు తెదేపా నేత పయ్యావుల కేశవ్ రేవంత్ రెడ్డిని కలిసి పరామర్శించారు. 

నౌక ముగిని 405 మంది గల్లంతు

చైనాలో తుఫాన్ కారణంగా ఓ నౌక అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 450 మంది జలమయం అయ్యారు. వివరాల ప్రకారం ఈస్టెన్ స్టార్ అనే నౌక చైనాలోని అతి పొడవైన నదిగా పేరొందిన యాంగ్జీ నది మీదుగా ప్రయాణిస్తుంది. అయితే ఒక్కసారిగా విపరీతమైన గాలులు, తుఫానుతో ప్రతికూల వాతవరణం ఏర్పడి నౌక నదిలో మునిగి పోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే నౌకలో మొత్తం 405 మంది ప్రయాణికులు, 47 మంది సిబ్బంది ఉండగా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగారు. తుఫాన్ వల్ల సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందని, గల్లంతైనవారి కోసం గాలిస్తున్నామని చైనా అధికారులు తెలిపారు.

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం.. కేసీఆర్

  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని వారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, అలాంటి వారికోసం ఎంతటి కష్టానైనా భరిస్తానని అన్నారు. అంతేకాక ఆయన చేపట్టిన, చేపట్టబోయే పలు అంశాల గురించి సభాపూర్వకంగా తెలియజేశారు. * సంక్షేమ పథకాల కోసం 28 వేల కోట్లు * మిషన్ కాకతీయ పథకం ద్వారా 46వేల చెరువులు బాగు చేస్తాం * హరితహారం కింద 300 కోట్ల మొక్కలు నాటుతాం * వచ్చేనెల జులైలో 25వేల ఉద్యోగాలకు ప్రకటనల జారీ * 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకం చేపడతాం * 50 వేల డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణం * ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ * రూ.91వేల కోట్లతో విద్యుత్ ప్రాజెక్టలతో 2018 నాటికి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ * అంగన్ వాడీ ఉద్యోగులకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం * మహిళల భద్రతకోసం షీ టీమ్స్ ఏర్పాటుచేశాం * రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ * రూ. 20 వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశాం

అసూయపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా... చంద్రబాబు

రాష్ట్రాన్ని విభజించినవారే అసూయపడేలా ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముందున్న ఒకే ఒక సంకల్పం నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణమని, దీనికోసం మేము అహర్నిశలు శ్రమిస్తామని ప్రజలు కూడా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు. అంతేకాక నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషిచేస్తామని దీక్షకు వచ్చిన ఉద్యోగులు, ప్రజలతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ కోరుకునేదని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరైనా తెలుగుప్రజలంతా ఒక్కటేనని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు.

తెలంగాణ ఆవిర్బావ వేడుకలు ప్రారంభం

ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం వేదికైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని మొదట పోలీసుల గౌరవ వదనం స్వీకరించారు. తరువాత పోలీసు కవాతు, తెలంగాణ సంస్కృతిని తలపించేలా చేసిన శకటాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు పలువురిని సత్కరించారు.

నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఏపీ సీఎం

ఆంధ్రరాష్ట్ర నవనిర్మాణ దీక్షలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా కార్యక్రమంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని నాని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చాలా దారుణంగా విడదీసి ప్రజలకు అన్యాయం చేశారని, అయినా ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందని అన్నారు. అంతేకాకుండా విభజన వల్ల విద్యార్ధులు తమ మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు కోల్పోయారన్నారు.

జూన్ 7న వైకాపాలో బొత్స చేరే అవకాశం

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే. ఆయన ఈనెల 7వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఆయన ఈనెల 9న విజయనగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి ఆయన సమక్షంలో వైకాపాలో చేరుదామని భావించినట్లు వార్తలు వచ్చేయి. కానీ పార్టీలోకి తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లా వైకాపా నేతల ముందు ఆ విధంగా బల ప్రదర్శన చేయడం వలన వారి నుండి మరింత వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో దానిని విరమించుకొన్నట్లు సమాచారం. కనుక లోటస్ పాండ్ నివాసంలోనే జగన్ సమక్షంలో జూన్ 7న  వైకాపాలో చేరాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఫలితాలు

  తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. ఆరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలపి 120 మంది ఎమ్మెల్యేలు వుండగా, 118 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగ్‌కి హాజరు కాలేదు. పోలైన ఓట్లలో 5 ఓట్లు చెల్లలేదు. ఒక ఎమ్మెల్యే నోటా హక్కును వినియోగించుకున్నాడు. విజయం సాధించిన టీఆర్ఎస్ సభ్యులు... 1. కడియం శ్రీహరి, 2. తుమ్మల నాగేశ్వరరావు, 3. నేతి విద్యాసాగర్ రావు, 4. యాదవ్ రెడ్డి, 5. బి.వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత.